ఓవర్‌ టు ఢిల్లీ…

Congress copy– సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ
– మెజార్టీ ఎమ్మెల్యేలు రేవంత్‌ వైపు…
– నిర్ణయాధికారం అధిష్టానానికి అప్పగిస్తూ సీఎల్పీ ఏక వాఖ్య తీర్మానం
– ప్రత్యేక విమానంలో ఢిల్లీకి డీకే, పరిశీలకులు
– ఆశావహులూ ఢిల్లీకి వెళ్లే అవకాశం
– నేడు ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే, సోనియా, రాహుల్‌గాంధీతో భేటీ
– ఆ తర్వాతే గవర్నర్‌కు లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిపై చివరి నిమిషంలో కాంగ్రెస్‌లో ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతున్న తరుణంలో సీఎల్పీ నేత ఎవరు? అనేదానిపై ఇంకా మల్లగుల్లాలు కొనసాగుతున్నాయి. ఒకవైపు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ..కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తారనే ప్రచారం నేపథ్యంలో మేము సైతం పోటీలో ఉన్నామంటూ పార్టీ సీనియర్‌ నేతలు పేచీ పెట్టారు.అందులో ప్రస్తుత సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఉన్నారు. వారందరితో కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ విడివిడిగా మాట్లాడారు. అయినా వారంతా అలక వీడలేదు. ఈ క్లిష్టపరిస్థితుల్లో సోమవారం రాత్రి 8.30 గంటలకు నిర్వహించాలనుకున్న ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పార్టీ వాయిదా వేసింది. అంతకు ముందు సోమవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఓ హోటల్‌లో 64 మంది నూతన ఎమ్మెల్యేలతో డీకే శివకుమార్‌, పరిశీలకులు సమావేశమయ్యారు. సుమారు గంటపాటు సీఎల్పీ భేటీ కొనసాగింది. ఈ సమావేశానికి ఏఐసీసీ పరిశీలకులుగా డీకే శివకుమార్‌తోపాటు దీపదాస్‌ మున్షీ, టి.జార్జ్‌, అజయ్ కుమార్‌, మురళీధరన్‌, మాణిక్‌రావు ఠాక్రే తదితరులు హాజరయ్యారు. సీఎం అభ్యర్థి ఎంపిక నిర్ణయాన్ని అధిష్టానానికి అప్పగిస్తూ…సీఎల్పీ ఏక వాఖ్య తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని రేవంత్‌ ప్రవేశ పెట్టారు. తుమ్మల నాగేశ్వరరావు తొలుత బలపరిచారు. భట్టి విక్రమార్క, సీతక్కతోపాటు పలువురు ఎమ్మెల్యేలు మద్దతు తెలిపినట్టు తెలిసింది. ఆ తీర్మానాన్ని అధిష్టానికి పంపించారు. సీఎం అభ్యర్థి పేరు ఖరారు అవుతుందనే ఉద్దేశ్యంతో సోమవారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ప్రమాణ స్వీకారానికి ముహుర్తం నిర్ణయించారు. కార్యక్రమం కోసం అవసరమైన కుర్చీలు, టెంట్లు, సహా ఇతరత్రా సామగ్రిని రాజ్‌భవన్‌కు తరలించారు. సాధారణ పరిపాలనా శాఖ, ఆర్‌అండ్‌బీ, జీహెచ్‌ఎంసీ సహా ఇతర శాఖల అధికారులు అవసరమైన కసరత్తు చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కూడా గెలిచిన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు అందజేశారు. ఆ వెంటనే గజిట్‌ నోటిఫికేషన్‌ కూడా విడుదలైంది. అనుహ్యంగా సీఎం ఆశావహులు మొండికేయడంతో ఢిల్లీలో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. డీకే శివకుమార్‌, పరిశీలకులు హుటాహుటిన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో సమావేశం కానున్నారు. ఈనేపథ్యంలో రేవంత్‌రెడ్డితోపాటు సీఎం పదవి ఆశిస్తున్న ఆశావాహులు కూడా మంగళవారం ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని తెలిసింది. వీరందరితో చర్చించాకే ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. అధిష్టానం నుంచి ప్రకటన వచ్చాకే గవర్నర్‌ను కాంగ్రెస్‌ నేతలు కలవనున్నట్టు తెలుస్తోంది. అప్పుడే సీఎం ప్రమాణ స్వీకారంపై స్పష్టత రానుంది. అధిష్ఠానం నిర్ణయం కోసం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వేచిచూస్తున్నారు. మరోవైపు, సీఎం ప్రమాణస్వీకారం కోసం రాజ్‌ భవన్‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళే ప్రమాణ స్వీకారం ఉండవచ్చన్న సమాచారం నేపథ్యంలో రాజ్‌భవన్‌ వర్గాలు ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈనెల 9న సీఎం, మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
ప్రసార మాధ్యమాల్లో వస్తున్నది ఉహాగానాలే : మల్లు భట్టి విక్రమార్క
ప్రస్తుతం ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వివిధ కథనాలన్నీ ఉహాగానాలు మాత్రమేననీ, వాటిని ఎవరూ నమ్మొద్దని సీఎల్పీ మాజీ నేత మల్లు భట్టి విక్రమార్క ఒక ప్రకటనలో కోరారు. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను పార్టీ అధిష్టానానికి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేసినట్టు తెలిపారు. పార్టీ అధిష్టానం సీఎల్పీ నాయకుడిని ప్రకటిస్తుందని పేర్కొన్నారు.
తుది నిర్ణయం ఖర్గేదే : డీకే
ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపికపై తుది నిర్ణయం ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేదేనని రాష్ట్ర పరిశీలకులు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ తెలిపారు. సీఎల్పీ సమా వేశానంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. సీఎల్పీ నేత ఎంపికపై ఎమ్మెల్యేల అభి ప్రాయాన్ని తీసుకున్నామని చెప్పారు. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు ఇవ్వాలని ఎమ్మెల్యేలు చెప్పారనీ, ఆ మేరకు సమావేశంలో తీర్మానం చేసినట్టు తెలిపారు. ఖర్గే నిర్ణయాన్ని శిరసావహిస్తామని ఎమ్మెల్యేలు ఆ తీర్మానంలో పేర్కొన్నట్టు వివరించారు.