సాయుధ రైతాంగ పోరాట వారసత్వం మాది

– ఇబ్రహీంపట్నంలో ఎర్రజెండా ఎగురవేస్తాం : సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నర్సింహారావు
– నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి శూన్యం: అభ్యర్థి పగడాల యాదయ్య
నవతెలంగాణ-మంచాల
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వం తమదని, ఈ సారి ఎన్నికల్లో ఇబ్ర హీంపట్నంలో తప్పకుండా ఎర్రజెండా ఎగురవేస్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నర్సింహరావు అన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం సీపీఐ(ఎం) అభ్యర్థి పగడాల యాదయ్య మంచాల మండలంలో ప్రచారం నిర్వహించారు. మండలంలోని తిప్పాయిగూడ, చిత్తాపూర్‌, తాళ్ళపల్లిగూడ, లింగంపల్లి గ్రామాల్లో పార్టీ ప్రచారం కొనసాగింది. ఈ ప్రచారానికి డీజీ హాజరై మాట్లాడారు. ఇబ్రహీంపట్నం పోరాట వారసత్వం కలిగిన ప్రాంతమని, ఇక్కడ ఎర్రజెండా ఆధ్వర్యంలో వేల ఎకరాల భూమి పంపిణీ చేసినట్టు గుర్తు చేశారు. అంతేగాక సీపీఐ(ఎం) ఎమ్మెల్యేలుగా పనిచేసిన కొండిగారి రాములు, మస్కు నర్సింహ.. అనేక అభివృద్ధి పనులు చేశారని గుర్తుచేశారు. 15ఏండ్లుగా అసెంబ్లీలో సీపీఐ(ఎం) ఎమ్మెల్యేలు లేకపోవడంతో ఈప్రాంతం పూర్తిగా వెనుకబాటుకు గురైందన్నారు. ప్రజా సమస్యలను అసెంబ్లీలో వినిపించే వారే కరువయ్యారని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం సీపీఐ(ఎం)తోనే సాధ్యం అన్నారు. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటేసి తమ పార్టీ అభ్యర్థి పగడాల యాదయ్యను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. సీపీఐ(ఎం) అభ్యర్థి పగడాల యాదయ్య మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారంలో స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పూర్తిగా విఫలం అయ్యారన్నారు. ఆయనే మళ్లీ మరోసారి అవకాశం కోరడం విడ్డూరంగా ఉందన్నారు. తమకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో మండల కార్యదర్శి నాగిల్ల శ్యామ్‌ సుందర్‌, జిల్లా నాయకులు కర్నాటి శ్రీనివాస్‌రెడ్డి, గొరెంకల నర్సింహ, కందుకూరి జగన్‌, మండల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.