పక్కా పైసా వసూల్‌ సినిమా

పక్కా పైసా వసూల్‌ సినిమావిశ్వంత్‌ దుద్దంపూడి, అనురూప్‌ కటారి హీరోలుగా, విస్మయ హీరోయిన్‌గా శ్రీ నేత్ర క్రియేషన్స్‌, ఆర్మ్స్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఏ.ప్రశాంత్‌ నిర్మించిన చిత్రం ‘నమో’. ఈ చిత్రంతో ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకులుగా పరిచయం కాబోతున్నారు. ఈ మూవీ ఈనెల 7న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు భీమనేని శ్రీనివాసరావు, బెక్కం వేణుగోపాల్‌ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. దర్శకుడు ఆదిత్య రెడ్డి మాట్లాడుతూ, ‘ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా ప్రశాంత్‌ సినిమాను నిర్మించారు. మంచి కథకి, సబ్జెక్ట్‌కి విశ్వంత్‌ లాంటి మంచి హీరో దొరకడంతోనే ‘నమో’ సినిమాగా మారింది. అనురూప్‌ సింగిల్‌ టేక్‌ ఆర్టిస్ట్‌. విస్మయ మంచి నటి. రాహుల్‌ శ్రీ వాస్తవ మంచి విజువల్స్‌ ఇచ్చారు. ట్రైబల్‌ సెట్‌ను కిరణ్‌ కుమార్‌ అద్బుతంగా వేశారు. క్రాంతి ఆచార్య చక్కని సంగీతం ఇచ్చారు. ఈనెల 7న మా చిత్రం రాబోతోంది. అందరూ వీక్షించి విజయవంతం చేయండి’ అని అన్నారు. ‘నాకు కేవలం ఇది ఓ సినిమా కాదు. నాకు ఇదొక ఎమోషన్‌. ఆదిత్య రాసిన పాత్రలు అద్భుతంగా వచ్చాయి. లాజిక్స్‌ పక్కన పెట్టి మ్యాజిక్‌ చూడండి. సినిమా అందరికీ నచ్చుతుంది. కచ్చితంగా పైసా వసూల్‌ చిత్రం అవుతుంది’ అని హీరో విశ్వంత్‌ దుద్దంపూడి చెప్పారు.
నిర్మాత ప్రశాంత్‌ మాట్లాడుతూ, ‘మా సినిమా ఆద్యంతం నవ్విస్తూనే ఉంటుంది’ అని చెప్పారు. మరో హీరో అనురూప్‌ మాట్లాడుతూ, ‘మోహన్‌ అనే పాత్ర మా దర్శకుడు ఆదిత్యదే అనిపిస్తుంది. అంత మంచి క్యారెక్టర్‌ను ఇచ్చినందుకు థ్యాంక్స్‌’ అని అన్నారు.