మా పాఠశాలను యథావిధిగా కొనసాగించాలి

Our school should continue as usual– విద్యార్థులు, గ్రామస్తుల రాస్తారోకో
నవతెలంగాణ-ముధోల్‌
నిర్మల్‌ జిల్లా ముధోల్‌ మండలంలోని చించాల గ్రామంలో గురువారం విద్యార్థులు, గ్రామస్తులు పాఠశాల కోసం రోడ్డుపై బైటాయించారు. ఉన్నత పాఠశాలను తమ గ్రామంలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. 6, 7, 8వ తరగతి విద్యార్థులు ఉన్నప్పటికీ జిల్లా విద్యాశాఖాధికారి పిల్లలను ఎడ్‌బిడ్‌ పాఠశాలకు పంపడం అన్యాయమన్నారు. ఇలా చేయడంతో విద్యార్థులకు రవాణ చార్జీలు భారమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పాఠశాలకు ప్రధానోపాధ్యాయులతో పాటు మూడ్రోజుల కింద రూ.6లక్షల సాంకేతిక పరికరాలు సైతం వచ్చాయని చెప్పారు. 9, 10 తరగతుల్లో పిల్లలు లేకుంటే 6, 7, 8వ తరగతుల్లో పిల్లలు ఉన్నప్పటికీ అధికారులు మరో పాఠశాలలో కలిపి తమ గ్రామానికి అన్యాయం చేయొద్దని కోరారు. ఫోన్‌ చేసినా జిల్లా విద్యాశాఖాధికారులు ఎత్తడం లేదన్నారు. తాము వినతిపత్రం అందజేసినా పట్టించుకోకుండా ఇలా చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మా పాఠశాల మాకు కావాలని, విద్యార్థులకు గ్రామంలోనే విద్యాబోధన చేయాలని డిమాండ్‌ చేశారు.