– శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం నుంచి బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వరకు..
– పాదయాత్ర చేపట్టిన లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్ గౌడ్
నవతెలంగాణ-బేగంపేట్/జూబ్లీహిల్స్
ప్రత్యేక సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటయ్యే వరకు వివిధ కార్యక్రమాల ద్వారా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ జిల్లా సిద్ధించాలని కోరుతూ లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో సమితి సభ్యులు బుధవారం శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం నుంచి బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. ముందుగా సికింద్రాబాద్ లోని శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభిం చారు. అక్కడి నుంచి బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద అమీర్ పేట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, బీఆర్‌ఎస్ పార్టీ డివిజన్ అద్యక్షులు హన్మంతరావు, నాయకులు అశోక్ యాదవ్ తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్బంగా గుర్రం పవన్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ ప్రత్యేక జిల్లా ఏర్పాటుతోనే ఈ ప్రాంతం ఎంతో అభివద్ధి చెందుతుందన్నారు. జిల్లా ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ జిల్లాను ఏర్పాటు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలకు వినతిపత్రాలను అందజేసినట్టు వివరించారు. జిల్లా ఏర్పాటయ్యే విధంగా ఆశీర్వదించాలని మహంకాళి అమ్మవారు, బల్కంపేట ఎల్లమ్మ అమ్మవార్లను మొక్కుకున్నట్టు తెలిపారు. జిల్లా ఏర్పడిన వెంటనే అమ్మవార్లకు 1116 టెంకాయలను సమర్పించి మొక్కును తీర్చుకుంటామని చెప్పారు. వచ్చే వారం బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయం నుంచి జూబ్లిహిల్స్ పెద్దమ్మ అమ్మవారి ఆలయం వరకు పాదయాత్రను నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సాధం బాల్ రాజ్ యాదవ్, ఉపాధ్యక్షులు శైలేందర్, బాబురావు, సభ్యులు జగదీష్, శ్రీకాంత్ రెడ్డి, కష్ణ ముదిరాజ్, అశోక్, సుధాకర్ రెడ్డి, ముక్కా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.