– మాజీ ఎమ్మెల్సీ కపిల్‌వాయి దిలీప్ కుమార్
నవతెలంగాణ – హైదరాబాద్
అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ సీనియర్ విద్యావేత్త చుక్కా రామయ్యను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మాజీ ఎమ్మెల్సీ కపిల్‌వాయి దిలీప్‌కుమార్ పరామర్శించారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎం. సత్యంగౌడ్, టీపీసీసీ కార్యదర్శి రామారావు గౌడ్ ఉన్నారు. అనంతరం వారు ఓ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ నాయకులు చుక్కా రామయ్యను ఐఐటీ రామయ్య అని కూడా పిలుస్తారని పేర్కొన్నారు. చుక్కా రామయ్య విశేష కృషిని వారు కొనియాడారు. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు సేవలందిస్తున్న వెయ్యి మందికి పైగా ప్రముఖ ఐఐటీయన్లను తయారు చేశారని గుర్తుచేశారు. తన పుస్తకాల ద్వారా సాహిత్య రంగానికి ఆయన చేసిన కృషిని వారు కొనియాడారు. భారత ప్రభుత్వం చుక్కా రామయ్య సేవలను గుర్తించి వీలైనంత త్వరగా పద్మవిభూషణ్ పురస్కారం అందించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు పంపించేందుకు త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డిని కలుస్తామని వారు ప్రకటించారు.