మన ఆలోచనలే మన ఆరోగ్యం

మన ఆలోచనలతోనే మన ఆరోగ్యం, అనారోగ్యాలు ఆధారపడి వుంటాయంటారు మనోవైజ్ఞానికులు. మన ఆలోచనలు ఎప్పుడైతే బాగుంటాయో మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. మన ఆలోచనలు బాగా లేనప్పుడు మనం అనారోగ్యం పాలవుతాం. ఆలోచనలంటే మనసే కదా! అదే మనం మానసికంగా బాగలేకుంటే మన ఆరోగ్యం బాగుండదు. ఇక్కడ మనం అర్ధం చేసుకోవలసిన అంశమేమిటంటే మన మనస్సుకు మన ఆరోగ్యానికి సంబంధం వుందన్నమాట!

ఆలోచనలు… మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగిస్తాయని శాస్త్రజ్ఞుల మాట! వైద్య రంగంలోని వివిధ విభాగాలకు చెందిన పరిశోధకులు సైకో న్యూరో ఇమ్యునాలజీ అనే సరికొత్త విభాగాన్ని ఏర్పాటు చేసి అనేక పరిశోధనలు చేశారు. వాటిలో తేలిన విషయాలేమిటంటే… మనం చేసే ఆలోచనలు మంచివి అయితే… అవి సానుకూలమని, చెడువయితే ప్రతికూల మంటారని తేల్చి చెబుతూ వీటిపైనే మన ఆరోగ్య, అనారోగ్యాలు ఆధారపడి వుంటాయన్నారు. శాస్త్రజ్ఞుల పరిశోధనలు మనం విశ్లేషించుకుంటే ప్రేమ, అనురాగం, పరోపకార భావనలవంటివన్నీ సానూకూల ఆలోచనలని, ద్వేషం, హేయం, అపకార భావనల వంటివన్నీ ప్రతికూల ఆలోచనలుగా భావించాలి.
భారతీయ విద్యావేత్త జిడ్డు కృష్ణమూర్తి ‘ఆలోచించే వాడి నుండి అతని చర్యలను వేరుచేయలేం. ఆలోచించేవాడు తన పనుల ద్వారానే తన దు:ఖాన్ని, సుఖాన్ని, జ్ఞానం, అజ్ఞానాన్ని నిర్మించుకుంటున్నాడు’ అంటారు.
నార్మన్‌ విన్సెంట్‌ పీలే అనే ఆయన అమెరికా దేశస్తుల మత ప్రచారకుడు. ఆయన రాసిన ది పవర్‌ ఆఫ్‌ పాజిటివ్‌ థింకింగ్‌ (సానుకూల ఆలోచనాశక్తి అనే పుస్తకం చాలా ప్రసిద్ధి చెందింది. ఆయన ‘సానుకూల ఆలోచన’ అనే భావనను తన పుస్తకం ద్వారా ప్రాచుర్యంలోకి తెచ్చాడు. మనలో పరిస్థితులను బట్టి కలిగే భావోద్వేగాల (ఎమోషన్స్‌) వల్లే మన మెదడులో ఆలోచనలు ఉద్భవిస్తాయి. వాటి ఫలితంగానే మన ప్రవర్తనలు వుంటాయి. ఆ ఆలోచనలే పాజిటివ్‌ (సానుకూలం), నెగెటివ్‌ (ప్రతికూలం) భావనలు ఏర్పడుతాయి అంటారు పీలే.
పాజిటివ్‌ (సానుకూల) భావనలు: నార్మన్‌ పీలే సానకూల భావనల గరించి చెబుతూ మనం ‘మానసిక ప్రశాంతత, మంచి ఆరోగ్యం, మేలు చేసే జీవశక్తి పొందడం వంటి వాటి కోసం చేసే మంచి ఆలోచనలు మనల్ని మంచివైపు నడిపిస్తాయి. వీటినే పాజిటివ్‌ థింకింగ్‌ అంటారు.
ఇతరులను తన వారి వలె ప్రేమించడం, శక్తిమేరకు ఇతరులకు సాయపడుతుండడం, కొత్త పనులు చేయడం, తెలియని విషయాలు నేర్చుకోవడం, సానుభూతి తెలపడం, నమ్మకం కలిగుండడం వంటి వన్నీ సానుకూల భావనలే! ఈ భావనల కారణంగా మన ఆలోచనలు సానుకూలమవుతాయి. సానుకూల ఆలోచనలతో మనం ఆరోగ్యంగా వుంటాం. అనారోగ్యం దరిచేరదు.
వీటికి వ్యతిరేక భావనలే ప్రతికూల ఆలోచనలు. ప్రతికూల ఆలోచనలతోనే మనం అనారోగ్యంగా మారుతాం.
ప్రతికూల ఆలోచనలు రాకుండా ఏం చేయాలి?
ప్రతి సమస్యను భూతద్దంలోంచి చూసి మెదడు నరాలు చిట్లిపోయేలా ఆలోచించడం, జరిగిపోయిన నష్టం గురించి ఆలోచిస్తూ ఎడతెగని బాధను అనుభవించడం, అపనమ్మకంతో భయపడడం, తనను తాను అసమర్ధునిగా భావించడం, ప్రతి విషయంలో నిరాశ, నిస్పృహలకు లోనవడం వంటివన్నీ ప్రతికూల ఆలోచనలే!
మనకు ఎదురయ్యే ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కోవడం, తన మీద తనకు నమ్మకం కలిగుండడం, మఖంపై చెరగని చిరునవ్వు తెచ్చుకోవడం, చిన్నచిన్న విషయాలకు కూడా కాదు, లేదు అనే ప్రతికూల శబ్దాలను ఉపయోగించకుండా ఉండడం, ఆందోళనలు, ఒత్తిళ్లకు దూరం వుండడం, చక్కని సంగీతాన్ని ఆస్వాదించడం వంటి వాటితో ప్రతికూల ఆలోచనలకు దూరంగా వుండగలం.
సుధాంషు మహరాజ్‌ అనే ఆధ్యాత్మికవేత్త ”మన ఆలోచనలే మన జీవితాన్ని నిరంతరం రూపొందిస్తుంటాయి. మన నమ్మకాలు ఎప్పుడూ మన జీవిత ఉద్దేశాలపై పనిచేయాలి. సంతోషంగా ఉండాలనే మన దృఢనిర్ణయం మనల్ని పరిస్థితుల ముందు తల వంచకుండా చేస్తుంది. వ్యక్తులతో సత్సంబంధాలు కలిగి వుండేటట్టు మనమే ప్రయత్నం చేయాలి. ఎవరూ నిన్ను ఓడించరు. ప్రతికూల ఆలోచనలతో నిన్ను నీవే ఓటమిపాలు చేసుకుంటావు” అంటారు.
క్రిస్టన్‌ డిలారెన్‌ అనే ప్రఖ్యాత మానసిక శాస్త్రవేత్త ”సరైన ఆలోచనా శక్తితో చైతన్యవంతుడైన వ్యక్తి తనను తాను మార్చుకోగలడు. తన జీవన విధానాన్ని తానే ఆజ్ఞాపించకోగలడు.
మనస్తత్వవేత్తల పాజిటివ్‌ థింకింగ్‌ కోసం కొన్ని సూచనలు, సలహాలు ఇస్తున్నారు…
– పుస్తక పఠనం నిత్యం కొనసాగించాలి.
– మనల్ని నిరుత్సాహ పరిచే వ్యక్తులకు దూరంగా వుండాలి.
– మనలోని లోపాలు, బలహీనతలను దూరం చేసుకునే ప్రయత్నం చేయాలి.
– ఆహార విహారాదుల పట్ల జాగ్రత్త పడాలి.
– ప్రతిరోజు ఉదయం నాలుగైదు గంటల మధ్య నిద్ర లేవాలి.
– యోగా, ధ్యానం అభ్యసించాలి.
– శారీరక వ్యాయామం నిత్య కృత్యంగా మార్చుకోవాలి.
– ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా వుండాలి.
– మనం ఇష్టపడని వాటిపట్ల ఎక్కువ ఆలోచించకూడదు.
– మనం ఏ జబ్బుతోనైనా బాధపడుతున్నప్పుడు ఆ జబ్బు గురించి ఇతరులతో ఎక్కువ మాట్లాడకూడదు.
– మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఆధ్యాత్మికత దోహదపడుతుంది.
పాజిటివ్‌ థింకింగ్‌ అనేది పెద్ద సమస్య కాదు. మనసుంటే మార్గం వుంటుంది. నేడు మనిషి తలచుకుంటే ఏదీ అసాధ్యం కాదు. డాక్టర్‌ బెన్‌ జాన్సన్‌ ‘మనం ఇప్పుడు ‘శక్తి’ అనే మెడిసిన్‌ యుగంలో వున్నాం. ఇప్పుడు దేన్నైనా మార్చుకోవడం చాలా సులభం. అది ఓ వ్యాధి కావచ్చు, భావోద్వేగాల సమస్య కావచ్చు. మనసుంటే మార్గం వుంటుందని గుర్తించుకుంటే చాలు’ అంటారు. మరి ఆయన చెప్పింది నిజమే కదా!

– పరికిపండ్ల సారంగపాణి,
9849630290, కౌన్సిలింగ్‌ సైకాలజిస్ట్‌.