‘తెలంగాణ సాహితీ’ పరిమళం
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా తెలంగాణ సాహితి దశాబ్ది ఉత్సవాలు
”తెలంగాణ సాహితి” మహబూబ్ నగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్‌లోని వాగ్దేవి కళాశాలలో ఈ నెల మొదటి ఆదివారం (1-12-24) ఉమ్మడి పాలమూరు జిల్లా తెలంగాణ సాహితి దశాబ్ది ఉత్సవాలు ఉత్సాహంగా జరిగాయి. ప్రారంభ సమావేశానికి ప్రముఖ గజల్ ఇరివింటి వెంకటేశ్వర శర్మ అధ్యక్షత వహించగా కాళిదాసు సభను పరిచయం చేశారు. ఈ సభలో ముఖ్య అతిథులుగా ప్రముఖ రచయిత తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నాళేశ్వరం శంకరం, తెలంగాణ సాహితి రాష్ట్ర అధ్యక్షులు వల్లభాపురం జనార్ధన, ఉపాధ్యక్షులు అనంతోజు మోహన్‌కష్ణ, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఖాజా మైనద్దీన్, కొప్పోలు యాదయ్య, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వహీద్ ఖాన్, భానుచందర్ పాల్గొన్నారు. ప్రారంభసభలో సాహిత్యం సమాజం అనే అంశంపై ప్రసిద్ధ రచయిత, తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాళేశ్వరం శంకరం లోతైన విశ్లేషణ చేశారు.
‘నడువు.. నడువు .. కవి గాయకా.. రైతన్నల కండదండ నీవుండగా’ అనే పల్లవితో తెలంగాణ సాహితి వనపర్తి జిల్లా కార్యకర్త, కవి, వాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్ ఆలపించిన గీతాలాపన ఆహూతులను అలరించింది.
మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల కార్యక్రమాల నివేదికలను ఆయా జిల్లాల ప్రధాన కార్యదర్శులు ప్రవేశపెట్టారు.
మధ్యాహ్న భోజనానంతరం జరిగిన రెండవ సమావేశానికి ప్రముఖ కవి లక్ష్మణ్‌గౌడ్ అధ్యక్షత వహించారు. ఈ సభలో నాగర్‌కర్నూల్ తెలంగాణ సాహితి జిల్లా కార్యదర్శి వహీద్‌ఖాన్, ప్రసిద్ధ కవులు వెన్నెల సత్యం, వనపట్ల సుబ్బయ్య, భాస్కరయ్య, పొద్దుటూరు ఎల్లారెడ్డి, వివిధ సాహిత్య ప్రక్రియలపై తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. వైద్యం భాస్కర్, కె.ఏ.ఎల్.సత్యవతి, సురభి జగపతిరావు, ఆర్.వనజ, పులి జమున, బాదేపల్లి వెంకటయ్య గౌడ్ తదితరులు కవితా గానం వినిపించి అందరిని ఆకట్టుకున్నారు.
కవి కథకులు వహీద్ ఖాన్ కవి సమ్మేళనం ను ప్రారంభిస్తూ పద్యం,వచనం, కథ, గల్పిక, నవల, పాట ఏ సాహిత్య ప్రక్రియ అయినా గానీ ప్రజల సమస్యలను ప్రస్తావించాలని, అప్పుడే ప్రజాదరణ పొందుతుందని తెలియజేశారు. సీనియర్ కవులు రచయితలు వల్లభాపురం జనార్ధన, పొద్దుటూరి ఎల్లారెడ్డి లక్ష్మణ్ గౌడ్, వైద్యం భాస్కర్, డా. భానుచందర్, సత్యవతి, పులి జమున దేవదానం, దినకర్, వనపట్ల సుబ్బయ్య, రాజారామ్ ప్రకాష్, గంధం నాగరాజులకు సన్మానం చేశారు.
యువ కవులు రాజేష్, సాయి ప్రణవి, ఎం భానుప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.
– ప్రమోద్ కుమార్, 9603387135
సామాజిక అస్తిత్వ చైతన్యంతో సాహిత్యం రావాలి
పేరు కోసమే రాసేవాడు అక్కడే ఆగిపోతాడు. సమాజంలో మార్పు కోసం, సమసమాజ నిర్మాణం కోసం సామాజిక అస్తిత్వ చైతన్యంతో రాసేవాళ్లే అనునిత్యం సూర్యునిలా వెలుగు తారు. సాహితీ కారుని సజన.. మనిషిలోని కనుగుడ్డు మాదిరి స్వల్పంగా కనిపించినా సమాజమంత విస్తతమైనది. సమాజాన్ని సాహిత్యం మార్చగలదని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఆధునిక సాహితీ ప్రక్రియలో పాటకు విశేషస్థానం ఉంది. అది మనుషుల్ని చైతన్యవంతం చేస్తుంది. అదే సినీ యుగళ గీతాలు మనిషికి తాత్కాలిక ఆనందం కలిగిస్తాయి. కొన్నిసార్లు వారి జేబుల్ని గుల్ల చేస్తుంది. తనలోని చైతన్యమే సమాజ చైతన్యమని పలువురు కవులు అనుకుంటారు. అది సరికాదు. సామాజిక అస్తిత్వ చైతన్యం ఉంటేనే సాహితీకారుల సాహిత్యం సుసం పన్నమవుతుందని గుర్తుంచు కోవాలి. అదే ప్రజల చైతన్యస్థాయిలను పెంచి, పోరాడే తత్వాన్ని పెంచుతుంది. సమాజంలో ఆశిం చిన మార్పు సాధ్యమవుతుంది. ప్రస్తుతం దేశం కుంపట్లో ఉంది. పాలకుల దుశ్చర్యలతో మాడిపోయే సమాజాన్ని మేల్కొల్పి చైతన్య వంతం చేసేలా… సాహితికారులే చైతన్య శీలంగా మారి, సాహిత్యాన్ని వెలువర్చాల్సిన సమయం ఆసన్నమైంది.
– నాళేశ్వరం శంకరం, ప్రముఖ రచయిత
తెలంగాణ సాహితే నాకు స్ఫూర్తి
నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన నేను స్థానికంగా సాహితీ స్రవంతి సంస్థ ద్వారా కవిత విధానాన్ని ప్రాథమికంగా నేర్చుకున్నాను. తెలంగాణ సాహితి సంస్థకు చెందిన ప్రముఖ కవుల కవితల్ని చదివి ఎంతో స్ఫూర్తి పొందాను. ఆ స్ఫూర్తితోనే ఎన్నో కవితల్ని వెలువరిస్తున్నానని చెప్పడానికి గర్విస్తున్నాను. కొన్ని పుస్తకాల్ని సైతం ప్రచురించి.. ప్రముఖుల మన్ననలను అందుకోవడం సంతోషంగా ఉంది.
– వనపట్ల సుబ్బయ్య, ప్రముఖ కవి
నూతన ప్రక్రియలపై విశేష కషి జరగాలి
మూస ధోరణిలో, యాంత్రికధోరణి లేని కవిత్వం రావాలి. విభిన్న సాహితీ ప్రక్రియలలో సజన శీలతతో సాహితీ ప్రస్థానం కొనసాగడం అత్యవసరం. అందుకు యువతరం ముందుకు రావలసిన తరుణం ఆసన్నమైంది. సమాజాన్ని చైతన్యపరిచేలా, ప్రజలను అన్యాయాన్ని, అక్రమాన్ని ఎదిరించే పోరాటపటిమ పెంచేలా నవ కవనం రావాలి. అప్పుడే సాహితీ వనం సుసంపన్నమై శోభిస్తుంది.
– వల్లభాపురం జనార్ధన, తెలంగాణ సాహితి రాష్ట్ర అధ్యక్షులు
కాలంతోపాటు కవిత్వము మారాలి
తెలంగాణ సాహితి ఏర్పడినప్పటి నుంచి ఇందులోనే కొనసాగుతున్నాను సామాజిక మాధ్యమాల పుణ్యమా అని సుదీర్ఘ కవితలు చదివే విధానం పోయింది. కవితా పుస్తకాలు ప్రచురించి ఇచ్చినా పాఠకులు వాటిని తిరగేస్తారనే నమ్మకం లేకుండా పోయింది. ప్రజల సమస్యలే ప్రధాన అజెండాగా మారినప్పుడు వారి నుంచి తప్పకుండా సానుకూల స్పందన వస్తుంది. అయితే మనం చెప్పే విధానాన్ని, రాసే పద్ధతిని సజన శీలంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దికోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కవులు ఎంచుకునే అంశాన్ని బట్టే పాఠకుల ఆదరణ ఉంటుందని నేను నమ్ముతాను.
– వెన్నెల సత్యం, ప్రసిద్ధ కవి
యువతకు చుక్కాని..
”తెలంగాణ సాహితి”
ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న యువత ను కవితా పథం వైపునకు తీసుకొచ్చేందుకు ‘తెలంగాణ సాహితి’ కొన్ని జిల్లాల్లో అవిరళ కషి చేస్తోంది. యువతకు కవితా పోటీలు, వ్యాసరచన పోటీలను నిర్వహించి, బహుమతులను అందించి.. భవిష్యత్తులో వారిని మేలైన కవులుగా సమాజానికి అందిం చేందుకు ముమ్మర ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి కషి అన్ని జిల్లాల్లో జరగాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. గతేడాది ‘పాటకు జేజేలు’ కార్యక్రమం ద్వారా సినీ గేయ రచయితలపై పీహెచ్‌డీ పరిశోధకుల చేత సమీక్షలు చేశాం. దానికి చక్కని ఆదరణ లభించింది. ‘తెలంగాణ సాహితీ యాత్ర’ ద్వారా ప్రాచీన కవులు పాల్కురికి సోమ నాథుడు, పోతన, వట్టికోట అళ్వారుస్వామి జన్మభూముల్ని సందర్శించి అక్కడ శిథిలావస్థలో ఉన్న వారి సమాధులను చూసి చలించిపోయాం. సంఘం తరఫున ప్రభుత్వా నికి నివేదిక సమర్పించి, అక్కడ పర్యాటక శోభను తేవడంలో సఫలీకతమయ్యాం. ఆరేండ్ల క్రితం ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ప్రసిద్ధ రచయిత, గోల్కొండ పత్రిక సంపాదకులు, సామాజికవేత్త సురవరం ప్రతాపరెడ్డి జన్మస్థలమైన ఇటిక్యాలపాడును సందర్శించి, యువ కవులను చైతన్యపరిచాం. లెక్కకు మిక్కిలి కార్యక్రమాల ద్వారా యువతకు చుక్కానిగా మారేందుకు తెలంగాణ సాహితి శక్తివంచన లేకుండా అవిరళ కషి చేస్తోంది.
– అనంతోజు మోహన్‌కష్ణ