
నవతెలంగాణ-భువనగిరి : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ పీడ పట్టుకుందని ఆ పీడ పోయేంత వరకు మా పోరాటం ఆగదని శివసేన బలపరిచిన తెలంగాణ పునర్నిర్మాణ సమితి భువనగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పూస శ్రీనివాస్ తెలిపారు శనివారం భువనగిరి శాసన సభ్యునిగా పోటీ చేయడానికి భువనగిరి పట్టణంలో అర్థనగ్నంగా రిక్షా తొక్కుకుంటూ పూస శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఆత్మహత్యలకు కారణమైన ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి రాకుండా చూసుకోవాలని ప్రజలను కోరారు. భువనగిరి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ, డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలలను తీసుకొని రాలేదని, మండలానికి 5 పరిశ్రమలను తేకుండా నిరుద్యోగులకు అన్యాయం చేసినందున భువనగిరి ప్రజలు ఆలోచించి “నాలాంటి నిరుద్యోగులకు ఓటు వేయాలని” కోరారు .భువనగిరి పట్టణంలో 4600 అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని అది ఇవ్వకుండా పేదవారితో గత పాలకులు ఆడుకున్నారని పూస శ్రీనివాస్ ఆవేదన వెల్లుబుచ్చినారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఊదరి బాల మల్లేష్యాదవ్, బండారు సుమన్, బోయిని శివ, బోయిన రాజు, కళావతి, కల్పన, సురేంద్ర, సాయి చరణ్, మణికంఠ పాల్గొన్నారు.