పద్మశాలి విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయిలకు ఎదగాలని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పద్మశాలి విజయ సంఘ భవనంలో మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పద్మశాలి విద్యార్థులకు ప్రతిభా పురస్కాల ప్రధానం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పద్మశాలి ముద్దుబిడ్డలు అన్ని రంగాల్లో పైకి ఎదగాలన్నారు. బాగా చదవడం ద్వారా పద్మశాలి విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకుని భవిష్యత్తులో స్థిరపడాలన్నారు. ప్రస్తుత విద్యార్థులు సాధించిన విజయాలు భవిష్యత్తు తరాల విద్యార్థులకు ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలవాలన్నారు. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళితే అందుకు ప్రభుత్వం కూడా ప్రోత్సాహం అందిస్తుంది అన్నారు.కార్యక్రమంలో పాల్గొన్న ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ అశోక్ విద్యార్థులకు చదువులో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ఎలా ముందుకెళ్లాలని అంశంపై అవగాహన కల్పించారు.అనంతరం పదవ తరగతి, ఇంటర్, పాలిటెక్నిక్, ఎంసెట్, బిటెక్ ఇతరత్రా చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని విద్యార్థులను మెమొంటోలతో సత్కరించారు. అంతకుముందు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమితులై మొదటిసారి పద్మశాలి విద్యార్థుల ప్రతిభ పురస్కార కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఈరవత్రి అనిల్ ను మండల పద్మశాలి సంఘం సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు బీజు దత్తాద్రి, గౌరవ అధ్యక్షులు పుల్గం హనుమండ్లు, జిల్లా పద్మశాలి సంఘం సభ్యులు, మండల పద్మశాలి సంఘం సభ్యులు, మండలంలోని ఆయా గ్రామాల పద్మశాలి సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.