హెచ్‌సీఏ తెలంగాణ సొత్తు

Owned by HCA Telangana– గ్రామీణ ప్రాంతాలకు క్రికెట్‌ అభివృద్ది ఫలాలు
– ఇద్దరు ముగ్గురే శాశ్వతంగా ఏలతామంటే కుదరదు
– హెచ్‌సీఏ ఎన్నికల అధ్యక్ష అభ్యర్థి జగన్‌మోహన్‌ రావు

నవతెలంగాణ-హైదరాబాద్‌

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) తెలంగాణ ప్రజల సొత్తు. పదుల సంఖ్యలో క్లబ్‌లను ఆధీనంలో ఉంచుకుని శాశ్వతంగా పదవులు అనుభవించేందుకు, కుటుంబ సభ్యులను జట్టులో ఆడించేందుకు హెచ్‌సీఏను వాడుకుంటామంటే ఇక కుదరదు. హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘంపై తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి హక్కు ఉంది. హెచ్‌సీఏ, క్రికెట్‌ అభివృద్ది ఫలాలు గ్రామీణ ప్రాంతాలకు అందించి.. వర్థమాన, యువ క్రికెటర్లకు న్యాయం చేస్తామని అర్శినపల్లి జగన్‌మోహన్‌ రావు తెలిపారు. యునైటెడ్‌ మెంబర్స్‌ ఆఫ్‌ హెచ్‌సీఏ పోల్‌ ప్యానల్‌ తరఫున జగన్‌మోహన్‌ రావు అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నారు. ఉపాధ్యక్షుడిగా శ్రీధర్‌, కార్యదర్శిగా హరి నారాయణరావు, సంయుక్త కార్యదర్శిగా నోయెల్‌ డెవిడ్‌, కౌన్సిలర్‌గా అన్సార్‌ అహ్మద్‌ ఖాన్‌ ఎన్నికల బరిలో నిలిచారు. 20న హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌కు ఎన్నికలు జరుగనుండగా..బుధవారం యునైటెడ్‌ మెంబర్స్‌ ఆఫ్‌ హెచ్‌సీఏ ప్యానల్‌ విలేకరుల సమావేశంలో మ్యానిఫెస్టో విడుదల చేసింది. ఈ సందర్భంగా పలు అంశాలపై జగన్‌మోహన్‌ రావు మట్లాడారు. ఆ విషయాలు..
అవుట్‌సైడర్‌ను ఎలా అవుతా?!
హెచ్‌సీఏ ఎన్నికల్లో ఓటు హక్కు లేని కొందరు నాపై విమర్శలు చేస్తున్నారు. అవుట్‌సైడర్‌గా ముద్ర వేస్తున్నారు. మూడేండ్లుగా శ్రీచక్ర క్లబ్‌ కోశాధికారిగా కొనసాగుతున్నాను. తెలంగాణ ప్రీమియర్‌ లీగ్‌లో మెదక్‌ మేవరిక్స్‌ జట్టుకు యాజమానిగా ఉన్నాను. ఆ జట్టు తరఫున ఎంతోమంది ప్రతిభావంతులైన క్రికెటర్లకు అవకాశాలను కల్పించాను. హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం ప్రయివేటు సంస్థ కాదు. తెలంగాణ ప్రజల సొత్తు. హెచ్‌సీఏపై ప్రతి తెలంగాణ పౌరుడికి హక్కు ఉంటుంది. రాజకీయాలు, అవినీతితో హెచ్‌సీఏలో క్రికెట్‌ కుంటు పడింది. హైదరాబాద్‌ క్రికెట్‌కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఓ తెలంగాణ బిడ్డగా, క్రికెట్‌ అభిమానిగా ముందుకొచ్చాను. దశాబ్దాలుగా హెచ్‌సీఏను ఏలుతున్న వారి ఆటలు ఇక చెల్లవు.
30 ఎకరాల్లో అద్భుత స్టేడియం
బీసీసీఐలో హెచ్‌సీఏ వ్యవస్థాపక సభ్య సంఘం. అయినా, ఇప్పటివరకు హెచ్‌సీఏకు సొంత స్టేడియం లేదు. ఉప్పల్‌ స్టేడియం ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్నారు. ఆ గడువు త్వరలోనే ముగియనుంది. ఇక లీజు అవసరం లేకుండానే ప్రభుత్వ సహకారంతో ఆ గ్రౌండ్‌ను హెచ్‌సీఏ సొంత స్టేడియంగా మార్చేందుకు కృషి చేస్తాను. నిజామాబాద్‌లో 30 ఎకరాల సువిశాల స్థలంలో అంతర్జాతీయ స్టేడియం నిర్మాణానికి మా ప్యానల్‌ గెలిచిన రెండేండ్లలోనే శ్రీకారం చుడతాం. భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడే విధంగా మౌళిక వసతులు కల్పిస్తాం.
ఏ రాజకీయ పార్టీ మద్దతు లేదు
బలమైన రాజకీయ పార్టీ మద్దతుతో ఎన్నికల బరిలో నిలిచానని అంటున్నారు. నాకు ఏ రాజకీయ పార్టీ మద్దతు లేదు. నేను తెలంగాణ ప్రభుత్వం మద్దతుతో ఎన్నికల్లో నిలబడ్డాను. హెచ్‌సీఏను బాగు చేసేందుకు గతంలో ప్రభుత్వంలో ఎన్నో ప్రయత్నాలు చేసింది. క్రికెట్‌ అభివృద్దిపై దృష్టి నిలిపేలా హెచ్‌సీఏ పెద్దలతో సమావేశాలు నిర్వహిస్తే.. అందులో నేను సైతం పాల్గొన్నాను. వ్యక్తిగత ప్రయోజానాలే తప్ప హెచ్‌సీఏ అభివృద్ది పట్టని ఏండ్లుగా ఏలుతున్న పెద్దలు.. చివరకు పరిస్థితిని ఇక్కడిదాక తీసుకొచ్చారు. ప్రభుత్వ సహకారంతో తెలంగాణ వ్యాప్తంగా క్రికెట్‌ అభివృద్దికి కృషి చేస్తాను. భారత హ్యాండ్‌బాల్‌ సంఘం (హెచ్‌ఏఐ)లో పలు హోదాల్లో పని చేశాను. హ్యాండ్‌బాల్‌లోనూ ఎన్నో గొడవలు, కోర్టు కేసులు. హ్యాండ్‌బాల్‌ కోసం అధ్యక్ష పదవిని త్యాగం చేసి ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాను. ఇప్పుడు హ్యాండ్‌బాల్‌కు ఐఓఏ నుంచి ఐఓసీ వరకు గుర్తింపులు లభించాయి. హైదరాబాద్‌ సైతం హ్యాండ్‌బాల్‌ హబ్‌గా మారింది. క్రికెట్‌కు సైతం హైదరాబాద్‌ను హబ్‌గా చేసేందుకు శాయశక్తులా పని చేస్తాను.
అవినీతిపై ఉక్కుపాదం
హెచ్‌సీఏలో అతిపెద్ద భూతం అవినీతి. మౌళిక వసతుల కల్పన నుంచి జట్ల ఎంపిక వరకు ఇది అధికారికంగానే కొనసాగుతుంది. నేను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అవినీతిపై ఉక్కుపాదం మోపుతాను. రాష్ట్ర జట్లకు ఎంపిక చేయాలని లంచం ఇచ్చేందుకు ముందుకొచ్చే తల్లిదండ్రులు, సెలక్షన్స్‌ను వాడుకుని క్రికెటర్ల పేరెంట్స్‌ను పీడించే అధికారుల వరకు ఎవరినీ వదలం. లంచం ఇచ్చే క్రికెటర్లను మూడేండ్ల పాటు నిషేధిస్తాం. లంచం తీసుకునే అధికారులను సైతం హెచ్‌సీఏకు దూరంగా ఉంచుతాం. ప్రతిభావంతుడైన ప్రతి తెలంగాణ క్రికెటర్‌ రాష్ట్ర జట్టులో చోటు సాధించగలిగే అద్భుత వాతావరణాన్ని సృష్టిస్తాం.