అటకెక్కిన మన ఊరు-మనబడి పనులు

We are stuck in our village-manabadi works– నిధులు మంజూరైనా పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లు
– అధికారుల పర్యవేక్షణ కరువు
– శిథిలావస్థలో ఉన్న ప్రాథమిక పాఠశాల గదులు
– పనులు వెంటనే మొదలు పెట్టాలని గ్రామస్తుల వేడుకోలు
నవతెలంగాణ-నిజాంపేట
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వుం ప్రభుత్వ బడులను సుందరీకరణతో తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో మన ఊరు మనబడి పథకంలో భాగంగా వేలకోట్ల రూపాయలను మంజూరు చేసింది. మెదక్‌ జిల్లా నిజాంపేట మండల కేంద్రానికి చెందిన జిల్లా పరిషత్‌ హైస్కూల్‌కు దాదాపు రూ.20 లక్షల వరకు, ప్రాథమిక పాఠశాలకు రూ.86 లక్షల వరకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసి దాదాపు ఆరు నెలలు అవుతుంది. ఇప్పటికీ కాంట్రాక్టర్లు పనులు మొదలుపెడుతలేరని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు చదువుకోవడానికి గదులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న గదులలో కూడా వర్షానికి తేమ వస్తుందని భారీ వర్షాలకు గదులు ఊరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవుడు వరమిచ్చినా పూజారి కనుకరించడు అనే విధంగా తయారయింది పాఠశాల పరిస్థితి. పాఠశాల భవన నిర్మాణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లయితే కాంట్రాక్టర్లు ఎప్పుడో పనులు చేసి పెట్టే వారని, ప్రభుత్వ అలసత్వం వల్లనే పనులు జరగడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకుని పనులు మొదలు పెట్టేలా తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.
నిధులు మంజూరుచేసినా ఫలితం లేదు
ప్రభుత్వం మన ఊరు-మనబడి పథకం కింద నిధులు మంజూరు చేసినామని చెప్తున్నారు తప్ప పనులు ఎక్కడ వరకు జరిగాయనే విషయాన్ని పరిశీలించే నాథుడే కరువయ్యాడు. ప్రాథమిక పాఠశాల గదులు శిథిలావస్థలో ఉన్నాయని నూతనంగా గదులు నిర్మించడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ కాంట్రాక్టర్లు పనులు మొదలు పెట్టకపోవడం బాధాకరం. ఇతర గ్రామాలలో పనులు పూర్తిగా జరిగాయి. నిజాంపేట మండలంలో పనులు చేపట్టకపోవడంలో అంతర్యమేమిటో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే మన ఊరు మనబడి పథకంలోని పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి.
-కొండేరు ప్రభాకర్‌, నిజాంపేట

పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలి
జిల్లా పరిషత్‌ హై స్కూల్‌ పనులు కూడా మొదలు పెట్టడం లేదు. విద్యార్థులు తినడానికి డైనింగ్‌ హాలు లేక బయట చెట్ల కిందనే కూర్చొని తినే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ పనులు మొదలు పెట్టకపోవడమేమిటో అర్థం కావడం లేదు. ఇతర గ్రామాలలో పనులు మొదలుపెట్టడం జరిగింది పనులు కూడా పూర్తిగా అయిపోయాయి. నిజాంపేటలో కూడా వెంటనే పనులు ప్రారంభించాలి.
– కన్నాపురం బాగా గౌడు, నిజాంపేట