– భారత పర్యటనకు పాక్ ప్రభుత్వం అనుమతి
కరాచీ : 2023 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌లో పోటీపడేందుకు పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత్‌లో అడుగుపెట్టనుంది. ఈ మేరకు భారత పర్యటనకు ఆ దేశ విదేశాంగ శాఖ నుంచి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అనుమతి లభించింది. ఈ మేరకు పాకిస్థాన్ విదేశీ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘క్రీడలను రాజకీయంతో ముడిపెట్టవద్దని పాకిస్థాన్ విధానం. అందుకే, 2023 ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు పాకిస్థాన్ జట్టును భారత పర్యటనకు పంపుతున్నాం. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు.. పాక్ అంతర్జాతీయ క్రీడా విధానాలకు అడ్డుపడకూడదని మా భావన. భారత్‌లో పాక్ క్రికెట్ జట్టు భద్రతపై మాకు లోతైన అభ్యంతరాలు ఉన్నాయి. ఈ అంశాలను ఐసీసీ వద్ద పీసీబీ ప్రస్తావించనుంది. భారత పర్యటనలో పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు పూర్తి భద్రత కల్పిస్తారని భావిస్తున్నామని’ ప్రకటనలో విదేశీ మంత్రిత్వ శాఖ తెలిపింది. 2023 ప్రపంచకప్‌లో భాగంగా నేరుగా హైదరాబాద్‌కు చేరుకోనున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టు.. ఉప్పల్‌లో రెండు వార్మప్ మ్యాచులు సహా గ్రూప్ దశలో రెండు మ్యాచులు ఆడనుంది. ఆ తర్వాత భారత్‌తో మెగా పోరు కోసం అహ్మదాబాద్‌కు వెళ్లనుంది.