పాదూరి శ్రీనివాస్‌రెడ్డి మరణం జేవీవీకి తీరనిలోటు

– తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి
నవతెలంగాణ-నల్లగొండ
పాదూరి శ్రీనివాసరెడ్డి మరణం జేవీవీకి తీరనిలోటని తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్‌ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జన విజ్ఞాన వేదిక ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ అధ్యక్షులు పాదూరి శ్రీనివాస్‌రెడ్డి సంతాప సభకు ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. శ్రీనివాస్‌రెడ్డి ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూనే జనవిజ్ఞాన వేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షుడుగా పనిచేస్తూ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరచటానికి కృషి చేస్తూ శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టారని ఆయన సేవలను కొనియాడారు. ఉపాధ్యాయుడిగా ఎన్నో పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా అప్‌ గ్రేడ్‌ చేసి విద్యార్థులను ఉన్నత స్థానాలలో ఎదగటానికి కృషి చేశారని, వీరి మరణం వారి కుటుంబానికే కాక సమాజానికి కూడా తీరని లోటన్నారు. ఇలాంటి సామాజిక స్పృహ కలిగిన ఉపాధ్యాయులు సామాజిక సేవా కార్యకర్తలు సమాజానికి అవసరమని, దేశం శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందాలంటే పాఠశాల విద్య నుండే విద్యార్థులకు శాస్త్రీయ దృక్పథాన్ని శాస్త్రీయ అవగాహనను కలిగించాలని తెలిపారు. విజ్ఞానదర్శిని రాష్ట్ర అధ్యక్షులు తాటి రమేష్‌ మాట్లాడుతూ శ్రీనివాస్‌రెడ్డి లాగా సామాజిక స్పృహ, శాస్త్రీయ విలువలను కలిగిన నాయకులను భవిష్య తరాల వారికి అందించటానికి మేధావులు కృషి చేయాలని కోరారు. సామాజిక కార్యకర్త దేవి మాట్లాడుతూ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా జిల్లాలో అనేక ప్రదర్శనలు ఇచ్చిన పాదూరి శ్రీనివాస్‌రెడ్డి మహిళలను చైతన్యపరచటానికి కృషి చేశారని తెలిపారు. టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షులు సైదులు అధ్యక్షత న జరిగిన సంతాప సభలో టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శులు ముదిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, నాగమణి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం, టాప్రా రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి డాక్టర్‌ ఎల్‌.అరుణ, జేవీవీ రాష్ట్ర కార్యదర్శి నన్నూరి వెంకటరమణారెడ్డి, జేవీవీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి వనం శాంతి కుమార్‌, చదువు- వెలుగు పూర్వ జిల్లా కోఆర్డినేటర్‌ వీరారెడ్డి గారు ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు వీ.ఆనంద్‌, రాష్ట్ర ప్రధాన, కార్యదర్శి కట్టా రమేష్‌ , యూటీఎఫ్‌ సీనియర్‌ నాయకులు పాదూరి విద్యాసాగర్‌రెడ్డి, టాప్రా జిల్లా అధ్యక్షులు నూకల జగదీశ్‌ చంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి పందిరి శ్యాంసుందర్‌, జిల్లా గౌరవ అధ్యక్షులు కుకుడాల గోవర్ధన్‌, జిల్లా పౌర స్పందన వేదిక జిల్లా అధ్యక్షులు పాల్వాయి అంజిరెడ్డి, యూటీఎఫ్‌ జిల్లా పూర్వ అధ్యక్షులు ఎస్‌. ఆంజనేయులు, జేవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి అమరయ్య, యూటీఎఫ్‌ నాయకులు నవీన్‌ రెడ్డి, రవీందర్‌, చింతల యాదగిరి, బుచ్చిరెడ్డి, రవీందర్‌, పగటిపాటి నరసింహ, శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సభ్యులు రాజేందర్‌రెడ్డి, అనురాధ, సునీత, సుష్మ పాల్గొన్నారు