ఈ నెల 6న పాలమూరు ప్రజాదీవెన

– ఎన్నికల శంఖారావం పూరించనున్న సీఎం రేవంత్‌ రెడ్డి డబుల్‌ డిజిట్‌ లక్ష్యంగా కాంగ్రెస్‌ వ్యూహం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పార్లమెంట్‌ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్‌ సన్నద్ధమవుతోంది. ఈ నెల 6న పాలమూరు ప్రజాదీవెన పేరుతో ఏర్పాటు చేసే సభ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఎన్నికల శంఖారావం పూరించేందుకు సిద్దమవుతున్నారు. సభను విజయ వంతం చేసేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లలో నిమగమయ్యారు. బీజేపీ విజయ సంకల్ప యాత్రల ద్వారా ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో దూసుకు పోతుండగా, బీఆర్‌ఎస్‌ ప్రచారాన్ని ఇంకా ప్రారంభించలేదు.ఈ రెండు పార్టీల అంచనాలను తారుమారు చేస్తూ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మరోసారీ మరిపించేలా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పావులు కదుపుతున్నారు.
ప్రజా దీవెన తో ప్రారంభం
ఈ నెల 6న మహబూబ్‌ నగర్‌లో నిర్వహించే ప్రజాదీవెనతో పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారాన్ని సీఎం రేవంత్‌ రేవంత్‌ రెడ్డి ప్రారంభించనున్నారు. అందుకనుగునంగానే మార్చి 4న పార్టీ మ్యానిఫెస్టో కమిటీ కూడా సమావేశమవుతోంది. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇవ్వబోయే హామీలు, పథకాలపై ఈ సమావేశం చర్చించనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ టికెట్‌ కోసం పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిలో భాగంగా మహబూబ్‌ నగర్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి ఏఐసీసీ సెక్రెటరీ వంశీచంద్‌రెడ్డి పోటీ చేస్తారని సీఎం ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పాలమూరులో భారీ సభకు ప్లాన్‌ చేసినట్టు తెలుస్తోంది. ఈ సభ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంట్‌ నియోజక వర్గాల్లో ప్రజాదీవెన సభలను నిర్వహించన్నారు. ఏఏ ప్రాంతాల్లో సభలు ఏర్పాటు చేయాలనే విషయాలపై సీఎం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. గత సర్కార్‌ చేసిన తప్పిదాలను ఎండగడుతూనే కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో నాలుగింటిని విజయవంతంగా అమలు చేశామని విసృతంగా ప్రచారం చేయాలని పార్టీ కార్యకర్తలు, నాయకులకు దిశా నిర్దేశం చేయనున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో డబుల్‌ డిజిటే లక్ష్యంగా సీఎం రేవంత్‌ తనదైన శైలిలో ప్రచార వ్యూహాన్ని రచించాడని సమాచారం.