– విరాట్ కోహ్లితో బంధంపై గౌతం గంభీర్
– అందుబాటులో ఉంటాడనే సూర్యకు కెప్టెన్సీ
– చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టత
టీ20 కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యను కాదని సూర్యకుమార్ ఎంపిక. వన్డే జట్టులో సూర్యకుమార్, రవీంద్ర జడేజాకు చోటు లేకపోవటం. శ్రీలంక పర్యటనకు భారత జట్ల ఎంపికపై అభిమానులను విస్తుగొలిపేలా చేసిన నిర్ణయాలు ఇవి. సెలక్షన్ కమిటీ చైర్మెన్ అజిత్ అగార్కర్ ఎంపిక వెనుక కారణాలను తొలిసారి మీడియాకు వెల్లడించగా.. విరాట్ కోహ్లితో తన బంధం వ్యక్తిగతమని చీఫ్ కోచ్ గౌతం గంభీర్ వ్యాఖ్యానించాడు. శ్రీలంకతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టు కొలంబో బయల్దేరింది.
నవతెలంగాణ-ముంబయి
భారత క్రికెట్‌లో ఢిల్లీ బార్సు విరాట్ కోహ్లి, గౌతం గంభీర్ మైదానంలో భావోద్వేగాలను ఏమాత్రం నియంత్రణలో ఉంచుకోలేరు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోహ్లి, గంభీర్ నడుమ జరిగిన కొన్ని సంఘటనలు సోషల్ మీడియాను ఊపేశాయి. భారత క్రికెట్ డ్రెస్సింగ్‌రూమ్‌లో విరాట్ కోహ్లి, గౌతం గంభీర్ మరోసారి కలిసి పని చేసేందుకు రంగం సిద్ధమైంది. గౌతం గంభీర్ చీఫ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టగా.. విరాట్ కోహ్లితో తన బంధంపై మీడియాకు స్పష్టత ఇచ్చాడు. ‘కోహ్లితో నా బంధం టీఆర్‌పీలు పెంచటం కోసం కాదు. గ్రౌండ్‌లో ప్రతి ఒక్కరు తమ జట్టు కోసం, విజయం కోసం పోరాడతారు. ఇప్పుడు కోహ్లి, నేను భారత జట్టు, 140 కోట్ల మంది అభిమానుల కోసం టీమ్ ఇండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాం. ఇద్దరం మరింత కష్టపడి భారత్ గర్వపడే విజయాలు సాధిస్తామని భావిస్తున్నాను. కోహ్లితో వ్యక్తిగతంతో ఎన్నోసార్లు చాట్ చేశాను. ఆ విషయాలు బహిరంగం చేయాల్సిన అవసరం నాకు లేదు. మైదానం బయట కోహ్లితో గతంలో ఉన్నట్టే ఇప్పుడూ కొనసాగుతుంది’ అని గౌతం గంభీర్ అన్నాడు. చీఫ్ కోచ్‌గా గౌతం గంభీర్ సహాయక సిబ్బందిని ఎంచుకునే స్వేచ్ఛను బీసీసీఐ ఇచ్చినట్టు కనిపిస్తుంది. కోల్‌కత నైట్‌రైడర్స్‌కు పని చేసిన అభిషేక్ నాయర్, రియాన్ టెన్‌లు అసిస్టెంట్ కోచ్‌లుగా నియమితులు కాగా.. ఫీల్డింగ్ కోచ్‌గా టి. దిలీప్ కొనసాగనున్నారు.
సూర్యకు ఆ అర్హత ఉంది : ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు హార్దిక్ పాండ్య వైస్ కెప్టెన్. రోహిత్ శర్మ గైర్హాజరీలో భారత ద్వైపాక్షిక సిరీస్‌లకు నాయకత్వం వహించిన అనుభవం సొంతం. అయినా, రోహిత్ శర్మ వారసుడిగా టీ20 ఫార్మాట్ పగ్గాలు హార్దిక్‌కు కాకుండా సూర్యకుమార్ యాదవ్‌కు దక్కాయి. ‘టీ20 కెప్టెన్సీ నిర్ణయం తీసుకునేముందు హార్దిక్ పాండ్యతో మాట్లాడాను. అతడు జట్టుకు విలువైన ఆటగాడు. ఈ నిర్ణయంతో హార్దిక్ పని ఒత్తిడిని సైతం చూసుకున్నట్టు అవుతుంది. సూర్యకుమార్ యాదవ్‌కు మంచి క్రికెట్ జ్ఞానం ఉంది. ఏడాదికి పైగా జట్టుతో కొనసాగుతున్నాడు. డ్రెస్సింగ్‌రూమ్ అభిప్రాయాలను సైతం పరిగణనలోకి తీసుకుని సూర్యకుమార్ యాదవ్‌ను టీ20 కెప్టెన్‌గా ఎంపిక చేశాం. నాయకుడు అందుబాటులో ఉండి అన్ని మ్యాచుల్లో ఆడేలా ఉండాలని భావించాం.
అందుకే సూర్యకుమార్ యాదవ్ వైపు మొగ్గుచూపాం. టీ20 సారథ్య పగ్గాలు అందుకునే అర్హతలు ఉన్నవారిలో సూర్యకుమార్ యాదవ్ సైతం ఉన్నారు. నాయకత్వ బాధ్యతల్లో సూర్యకుమార్ యాదవ్ ఏ విధంగా రాణిస్తాడనే విషయం చూడాలి. రవీంద్ర జడేజాకు పక్కనపెట్టాలి. టెస్టు జట్టుకు అతడు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలనే ఆలోచనతో సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. మహ్మద్ షమి టెస్టు సీజన్ సమయానికి ఫిట్‌నెస్ సాధిస్తాడని ఆశిస్తున్నాం. సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు సమయానికి మహ్మద్ షమి పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని ఎన్‌సీఏ అంచనా వేసింది’ అని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ అన్నారు.