”పకోడీలు… పంక్చర్‌ షాపులు”

"Pakodis...puncture shops"కొన్ని సందర్భాలు విషయాన్ని కుండబద్దలు కొడతాయి. మరుగుపరచబడ్డ నిజాలను వెలుగులోకి తెస్తాయి. మంగళవారం ముంబై ఎయిర్‌పోర్టులో జరిగిన తొక్కిసలాట సరిగ్గా అలాంటి సందర్భమే. ”ఎయిర్‌ ఇండియా ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌” చేపట్టిన లోడర్‌ ఉద్యోగాల భర్తీ కార్యక్రమం ఈ తొక్కిసలాటకు దారితీసింది. రెండువేల ఉద్యోగాల కోసం ఇరవై అయిదు వేలమంది రావడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇలాంటి ఘటనలు ఈ దేశానికి కొత్తేమీకాదుగానీ, ఈ సందర్భంగా ఇంటర్వ్యూ కేంద్రం వద్దకు వేలాదిమంది ప్రాణాలకు తెగించి పరుగులు తీస్తున్న దృశ్యాలు.. సినిమా స్టంట్స్‌ను తలపిస్తూ వాహనాలపై నుంచి, చెట్లపై నుంచి అక్కడికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు.. ఈ దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య తీవ్రతకు అద్దం పడుతున్నాయి.
ఈ ఘటనకు కేవలం కొద్దిరోజుల ముందు.. ”మా ప్రభుత్వం దేశవ్యాప్తంగా గత మూడేండ్లలో ఎనిమిది కోట్ల ఉద్యోగాలు కల్పించి రికార్డు సృష్టించింది” అని ఇదే ముంబై వేదికగా ఈ దేశ ప్రధాని ప్రకటించారు. ఇది ఎంత పచ్చి అబద్ధమో ఈ ఘటన తేల్చి చెబుతోంది. ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలిస్తామని అధికారంలో కొచ్చిందీ ప్రభుత్వం. ఆ లెక్కన ఈ పదేండ్లలో ఇరవైకోట్ల ఉద్యోగాలివ్వాలి. కానీ మన దేశంలో ప్రస్తుత నిరుద్యోగిత రేటు 9.2. గత నాలుగున్నర దశాబ్దాల కాలంలో ఏనాడూ ఈ స్థాయిలో నమోదు కాలేదు. 1991నాటి ఆర్థిక సంక్షోభం సమయంలో కూడా ఈ దుస్థితి లేదు. అందువల్ల, ఏలినవారి మాటల్లో నిజాలూ నీతీ నిజాయితీలూ వెతకడమంటే.. గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలేరుకోవడమేనని ఈ ఘటన మరోసారి రుజువు చేస్తోంది.
నిజానికి ఈ లోడర్‌ ఉద్యోగాలకు కనీస విద్యార్హతలుంటే చాలు. కానీ దరఖాస్తు చేసుకున్న వారిలో అనేకులు పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు, ఇంజనీర్లు, ఎంబీఏ చదువుకున్నవారు. అంత ఉన్నత చదువులు చదివి కూడా ఇంత చిన్న ఉద్యోగానికి పోటీపడుతున్నారంటే సమస్య తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలోనే అధ్యధిక యువసంపత్తి కలిగిన దేశం మనది. ఏ దేశానికైనా ఇంతకు మించిన అద్భుత వనరేముంటుంది. కానీ ఇది నాణానికి ఒకవైపే. రెండోవైపున ఈ అపారమైన యువ సంపత్తి నిర్వీర్యమవుతోంది. పని చేయగలిన శక్తి ఉండి, చేయాలన్న కోరిక ఉండికూడా పని దొరకని దౌర్భాగ్యస్థితిని ఎదుర్కొంటోంది. చిత్రమేమి టంటే సమస్య తీవ్రత తెలిసి కూడా మన ప్రభుత్వాలు ఉద్యోగాల కల్పనకు పూనుకోవు. ఖాళీగా ఉన్న పోస్టులూ భర్తీ చేయవు. కనీసం రిటైరవుతున్న వారి స్థానంలోనైనా నియామకాలు చేపట్టవు. ఎందుకంటే… కారల్‌ మార్క్స్‌ చెప్పినట్టు… ”పెట్టుబడిదారీ వ్యవస్థలో ఆ వ్యవస్థ మనుగడ కోసమే నిరుద్యోగం నిరంతరం పెంచి పోషించబడుతుంది. నిరుద్యోగ సైన్యం సదా సిద్ధంగా ఉంటేనే శ్రమదోపిడీ యథేచ్చగా సాగుతుంది. అందుకే పెట్టుబడిదారీ విధానం ఉన్నంత కాలం నిరుద్యోగం ఉంటుంది.” కాబట్టే తీరికలేని కార్పొరేట్ల సేవలో తరిస్తూ, యువతకు ఉద్యోగాలూ ఉపాధి కల్పన తమ బాధ్యత అనే సంగతే ఈ ప్రభుత్వాలు విస్మరించాయి.
పార్టీ ఏదైనా, ప్రభుత్వమెవరిదైనా గత నలభై ఏండ్లుగా ఇదే తంతు. ఈ తంతులో ఘనత వహించిన ప్రస్తుత సర్కారు తీరేవేరు. దేశాన్ని దశాబ్దాలుగా పీడిస్తున్న సమస్యను పరిష్కరించకపోగా పరిహాసం చేయడం ఈ ప్రభుత్వ పెద్దలకు పరిపాటిగా మారింది. ఆదివారంనాడు మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఎమ్మెల్యే పన్నాలాల్‌ షాక్యా చేసిన వ్యాఖ్యలు ఇందుకు తాజా ఉదాహరణ. ”నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా… ఈ కాలేజీ డిగ్రీలతో ప్రయోజనమేమీ లేదు. వీటికి బదులు మోటార్‌ సైకిల్‌ పంక్చర్‌ షాపులు తెరవండి” అంటూ సాక్షాత్తూ అమిత్‌ షా గారి సమక్షంలో ఓ అధికారిక కార్యక్రమంలోనే సెలవిచ్చారాయన. ప్రతిష్టాత్మక ”పీఎం కాలేజ్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌” ప్రారంభసభలో ఈ వ్యాఖ్యలు చోటుచేసుకోవడం గమనార్హం. అయినా పకోడీలు వేసుకోండని స్వయంగా ప్రధానితో సహా మంత్రులంతా చెపుతుంటే ఈయన పంక్చర్లు వేసుకోమనడంలో ఆశ్చర్యమేముంది!
ఇలాంటి సందర్భాల్లోనే.. ”ఏలికలే ఈ తీరున ఉంటే ఇక దేశమేరీతిన బాగుపడుతుంది?” అన్న ప్రశ్న సమాజాన్ని కలవరపెడుతుంది. ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్రం తరువాత కూడా ఏయే వర్గాలవారిని ఎలా బుదగిరిచ్చాలనే కుటిల పన్నాగాలతో పొద్దు పుచ్చడమే వీరి విధానంగా కొనసాగుతుండటం ఓ విషాదం. తాయిలాలు ప్రకటిస్తే ఓట్లు రాలతాయని భావనే తప్ప ప్రజల ఆకాంక్షలూ అవసరాల పట్టింపే వీరికుండదు. సంక్షేమం అన్నది తాత్కాలిక ఉపశమనమేగానీ అదే శాశ్వత పరిష్కారం కాదు. కుల, మత, జాతి భేదాలు లేకుండా అందరికీ చేతినిండా పని, పనికి తగ్గ ఫలితం లభించాలి. ప్రజలంతా ఆత్మగౌరవంతో జీవించే పరిస్థితులు నెలకొనాలి. ఇందుకు ఏ ప్రభుత్వానికైనా ఉద్యోగాల కల్పన ఓ కీలకమైన కర్తవ్యం. ఇందుకోసం దీర్ఘకాలిక వ్యూహంతో కూడిన సమగ్రాభివృద్ధి విధానం అవసరం. దీన్ని మన ప్రభుత్వాలూ పౌరసమాజమూ గుర్తించనంతకాలం నిరుద్యోగం ఓ జవాబులేని ప్రశ్నగానే మిగిలిపోతుంది.