ప్రాజెక్టులతో పాలమూరు సస్యశ్యామలం

Palamuru Greenery with projects– పరిణితి చెందిన ప్రభుత్వంతోనే రాష్ట్రం పురోగతి
– కాంగ్రెస్‌ను నమ్మితే నట్టేట మునుగుడే..
– రాష్ట్రానికి మోడీ తీవ్ర అన్యాయం
– ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌
నవతెలంగాణ- మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి/నారాయణపేట/గద్వాల/దేవరకద్ర
”ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా పాలమూరు సస్యశ్యామలం అయింది. పరిణితి చెందిన ప్రభుత్వాల ద్వారానే రాష్ట్రమైన, కేంద్రమైన అభివృద్ధి చెందుతుంది. 50ఏండ్ల కాంగ్రెస్‌ పరిపాలనా తీరు వల్లనే జిల్లాలో గంజి కేంద్రాల ఏర్పాటు చేయడం జరిగింది” అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. సోమవారం ఉమ్మడి మహబూబ్‌న గర్‌ జిల్లాలోని దేవరకద్ర, గద్వాల, మక్తల్‌, నారాయణపేట నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొని మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో పాలమూరు దుస్థితిని ఏ రాజకీయ పార్టీ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యక్తి అంజయ్య సీఎంగా అయిన తర్వాతనే జూరాల ప్రాజెక్టుకు మోక్షం కలిగిందన్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన ఈ పదేండ్లలో కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌ సాగర్‌ ప్రాజెక్టులను పూర్తి చేశామని తెలిపారు. కృష్ణ, తుంగభద్ర ప్రధాన నదుల మధ్యలో ఉన్న నడిగడ్డ ప్రాంతాన్ని సమైక్యరాష్ట్రంలో ఏనాడు పట్టించుకోలేదని, కానీ నేడు తుమ్మిళ్లగట్టు ఎత్తిపోతల పథకాల ద్వారా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. గద్వాల ప్రాంతంలో వాల్మీకి, బోయలు ఎక్కువగా ఉంటారని, అంధ్రాలో వారు ఎస్టీలని, ఇక్కడ మాత్రం బీసీలని, అందుకే మన రాష్ట్రంలోనూ వారిని ఎస్టీల్లో కలిపేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని, అయినా ఫలితం లేదని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ మంచి కార్యక్రమాలు చేసి ఉంటే.. దళితుల పరిస్థితి ఈ రోజు ఇలా ఉండేది కాదన్నారు. దళితులను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని, తాము అలా చేయడం లేదని తెలిపారు. పచ్చగా ఉన్న తెలంగాణను మళ్లీ కరగనాకేందుకే కాంగ్రెస్‌ సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రంలో పాలమూరును మరిచిపోయినప్పటికీ అక్కడి నాయకులు వస్తే గద్వాలలో వారికి మంగళ హారతులతో స్వాగతం పలికారని గుర్తుచేశారు. రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని, మెడికల్‌ కళాశాలలు, నవోదయ పాఠశాలల వంటి విషయంలో వివక్ష కనబరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ తర్వాత రెండో మున్సిపాలిటీగా నారాయణపేట ఏర్పడిందన్నారు. నారాయణపేట, కొడంగల్‌, మక్తల్‌కు నీళ్లు ఇచ్చే కాల్వలను మంజూరు చేశారని, టెండర్ల ప్రక్రియ పూర్తి కాగానే కాల్వలను పూర్తి చేసుకుందామని తెలిపారు. రైతుబంధు, 24 గంటల విద్యుత్తు, ధరణి వంటి ప్రజా పథకాలను రద్దుచేస్తామన్న కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో విసిరేయాలని పిలుపునిచ్చారు. గద్వాల్‌ను గబ్బు పట్టించింది కాంగ్రెస్‌ నాయకులేనని, ఆర్‌డీఎస్‌ కాలువను ఆగం పట్టించారని విమర్శించారు. ఆ పార్టీని నమ్మితే నట్టేటముంచుతారని తెలిపారు.
కరివెన రిజర్వాయర్‌ పనులు పూర్తి కావొచ్చాయని, అందుబాటులోకి వస్తే దేవరకద్ర నియోజకవర్గంలో మొత్తం 1.50లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. పాలమూరు-రంగారెడ్డి పథకం అడ్డంకులన్నీ తొలగిపోతున్నాయని తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగిందో మీ కండ్ల ముందే ఉందని, ఆ అభివృద్ధిని చూసి బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎలక్షన్లు వస్తాయి.. పోతాయి.. కానీ మీరు వేసే ఓటు మీ ఐదేండ్ల భవిష్యత్తును నిర్ణయిస్తుందని, మీ తలరాతను మార్చేస్తుందని స్పష్టంచేశారు. అభ్యర్థులను ఎంపిక విషయంలో గాబరా కావద్దని, వజ్రాయుధం లాంటి ఓటును ఉపయోగించి మంచి సేవకులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. సభల్లో మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, నిరంజన్‌ రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్‌ రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణ సుధాకర్‌ రెడ్డి, మాజీ మంత్రి నాగం జనార్దన్‌ రెడ్డి, పి. చంద్రశేఖర్‌, మాజీ ఎంపీలు రావుల చంద్రశేఖర్‌ రెడ్డి, జగన్నాథం, ఎంపీ రాములు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.