– సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్
– ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట ధర్నా
నవతెలంగాణ- ఓయూ
ఓయూలో ఔట్ సోర్సింగ్ విధానాన్ని ఎత్తేసి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి, ఆల్ యూనివర్సిటీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జె.వెంకటేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆర్ట్స్ కాలేజ్ ఎదుట ఓయూ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర బీజేపీ ప్రభుత్వం గ్రాంట్స్ విడుదల చేయకుండా యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తోందన్నారు.
పోస్టులను భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక హక్కులను కాపాడుకోవడం కోసం పిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మెను యూనివర్శిటీలలో కూడా విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు.
ఆల్ యూనివర్సిటీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. అందరం ఐక్యంగా పోరాడి ఔట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయించుకోవాలన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ యూనియన్ అధ్యక్షులు టి.మహేందర్ మాట్లాడుతూ.. ఓయూ ఉద్యోగులు దాదాపు 30 సంవత్సరాల నుంచి అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్నారన్నారు. వెంటనే అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి సీతారాం, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్ రావు, ఉపాధ్యక్షులు అనసూయ, శ్రీను, నాగరాజు, లక్ష్మణ్ గౌడ్, సహాయ కార్యదర్శులు నరేష్, శ్యామల, శివ, అంజమ్మ, పుష్ప, కుమార్, లక్ష్మణ్, మహేందర్, ఈశ్వరయ్య, వీరేశం, సుధాకర్ పాల్గొన్నారు.