దేశంలోనే మన పోలీసులు భేష్‌

– విపత్కర స్థితిలోనూ పని చేసే స్థైర్యం పోలీసులది
– పతకాలు పొందిన అధికారులను సన్మానించిన డీజీపీ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా నిలబడి సత్తా చాటుకునేవాడే పోలీసనీ, ఈ విషయంలో రాష్ట్ర పోలీసులు దేశంలోనే ప్రఖ్యాతి సాధించారని డీజీపీ అంజనీకుమార్‌ అన్నారు. గురువారం డీజీపీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రకటించిన రాష్ట్రపతి పోలీసు గ్యాలంటరీ పతకాలను సాధించిన 38 మంది పోలీసు అధికారులను అంజనీకుమార్‌ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నుంచి విశిష్ట పతకాలను పొందం పోలీసుల విధి నిర్వహణకు ఒక మచ్చు తునక అని అన్నారు. రాష్ట్రంలో గ్రేహౌండ్స్‌, ఎస్‌ఐబీ, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగాలు తమకు కేటాయించబడ్డ ప్రత్యేక అసైన్‌మెంట్లను సమర్థవంతంగా పూర్తి చేయటంలో సక్సెస్‌ రేటును సాధించాయని ఆయన అన్నారు. వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాదాన్ని ఎదుర్కొని వారి కార్యకలాపాలను అణచివేయటంలో ఈ మూడు విభాగాలతో పాటు రాష్ట్ర పోలీసులు మంచి ఫలితాలను సాధించి ఇతర రాష్ట్రాల పోలీసులకు మార్గదర్శకులుగా నిలిచారని ఆయన కొనియాడారు. శాంతిభద్రతలను కాపాడటంతో పాటు విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలిచి వారిని ఆదుకోవటంలోనూ పోలీసులు ఘనత వహించారని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలను సాధించి తమ వ్యక్తిగత ప్రతిష్టతో పాటు రాష్ట్ర పోలీసు శాఖ ఇమేజీని కూడా పెంచాలని ఆయన అధికారులకు పిలుపునిచ్చారు. ప్రతిష్టాకరమైన రాష్ట్ర పోలీసు పతకాన్ని పొందిన రాష్ట్ర గ్రేహౌండ్స్‌, ఆపరేషన్స్‌ విభాగం అదనపు డీజీ విజరుకుమార్‌ మాట్లాడుతూ.. అంకితభావంతో పని చేసే పోలీసు అధికారులు, సిబ్బందికి పతకాలు వాటంతట అవే వరిస్తాయని అన్నారు.కార్యక్రమంలో వ్యాఖ్యాతగా రాష్ట్ర ప్రొవిజన్స్‌, లాజిస్టిక్స్‌ ఐజీ రమేశ్‌ వ్యవహరించగా, సీఐడీ అదనపు డీజీ మహేశ్‌ భగవత్‌, ఐజీలు షానావాజ్‌ ఖాసీం, చంద్రశేఖర్‌రెడ్డి, తరుణ్‌జోషి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సందర్భంగా పతకాలు పొందిన అధికారులను డీజీపీతో పాటు ఇతర అధికారులు శాలువలు కప్పి సత్కరించారు.