77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మన మహిళలు చరిత్ర సృష్టించారు. మానవత్వాన్ని చాటి చెబుతూ తాను నిర్మించిన ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ చిత్రానికి గాను ఉత్తమ నిర్మాతగా పాయల్ కపాడియా అవార్డు అందుకున్నారు. అలాగే ‘ది షేమ్‌లెస్’ చిత్రంలో ప్రదర్శించిన అద్భుతమైన నటనకు అనసూయ సేన్‌గుప్తా ఉత్తమ నటిగా నిలిచారు. 30 ఏండ్ల తర్వాత తిరిగి మన దేశ సినిమాను ప్రపంచ వేదికపై నిలబెట్టిన వారి పరిచయాలు నేటి మానవిలో…
అప్పుడు దేశద్రోహి అన్నారు…
పాయల్ కబాడియా… ప్రముఖ చిత్రకారిణి, వీడియో ఆర్టిస్ట్ అయిన మనాలి నళిని కూతురు. ముంబైలో పుట్టి ఆంధ్రప్రదేశ్‌లోని రిషి వ్యాలీ స్కూల్లో చదువుకున్నారు. అక్కడే ఆమెకు ప్రముఖ దర్శకులు రిత్విక్ ఘటక్, ఆండ్రీ తర్కోవ్‌స్కీ పరిచయమయ్యారు. తర్వాత ముంబైలోని సెయింట్ జేవియరన్స్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. సినిమాల పట్ల మక్కువ ఉన్న పాయల్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో(ఎఫ్‌టీఐఐ) ఫిల్మ్ డైరెక్షన్ కోర్సుని పూర్తి చేశారు. కోర్సు చేస్తూనే మోడలింగ్, వీడియో ఎడిటింగ్ చేస్తుండేవారు. ఫిలిం క్లబ్‌లో పాయల్ సభ్యురాలు.
ఎఫ్‌ఐఆర్ పెట్టి…
2015లో ఎఫ్‌టిఐఐలో ఆమె శిక్షణ పొందుతున్న రోజుల్లో గజేంద్ర చౌహాన్ అనే వ్యక్తిని దాని చైర్మన్‌గా నియమించింది ప్రభుత్వం. అతను ఓ టీవీ ఆర్టిస్టు, రాజకీయవేత్త. అయితే అక్కడ విద్యార్థులందరూ సంస్థకు చైర్మన్‌గా రాజీయవేత్తను కాకుండా ఆర్టిస్టును పెట్టమని పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎందుకంటే అతనికి సమాజంలో అంత మంచి పేరు లేదు. అలాంటి వ్యక్తి చైర్మన్‌గా ఉండటం సంస్థకు మంచిది కాదని విద్యార్థులంతా ముక్త కంఠంతో వ్యతిరేకించారు. 139 రోజులు సాగిన ఈ ఆందోళనలో పాయల్ కూడా కీలక పాత్ర పోషించారు. విద్యార్థులు క్లాసులకు వెళ్లకపోవడంతో హాస్టల్స్ ఖాళీ చేయాలని నోటీసులు సైతం ఇచ్చారు. ఓసారి విద్యార్థులంతా సంస్థ డైరెక్టర్‌ను ఘెరావ్ చేస్తే కేసులు పెట్టారు. ఇందులో పాయల్ పేరు కూడా ఉంది. అయినా ఆమె ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి స్కాలర్‌షిప్ కూడా రద్దు చేశారు. అంతేకాకుండా ‘కాషాయ శిబిర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే నీకు పట్టే గతి ఇదే, పాకిస్తాన్ వెళ్ళిపో’ అంటూ ఆమెను దోశద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇలా అనేక రకాలుగా వేధించారు. అయినా 2018లో డైరెక్షన్‌లో డిగ్రీ పట్టా పొందారు పాయల్. తర్వాత ఈ పోరాట సంఘటనలను ‘ఏ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్’ అనే పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించారు. 2022 కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో దీన్ని ప్రదర్శించారు. ఈ సినిమా గోల్డెన్ ఐ అవార్డును పొందింది.
ఇప్పుడు గర్వకారణం అన్నారు
అలాంటి పాయల్ గురించి ఇప్పుడు ‘కొత్తతరం భారతీయ నిర్మాతలకు పాయల్ కపాడియా ఓ స్ఫూర్తి’ అంటూ ప్రధాని మోడీ అభినందించారు. ఎందుకంటే అంతర్జాతీయ వేదికపై 30 ఏండ్ల తర్వాత భారత్ తరఫున ఆమె కేన్స్ వేదికపై చరిత్ర సృష్టించారు. ఈమె దర్శకత్వం వహించిన ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జ్యూరీ అవార్డును దక్కించుకున్నారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రధాన పోటీ విభాగంలో ఓ భారతీయ చిత్రాన్ని ప్రదర్శించడం గత 30 ఏండ్లలో ఇదే తొలిసారి. ఈ ఫెస్టివల్‌లో ఇది రెండో అతిపెద్ద అవార్డు. పాయల్ ఇప్పటి వరకు నిర్మించిన చిత్రాలన్నీ మహిళా ప్రాధాన్యం కలవే.
‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ గురించి
ముంబయి అంటే సంపన్న వర్గాలకు, బాలీవుడ్ స్టార్లకు, వ్యాపారవేత్తలకు పెట్టింది పేరు. అందుకు భిన్నంగా పాయల్ నిర్మించిన ఈ చిత్రం ముంబై నగర వాసుల అసలైన జీవితాన్ని కండ్లకు కట్టినట్లు చూపించింది. ముంబై వీధులకు, ఆ నగర వలసదారుల జీవితాలకు పాయల్ తన చిత్రంలో ప్రధాన స్థానం కల్పించారు. ఆర్థిక రాజధానిగా పేరున్న నగరానికి ఎంతో మంది వలసదారులు బతుకుదెరువు కోసం వస్తుంటారు. వీరే ఈ నగర హృదయ స్పందన. ఇది ఆమె తొలి నెరేటివ్ ఫీచర్ ఫిల్మ్. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రధాన కాంపిటిషన్ సెక్షన్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. చిత్ర ప్రదర్శన ముగియగానే ప్రేక్షకులంతా లేచి నిల్చుని 8 నిమిషాల పాటు చప్పట్లు కొట్టారు. ఈ సినిమా జ్యూరీ అవార్డును దక్కించుకోవడం కేవలం ఆ చిత్ర దర్శకురాలికే కాదు, భారతదేశం మొత్తానికి గర్వకారణం. ‘ది గార్డియన్’ పత్రిక ఈ సినిమాకు 5 స్టార్లు ఇచ్చింది. ‘అద్భుతం.. పూర్తి మానవత్వంతో నిండిన కథ’ అని కొనియాడింది. సత్యజిత్ రే మహానగర్, అరణ్యార్ దిన్ రాత్రితో ఈ సినిమాను పోల్చారు.
చాలా కంగారుగా అనిపించింది
అవార్డు అందుకున్న తర్వాత పాయల్ మాట్లాడుతూ ‘ఇది నిజంగా నమ్మలేకపోతున్నా. నన్ను నేను గిచ్చుకున్నా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నిలబడటం నిజంగా చాలా ప్రత్యేకం. ఈ పోటీలో ఎంపిక కావాలనే నా కల నిజమైంది. ఈ అవార్డు నా ఊహకు అందనిది. అవార్డు దక్కించుకోవడానికి మరో భారతీయ సినిమాకు 30 ఏండ్లు పట్టదని నేను అనుకుంటున్నాను’ అన్నారు. అవార్డు అందుకునే సమయంలో పాయల్ ఈ సినిమాలో నటించిన ముగ్గురు మహిళలను వేదికపైకి పిలిచి ‘వీరు లేకుండా ఈ చిత్రం తీయడం అసాధ్యం. ఈ ముగ్గురూ నాకెంతో సహకరించారు. నన్ను తమ సొంత కుటుంబ సభ్యురాలిగా, ఈ చిత్రాన్ని తమదిగా భావించారు’ అంటూ పంచుకున్నారు.
ఇదే కథ
ముంబై నర్సింగ్ హౌమ్‌లో పని చేసే కేరళకు చెందిన ఇద్దరు నర్సుల కథే ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’. వీరు తమ తమ భర్తలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇద్దరూ కలిసి ఓ బీచ్ టౌన్‌కు రోడ్ ట్రిప్‌కు వెళ్తారు. అక్కడ వారికి కనిపించిన అడవిలో ఏం జరిగింది? దాని వల్ల వారి జీవితాలు ఎలా మారాయి? అన్నదే చిత్ర కథ. ఈ సినిమాకు అంతర్జాతీయ పబ్లికేషన్స్‌లో మంచి రివ్యూలు వచ్చాయి.
క్వీర్ కమ్యూనిటీకి అంకితం
77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భారత క్రీడాకారిణి అనసూయ సేన్‌గుప్తా ఉత్తమ నటిగా నిలిచారు. ఈ అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయ నటిగా ఈమె చరిత్ర సృష్టించారు. ది షేమ్‌లెస్ చిత్రానికి గానూ ఆమెకు ఈ అవార్డు లభించింది. ఈ చిత్రంలో అనసూయ సెక్స్ వర్కర్‌గా నటించారు. బల్గేరియన్ ఫిల్మ్ మేకర్ కాన్స్టాంటిన్ బోజనోవ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమా కథ ఇద్దరు సెక్స్ వర్కర్ల గురించి.
వీరు జర్నలిస్ట్ కావాలని
బెంగాల్‌కు చెందిన అనసనూయ జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యాన్ని అభ్యసించారు. మొదట్లో ఆమె జర్నలిస్టుగా తన కెరీర్ కొనసాగించాలని అనుకున్నారు. అయితే 2009లో ‘మ్యాడ్లీ బెంగాలీ’ అనే చిత్రంలో ఆమెకు నటించే అవకాశం వచ్చింది. దాంతో ముంబై వచ్చేశారు. ఆమె సోదరుడు అభిషేక్ సేన్‌గుప్తా అప్పటికే నటుడు. మొదట్లో అనసూయ ఆర్ట్ విభాగంలో పనిచేయడం ప్రారంభించారు. తర్వాత ప్రొడక్షన్ డిజైనర్‌గా చేశారు. నెట్‌ఫ్లిక్స్ షో అయిన ‘మసబా మసబా’కు ప్రొడక్షన్ డిజైన్ కూడా చేశారు. ప్రస్తుతం ఆమె గోవాలో నివసిస్తున్నారు.
షేమ్‌లెస్ గురించి
‘ది షేమ్‌లెస్’ దర్శకుడు కాన్‌స్టాంటిన్ 2014లో తొలిసారిగా భారతదేశానికి వచ్చారని మీడియా నివేదికలలో చెప్పబడింది. ఇక్కడ అతను 4 కథలను కలిపి ఒక ఫీచర్-లెంగ్త్ డాక్యుమెంటరీని రూపొందించాలనుకున్నాడు. కానీ ఈ సమయంలో అతను చాలా సమస్యలను ఎదుర్కొన్నాడు. కాన్‌స్టాంటిన్‌కు ఆర్థిక సహాయం కూడా లభించలేదు. దాంతో దాని యానిమేటెడ్ వెర్షన్‌ను రూపొందించుకోవాలనుకున్నాడు. ఇందుకోసం అప్పట్లో క్యారెక్టర్ విజువలైజర్, ప్రొడక్షన్ డిజైనర్‌గా ఉన్న అనసూయను కలిశారు. ఆమెను చూసిన అతను సినిమాలో ప్రధాన పాత్రలో నటించమని కోరాడు. ఆమె ఒప్పుకోవడంతో ఇండియా, నేపాల్‌లో ఈ చిత్రాన్ని చిత్రీకరించారు.
వీరు కూడా పోరాడాలి
ఈ అవార్డును స్వీకరిస్తూ అనసూయ ‘ఈ అవార్డు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్వీర్ కమ్యూనిటీ, ఇతర అట్టడుగు వర్గాలకు అంకితం చేస్తున్నాను. దేశంలో అన్ని వర్గాల ప్రజలు ధైర్యంగా పోరాడుతున్నారు. వీరు కూడా పోరాడాలి. సమాజంలో సమాన హక్కులు పొందడానికి వారు ఈ పోరాటం చేయాలి’ అన్నారు.