ప్రభుత్వాస్పత్రుల్లో పాకో మిషన్లు

– 12 మిషన్ల ప్రారంభించిన మంత్రి హరీశ్‌ రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌, మెహిదీపట్నం
రాష్ట్రంలోని అన్ని జిల్లా ప్రభుత్వాస్పత్రుల్లో పాకో మిషన్లు అందుబాటులోకి వచ్చాయి. బుధవారం హైదరాబాద్‌ సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి హరీశ్‌ రావు వీటిని వర్చువల్‌ పద్ధతిలో ఏకకాలంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మహమూద్‌ అలీ, స్థానిక ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌, సరోజినీ దేవి కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజలింగంతో కలిసి ఆయా జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, ప్రజా ప్రతినిధులతో హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. కంటివెలుగు రెండో దశ కార్యక్రమంలో 1.62 కోట్ల మందికి పరీక్షలు చేశామని తెలిపారు. వీరిలో 25.1 శాతం మందికి కంటి సమస్యలున్నట్టు గుర్తించి అవసరమైన వారికి కండ్లద్దాలను పంపిణీ చేసినట్టు తెలిపారు. మిగిలిన వారి చికిత్స కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రయివేటులో పాకో మిషన్ల ద్వారా కాటరాక్ట్‌ సర్జరీ చేయించుకునేందుకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. ఇప్పటి వరకు ప్రభుత్వాస్పత్రుల్లో కేవలం సరోజినీ దేవిలో మాత్రమే పరిమితమైన ఈ సేవలను ఇప్పటి నుంచి జిల్లాలకు విస్తరించినట్టు చెప్పారు. వీటితో సర్జరీ చేయించుకున్న తర్వాత ఇన్ఫెక్షన్‌, కుట్లు వేసుకోవడం, కండ్లద్దాలు ఉపయోగించాల్సిన అవసరం ఉండబోదని స్పష్టం చేశారు. అల్ట్రా సౌండ్‌ పరిజ్ఞానంతో పనిచేసే ఈ యంత్రాల ద్వారా సర్జరీలు సులభంగా, వేగంగా చేసేందుకు వీలు కలుగుతుందనీ, రోగులు త్వరగా కోలుకుంటారని వివరించారు.
కొత్త మిషన్లలో రెండు సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో, ఒకటి మలక్‌ పేట ఏరియా ఆస్పత్రిలో, మరో తొమ్మిది ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రుల్లో ప్రజలకు సేవలందించనున్నాయి. ఒక్కో యంత్రం ఖరీదు రూ.28.85 లక్షలు కాగా మొత్తం మిషన్లకు రూ.3.46 కోట్లు ఖర్చు చేసినట్టు మంత్రి తెలిపారు. సరోజినీ ఆస్పత్రిలో త్వరలో ఆధునాతన భవని నిర్మాణానికి అనుమతులు మంజూరునిస్తామని తెలిపారు.