పాక్‌ ఆశలు సజీవం

Pakistan's hopes are alive– డక్‌వర్త్‌ పద్దతిలో కివీస్‌పై గెలుపు
– వర్షం ప్రభావిత మ్యాచ్‌లో కేన్‌సేన ఓటమి
బెంగళూర్‌ : కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (95, 79 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), రచిన్‌ రవీంద్ర (108, 94 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్‌) ధనాధన్‌తో ప్రపంచకప్‌లో అత్యధిక స్కోరు సాధించిన న్యూజిలాండ్‌కు వరుణుడు అడ్డుతగిలాడు. పాకిస్థాన్‌పై తొలుత 401/6 పరుగుల భారీ స్కోరు సాధించిన న్యూజిలాండ్‌ గెలుపుపై దీమాగా కనిపించింది. రికార్డు లక్ష్య ఛేదనలో ఓపెనర్‌ ఫకర్‌ జమాన్‌ (126 నాటౌట్‌, 81 బంతుల్లో 8 ఫోర్లు, 11 సిక్స్‌లు), బాబర్‌ ఆజమ్‌ (66 నాటౌట్‌, 63 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్‌ మెరుపులతో కదం తొక్కగా 25.3 ఓవర్లలో పాకిస్థాన్‌ 200/1 పరుగులు చేసింది. 21.3 ఓవర్లలో పాక్‌ 160/1తో ఉండగా వరుణుడు ఆటంకం కలిగించగా.. గంటకు పైగా విరామం అనంతరం ఆట పున ప్రారంభమైంది. కానీ కొద్దిసేపటికే మళ్లీ ఎడతెగని వర్షం కురువటంతో మ్యాచ్‌ ముందుకు సాగలేదు. డక్‌ వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం మ్యాచ్‌ ఫలితాన్ని నిర్ణయించారు. డక్‌వర్త్‌ ప్రకారం 21 పరుగుల ముందంజలో నిలిచిన పాకిస్థాన్‌ విజయం సాధించింది. 401 పరుగులు చేసినా.. న్యూజిలాండ్‌కు ఊహించని ఓటమి తప్పలేదు. గ్రూప్‌ దశలో నాల్గో విజయంతో పాకిస్థాన్‌ సెమీఫైనల్‌ అశలు సజీవంగా నిలిచాయి. చివరి మ్యాచ్‌లో శ్రీలంకపై కివీస్‌ నెగ్గితే ఆ జట్టు నేరుగా టాప్‌-4లో నిలువనుంది. ఇంగ్లాండ్‌పై పాక్‌ నెగ్గి.. శ్రీలంకపై కివీస్‌ ఓడితే నెట్‌ రన్‌రేట్‌ ఆధారంగా ఓ జట్టు ముందంజ వేయనుంది.