ఆన్‌లైన్‌తో లోపించిన అధికారుల పర్యవేక్షణ

– కమిషన్‌ సభ్యుల రాకతో బట్టబయలు
– మండలంలో జాతీయ ఆహార భద్రత కమిషన్‌ సభ్యుల తనిఖీలు
నవతెలంగాణ-కొత్తూరు
ఆన్‌లైన్‌ వ్యవస్థ ఏర్పడ్డాక క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించిందని జాతీయ ఆహార భద్రత కమిషన్‌ రాష్ట్ర చైర్మెన్‌ గోలి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. జాతీయ ఆహార భద్రత కమిషన్‌ సభ్యులు మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాలు, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, చౌక ధర దుకాణం, ప్రాథమిక వైద్య కేంద్రాలలో తనిఖీలు చేపట్టారు. కమిషన్‌ సభ్యుల వస్తున్నారన్న ముందస్తు సమాచారం అందడంతో తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఉదయం 9:30 లకు మండల తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్న సభ్యులు అక్కడి నుంచి దళితవాడలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. గర్భిణులు, బాలింతల సంఖ్య, రిజిస్ట్రేషన్‌ నమోదు, విద్యార్థుల హాజరు పట్టికలను పరిశీలించారు. చిన్నారులు వయసుకు తగ్గ బరువు ఏ మేరకు పెరిగారన్న విషయాన్ని ఒక్కో విద్యార్థిని స్వయంగా పరిశీలించారు. రీతు కుమార్‌, దివాన్స్‌, చెన్నష్య విద్యార్థులను బరువు తూకం చూసి గత నెలతో పోల్చి చూశారు. గర్భిణులకు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం గురించి అక్కడికి వచ్చిన గర్భిణులను అడిగి తెలసుకున్నారు. అనంతరం చిన్నారులకు వండిన భోజనాన్ని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. చౌక ధర దుకాణం 15 సందర్శించి రేషన్‌ కార్డుల సంఖ్య అంత్యోదయ కార్డు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంత్యో దయ కార్డు దారులకు షుగర్‌ అందకపోవడానికి గుర్తించారు. దీంతో రేషన్‌ డీలర్‌ భాస్కర్‌ను షుగర్‌ ఇవ్వకపోవడం పట్ల నిలదీశారు. షుగర్‌ ఇవ్వక పోవడం పట్ల నిరుపేదలు తీవ్రంగా నష్టపోయారని అన్ని చౌక ధర దుకాణాలను షుగర్‌ అందించక పోతే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మండల తహసీల్దార్‌ను ఆదేశించారు. అధికారులు వస్తున్నారన్న సమాచారంతో రేషన్‌ డీలర్‌ అప్పటికప్పుడు ఫిర్యాదు బాక్స్‌ను తయారుచేసి పెట్టడాన్ని వారు గుర్తించారు. అక్కడినుండి అంగన్‌వాడి సెంటర్‌ నెంబర్‌ 3, 4 లలో తనిఖీలు చేశారు. నెల రోజులుగా గర్బిణులకు, చిన్నారులకు పాలు అందించకపోవడాన్ని వారు గుర్తించి మరొకసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించారు. ఒకే గదిలో రెండు అంగన్‌వాడీ సెంటర్‌లు నిర్వహించడం మహిళలు వారి దృష్టికి తీసుకువచ్చారు.
మౌలిక వసతులు కల్పించాలి
ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన గర్భిణులు అంగన్‌వాడీ సెంటర్‌లో గదుల కొరత, మరుగుదొడ్లు, తాగునీటి సమస్య పరిష్కరించాలని కమిషన్‌ సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కమిషన్‌ సభ్యులు స్పందిస్తూ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగావారు మాట్లాడుతూ…ఆన్‌లైన్‌ వ్యవస్థ ఏర్పడ్డాక అధికారులు క్షేత్రస్థాయిలోకి రాకుండా ఆన్‌లైన్‌లో నమోదు చేసిన గణాంకాలే సరైనవిగా భావిస్తున్నారని అన్నారు. 2023 ఆహార భద్రత చట్టం ప్రకారం ప్రతి ఒక్కరూ పౌష్టికాహారాన్ని తీసుకొని ఆరోగ్యంగా సమాజాన్ని నిర్మించాలన్నారు. జాతీయ ఆహార భద్రత చట్టం అమలుకు ఆశావర్కర్లు, అంగన్‌వాడీ, ఏఎన్‌ఎం, వైద్యాధికారుల పాత్ర ఉండాలని తెలిపారు. అంగన్‌ వాడీలలో చిన్నారులు ఆరోగ్యంగా ఉండేందుకు బాలామృత్వాన్ని అందిస్తుందని తెలిపారు. తల్లీబిడ్డ, విద్యార్థులు క్షేమంగా ఉన్నప్పుడే నవ సమాజం నిర్మాణమవుతుందన్నారు. చౌక ధర దుకాణాలలో సరుకులు సరిగా అందడం లేదన్నారు. అధికారులకు డీలర్లకు సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. రేషన్ల షాపులలో డీలర్లు అధికారుల మీద అధికారులు డీలర్ల మీద చెప్పడం సరికాదన్నారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించడం లేదని దాన్ని సరి చేసుకోవాలని అన్నారు. పథకాల అమల్లో అవకతవకులు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటా మని అధికారులు బాగా పని చేసి పేదవారికి అండగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఆహార భద్రత కమిషన్‌ సభ్యులు వి ఆనంద్‌, కొంతం గోవర్ధన్‌ రెడ్డి, రంగినేని శారద, మూలకుంట భారతి, జ్యోతి, జిల్లా వైద్యవిద్యా స్టాడింగ్‌ కమిటీ మెంబరర్‌ ఎమ్మే శ్రీలత సత్యనారాయణ, ఆర్డీవో పీడీ శ్రీలత, ఆర్డీవో వెంకట మాధవరావు, డీఈవో సుసింధర్‌ రావు, డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వరరావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో విజయలక్ష్మి, ఉపాధి హామీ అడిషనల్‌ పీడీ సుభాషిని, డి డబ్ల్యుఓ పద్మజారమణ, సీడీపీవో నాగమణి, ఐసీడీఎస్‌ ఐటీ కోఆర్డినేటర్‌ హర్షిత, మండల తహసీల్దార్‌ రవీందర్‌రెడ్డి, ఎంపీడీవో అరుంధతి, నాయకులు బాతుక దేవేందర్‌ యాదవ్‌ , వివిధ శాఖల జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.