నవతెలంగాణ మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము సింగిల్ విండో చైర్మన్ చెప్యాల రామారావుపై మరోసారి డిసిఓ అధికారులు పిఏసిఎస్ సభ్యుడిగా అనర్హత వేటు వేసినట్లుగా తెలుస్తోంది.. పీఏసిఎస్ పాలకవర్గం 15-2-2021న ప్రమాణస్వీకారం చేశారు. సరిగ్గా సంవత్సరంనర తరువాత అవినీతి ఆరోపణలపై 27-11-2022న చైర్మన్ రామారావు సస్పెన్షన్ అయిన విషయం తెలిసిందే. అధికారులు వైస్ ఛైర్మన్ కు చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు. సంవత్సరం కాలం తరువాత రామారావు కోర్టుకెళ్ళి ఆర్డర్ తెచ్చుకొని ఇటీవల చైర్మన్ పదవి చేపట్టారు. పదవి చేపట్టిన కొన్ని నెలలకే మళ్ళీ సస్పెన్షన్ వేటు పడడం గమనార్హం. అయితే సొసైటీకి అనుబంధ కెడిసిసి బ్యాంకు లో రైతులకు రుణాలు ఇప్పించి,వారు సకాలంలో రుణాలు చెల్లించేలా చూస్తూ,సొసైటీ అభివృద్ధికి పాటుపడాల్సిన చైర్మన్ సొసైటీలో సభ్యుడై ఉండి సహకార చట్టానికి విరుద్ధంగా 28-2-2021న రూ.5 లక్షల గృహ రుణం తీసుకొని సకాలంలో చెల్లించకపోవడంతో డిపాల్టర్ అయ్యారు. ఇందుకు తోడుగా 26-2-2024న సింగిల్ విండో డైరెక్టర్ ఇప్ప మొoడయ్య తోపాటు పలువురు సభ్యులు ఇటీవల డిసిఓకు చేసిన పిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన డిసిఓ శైలజ 21న సొసైటీలో సభ్యుడుగా చైర్మన్ పై అనర్హత వేటు వేసినట్లుగా శనివారం సహకార చట్టం 1964 యాక్ట్ 1(బి) మరియు సెక్షన్ 15 (డి) ప్రకారం రామారావును సస్పెన్షన్ చేస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేశారు.పాలకవర్గం పదవి కాలం మరికొన్ని నెలల్లో ముగియనున్న నేపథ్యంలో చైర్మన్ పదవి మళ్ళీ ఎవరిని వరించునో వేచి చూడాల్సిందే.కాగా తాడిచెర్ల పిఏసీఎస్ అదినుంచి వివాదాస్పదం కావడం విశేషం.