
– వేతనాలు, పోస్టులు పునపరిశీలన చేయాలి: కార్మిక నేతలు..
నవతెలంగాణ – సూర్యాపేట
తెలంగాణ రాష్టంలోని పురపాలక సంఘాలలో ఇక నుండి అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్దతిన ఎవరిని కూడా నూతనంగా నియమించకుండా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తేదీ 31.3.2024 వరకు రాష్ట్ర లోని 141 మున్సిపాల్టీలలో ,సీ డి యం ఏ కార్యాలయలలో పనిచేస్తున్న 30955 పోస్టులకు మాత్రం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకు గాను వేతన స్థిరీకరణ చేస్తూ తేది 06.05.2424 న జీవో నెంబర్ 970 ఉత్తర్వులను జారీ చేసింది. ఈ జి.ఓ లో పొందు పర్చిన పోస్టుల ప్రకారం పి.ఎచ్, నాన్ పిఎచ్,సిస్టమ్ మేనేజర్ ,సిస్టమ్ అసిస్టెంట్ ,ఎన్విరాన్ మెంట్ ఇంజనీర్ల వరకు పోస్టులు అలాట్ చేస్తూ జీవో జారీ చేశారు.గతంలో మున్సిపాల్టీలలో ప్రభుత్వ అనుమతి లేకుండా నేరుగా కౌన్సిల్ తీర్మానములు,జిల్లా కలెక్టర్ ల అనుమతితో పాటు పాలకవర్గం, అధికార రాజకీయ నాయకుల సిఫార్సుల మేరకు చాల మున్సిపాల్టీలలో నిబంధనలను తొంగలో తొక్కి ఇష్టానుసారంగా అవుట్ సోర్సింగ్ పద్దతిలో సిబ్బందిని నియమించుకున్నారు.దీంతో అనుభవం లేని వారు కూడా ఉద్యోగాలలో చేరి తూ తూ మంత్రంగా పనులు చేస్తూ నెల నెలా వేలాది రూపాయల వేతనాలు తీసుకుంటూ మున్సిపాలిటీలలో రాజకీయ ఒత్తిళ్లతో అధికారులను ఇబ్బంది పెట్టుతున్న విషయం బహిరంగ రహస్యమే.ఈ క్రమంలో వీటి నియంత్రణ కై రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ నూతన జీవో తో ఇప్పటి నుంచి ప్రభుత్వ అనుమతి లేనిదే ఎవరిని కూడా ఉద్యోగాల్లో నియమించడం,జీతాలు పెంచడం చేయకూడదని నిబంధనలు విధించింది.జివో రాకతో నూతన నియామకాలకు బ్రేక్ పడ్డట్లు అయింది.
జీవో లో పొందుపర్చిన ప్రకారం సిస్టం మేనేజర్ కు రూ.36140/-వేతనం ఇవ్వాలని అదేవిధంగా సిస్టం అసిస్టెంట్ కు రూ.22750/-,ఎన్విరాన్ మెంట్ ఇంజనీర్ కు రూ.35000/-, పారిశుధ్య సిబ్బందికి (పీ.ఎచ్) రూ.16600/-నాన్ పి.ఎచ్ సిబ్బందికి రూ.16600/- లుగా జీతం కేటాయించడం జరిగింది. మున్సిపాల్టీలలో నిధుల లభ్యత ను బట్టి జీతాలు చెల్లించాల్సి ఉంటుంది.కాగా ఒకవేళ ప్రస్తుతం పని చేస్తున్న కార్మికుడు లేక కార్మికురాలు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని జివో లో సూచించారు. ఇదే కాకుండా అనారోగ్య కారణాలు చెప్పి ఉద్యోగాలు అమ్ముకోవడము… ఒకరి ప్లేస్ లో ఇంకొకరిని పెట్టడం లాంటివి అనుమతి లేనిదే నియమించ రాదని జివో లో పేర్కొన్నారు.

సూర్యాపేటలో..
సిస్టమ్ మేనేజర్ 1,సిస్టమ్ అసిస్టెంట్ 1,
ఎన్విరాన్ మెంట్ ఇంజనీర్ 1,పి.ఎచ్ వర్కర్స్ 424,నాన్ పి.ఎచ్ వర్కర్స్ 152 మంది ఉన్నారు.
హుజూర్నగర్ లో..
పర్యావరణ ఇంజనీర్ 1,పి.ఎచ్ .కార్మికులు 37,నాన్ పి.ఎచ్ కార్మికులు 30 మంది ఉన్నారు.
కోదాడ లో..
పర్యావరణ ఇంజనీర్ 1,పి .ఎచ్ కార్మికులు 141,నాన్ పి.ఏచ్ .కార్మికులు 43 మంది ఉన్నారు.
నేరేడు చర్ల లో..
పర్యావరణ ఇంజనీర్ 1,పి.ఎచ్ .కార్మికులు 31,నాన్ పి.ఏచ్ కార్మికులు ఐదుగురు ఉన్నారు.
తిరుమలగిరిలో..
పర్యావరణ ఇంజనీర్ 1,పి.ఎచ్ కార్మికులు 15,నాన్ పి.ఎచ్ .కార్మికులు 49 వున్నారు. జిల్లాలో ఉన్న 939 పోస్టులకు మినహాయించి కొత్తగా ఎవరిని నియామకం చేసుకోవడానికి వీలు లేదని తెలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులో పేర్కొన్న జీవో ల ఆధారంగానే వేతనాలు నిధుల లభ్యత(మున్సిపాలిటీ ఆర్ధిక పరిస్థితి )ని బట్టి చెల్లించాల్సి ఉంటుంది.
డ్రైవర్లు,డేటా ఎంట్రీ ఆపరేటర్లు ,ఇతర పోస్టులలో గల సిబ్బందికి అన్యాయం.. కార్మిక నేతలు..
ప్రభుత్వం జారీ చేసిన జీవో 970 లో పొందుపర్చిన పోస్టులలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు,డ్రైవర్లు ,టెక్నికల్ ,నాన్ టెక్నికల్ ,అడ్మిని స్ట్రేషన్ సిబ్బందిని కూడా నాన్ పి.ఎచ్ సిబ్బంది క్రింద చూపెట్టి వారికీ వేతనం తగ్గిస్తూ రూ.16600/- లు గా నిర్ణయించడం వల్ల సిబ్బంది తీవ్రంగా నష్ట పోయే అవకాశం ఉన్నది.ఈ నేపథ్యంలో జీవో ఫై పునపరిశీలన చేసి ప్రస్తుతం మున్సిపాల్టీలలో పని చేస్తున్న వారికి పనికి తగ్గ విధంగా పోస్టులు అలాట్ చేసి దానికి అనుగుణంగా జీతాలు ఇవ్వాలని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ అధికారులు జిఓ ఫై పునపరిశీలన చేయాలని కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు.