అవుట్‌ కం బేసిస్‌ టెండర్‌ విధానాన్ని రద్దు చేయాలి

– హైదరాబాద్‌ రైల్వే కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు ఎం.వెంకటేష్‌
– సికింద్రాబాద్‌ రైల్‌ నిలయం వద్ద ధర్నా
నవతెలంగాణ-ఓయూ
రైల్వే కాంట్రాక్టు కార్మికులకు నష్టం చేస్తున్న అవుట్‌ కం బేసిస్‌ టెండర్‌ విధానాన్ని రద్దు చేయాలని హైదరాబాద్‌ రైల్వే కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు ఎం.వెంకటేష్‌ డిమాండ్‌ చేశారు. ఆలిండియా డిమాండ్స్‌ డే సందర్భంగా శుక్రవారం సికింద్రాబాద్‌ రైల్‌ నిలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవుట్‌ కం బేసిస్‌ మీద టెండర్‌ విధానం వల్ల కార్మికుల సంఖ్య తగ్గించాలనేది రైల్వే నిర్ణయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రైళ్లు విపరీతంగా పెరిగినా కార్మికుల సంఖ్యను తగ్గిస్తూ పనిభారాన్ని రెట్టింపు చేయడమనేది దీని ఉద్దేశం అన్నారు. ఇది శ్రమ దోపిడీకి పరాకాష్ట అని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం ఇవ్వాలని, ప్రతినెలా ఏడో తేదీ లోపల వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. చట్ట ప్రకారం సెలవులు మంజూరు చేయాలని, పీఎఫ్‌ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. విచ్చలవిడిగా సాగుతున్న కాంట్రాక్టర్ల దోపిడీపై రైల్వే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
సీఐటీయూ గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ అధ్యక్షుడు జె.కుమార స్వామి మాట్లాడుతూ.. రైల్వే అధికారులు, కాంట్రాక్టర్ల వేధింపులు ఆపాలని, ప్రతి సంవత్సరం 8.33 శాతం అంటే ఒక నెల జీతం బోనస్‌గా ఇవ్వాలన్నారు. కార్మికుల బ్యాంక్‌ పాస్‌ బుక్స్‌, ఏటీఎం కార్డ్స్‌ దగ్గర పెట్టుకొని తక్కువ వేతనాలు ఇస్తున్న కాంట్రాక్టర్లు, అందుకు సహకరిస్తున్న రైల్వే అధికారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. పారామెడికల్‌ ఉద్యోగులు చాలామంది రైల్వే కార్మికులు, ఆఫీసర్ల ప్రాణాలు కాపాడటంలో కృషి చేశారని.. ఇప్పుడు వాళ్లందర్నీ ఉద్యోగాల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మెడికల్‌ డిపార్ట్‌మెంట్‌లో రిక్రూట్‌మెంట్‌ జరుగుతున్నదని.. ఈ పారామెడికల్‌ స్టాఫ్‌కు వెయిటేజ్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ధర్నా అనంతరం నాయకులు వెంకటేష్‌, అజరు బాబు నాయకత్వంలో జీఎం సెక్రటరీ ముత్యాల నాయుడును కలిసి వినతిపత్రం అందజేశారు. ముత్యాల నాయుడు స్పందిస్తూ.. దీన్ని జీఎం ముందు ప్రవేశపడతానని, తగిన చర్యలు చేసుకునేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ధర్నాలో యూనియన్‌ నేతలు శివ కుమార్‌, సీఐటీయూ సికింద్రాబాద్‌ జోన్‌ నేత ఎం.అజరు కుమార్‌, ఆర్‌.మల్లేష్‌, పారా మెడికల్‌ స్టాఫ్‌ నేత షాలిని, రైల్వే కాంట్రాక్టు కార్మికులు హరీష్‌ కుమార్‌, మంజుల, సాజిద బేగం, ఈదమ్ము, సంజీవ, సునీత పాల్గొన్నారు.