నవతెలంగాణ – మోపాల్
రైతు రుణమాఫీ అమలుతో మంచిప్ప గ్రామంలో జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు, ఉమ్మడి మండల మాజీ ఎంపీపీ యాదిగిరి ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పీసీసీ కార్యదర్శి నాగేశ్ రెడ్డి మరియు ముప్పగంగారెడ్డి హాజరవ్వడం జరిగింది. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ.. 2022 మే 6 న వరంగల్ లో లక్షలాది మంది రైతుల సమక్షంలో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించారని దానికి అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తారని అన్నారని దానికంటే ముందుగానే రైతులకు రుణమాఫీ జరుగుతుందన్నారు. ఏకకాలంలో రుణమాఫీ చేయడం అనేది చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. గతంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిందని, మళ్లీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి సారధ్యంలో జరుగుతుందని అన్నారు. రుణమాఫీ కొరకు రూ.31 వేల కోట్ల జమ చేస్తున్నారని తెలిపారు. మొదట లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేయడం ద్వారా ఒక్కరోజే రూ.6098 కోట్ల రూపాయల నిధులు రైతుల ఖాతాలో జమ చేశారని అన్నారు. మన నిజామాబాద్ జిల్లాకి రూ.226 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు రైతుల గురించి ఆలోచిస్తుందని అన్నారు. కర్షక పార్టీ మన కాంగ్రెస్ పార్టీ అని, ఈ చారిత్రాత్మక ఘట్టం ప్రతిపక్షాలకు చెంపపెట్టు లాంటిదని, కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదని ఏక కాలంలో రుణమాఫీ అమలు చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రం యావత్తు దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది అని అన్నారు. గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా దోచుకోవడం, దాచుకోవడం తప్ప, రైతుల గురించి ఏరోజూ ఆలోచించలేదని, అప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసిందన్నారు. అన్నదాతలకు మేలు చేయడం, వారికి ఎల్లప్పుడూ అండగా ఉండడం, రైతులను రాజులను చేయడమే కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశమని అన్నారు. మళ్లీ రైతులకు మంచి రోజులు వచ్చాయని అతి త్వరలో రైతు భరోసా కార్యక్రమం కూడా ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే రుణమాఫీ చేసిన సందర్భంగా మా బంజారా బిడ్డల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో భూపాల్ కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు భూన్నె రవి, అమ్రాబాద్ రవి, వెంకట్ రామ్, సాయికుమార్, పాష, రాజేష్, సాయికుమార్, దేవేందర్, తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు.