గొంతెండుతున్న ‘పాలమూరు’

The roaring 'Palamuru'– పట్టణాలతో సహా ఏజెన్సీ ప్రాంతాల్లో తాగునీటి కష్టాలు
– పడిపోయిన పాతాల జలం
– పెరిగిన ఉష్ణోగ్రతలతో పెరుగుతున్న నీటి అవసరాలు
– రిజర్వాయర్లలో పడిపోయిన నీటిమట్టాలు
– వనపర్తి పట్టణంలోనే నీటి ఎద్దడి
నవతెలంగాణ-మహబూబ్‌నగర్‌ ప్రాంతీయప్రతినిధి
ఎండలు ముదిరిన కొద్ది తాగునీటి కష్టాలు పెరుగుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతమయిన నల్లమలలోని చెంచుపెంటలు తాగునీటికోసం బుగ్గలు, చెలిమెల దగ్గరకు పరుగులు తీస్తున్నారు. కానీ అవసరాలకు తగిన నీటిని సరఫరా కావడం లేదు. రిజర్వాయర్లలో నీటిమట్టాలు డెడ్‌ స్టోరేజీకి పడిపోవడం, పాతాల జలం సైతం క్రమంగా తగ్గడం వల్ల తాగునీటి ఎద్దడి తీవ్రంగా మారింది. ముఖ్యంగా జూరాల సమీపంలో ఉండే వనపర్తి పట్టణంలోనే తాగునీటి ఎద్దడి నెలకొన్నది. తాగునీటి అవసరాల కోసం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని మహిళా సంఘాలు కోరుతున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో సాగునీటి సమస్య ఉండేది. ఇప్పుడు తాగునీటికి సైతం తండ్లాడే సమయం వచ్చింది. మిషన్‌భగీరథ్‌ ద్వారా తాగునీరించే ఎల్లూరు రిజర్వాయరులో సాధారణంగా 7 టీఎంసీల నీరు ఉండాలి. తాజాగా 0.5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఈనీరు బాగా ఎండలు ముదిరితే.. అవిరైపోతుంది. నాగర్‌కర్నూల్‌, వనపర్తి, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకు తాగునీరు అందించే కల్వకుర్తి ఎత్తిపోతలలో భాగంగా నిర్మించిన ఎల్లూరు రిజర్వాయరులో నీటి లభ్యత లేదు. జూరాల నుంచి 1.22 టీఎంసీలు, ఎల్లూరు నుంచి 7.12 టీఎంసీలు, కోయిల్‌సాగర్‌ నుంచి 1.3 టీఎంసీలు, నిల్వ ఉంటేనే తాగునీరు లభించేది. అయితే ఇప్పుడు రిజర్వాయర్లలో డెడ్‌ స్టోరేజీకి నీటిమట్టాలు పడిపోవడంతో తాగునీటి కష్టాలు ఏర్పడ్డాయి. శ్రీశైలం రిజిర్వాయరులో 810 అడుగులకు నీటిమట్టం పడిపోయింది. మున్ముందు మరింత పడిపోయే అవకాశాలు ఉన్నాయి.
మొదలైన తాగునీటి కష్టాలు
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. వనపర్తి మున్సిపాల్టీలో నాలుగు రోజులకొకసారి నీటిని వదులుతున్నారు. పీర్లగుట్ట, చిట్యాల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు, హరిజన వాడలో నీటి ఎద్దడి అధికంగా ఉంది. నాలుగు రోజుల కోకసారి తాగునీటిని వదలుతున్నారు. ముఖ్యంగా అమరచింత మండల పరిధిలోని నందిమల్ల గ్రామంలో తాగునీటి సమస్య తాండవిస్తోంది. ఉన్న ఒక లిప్టు చెడిపోవడంతో గ్రామస్తులు వ్యవసాయ బావులలోకి దిగి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజనపల్లి మండలాల పరిధిలో క్రమంగా నీరు రావడం లేదు. తెలకపల్లి మండల కేంద్రంలో నీటి సరఫరా ఉన్నా.. మడ్డీగా వస్తున్నాయి. దాంతో ఆ నీళ్లు తాగిన వారికి వాంతులు, విరోచనాలు వచ్చి మంచం పడుతున్నారు.
ఏజెన్సీవాసుల సమస్యలు వర్ణనాతీతం
ఇక ఏజెన్సీ వాసుల సమస్యలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఎండలు ముదిరినా కొద్దీ భూగర్బజలాలు పడిపోవడం వల్ల బుగ్గలు, చెలిమలు ఎండిపోయాయి. నల్లమల చెంచులకు తాగునీరు లేక పదుల కిలోమీటర్లు ప్రయాణించి కృష్ణా నీటిని తెచ్చుకుంటున్నారు. అప్పాపూర్‌, లక్ష్మిపల్లి, మల్లాపూర్‌, అప్పాపూర్‌, బౌరాపూర్‌, వెంకటేశ్వర్లబావి, కొమ్మన్‌పెంట, పెట్రోల్‌ చేను తదితర 70కి పైగా చెంచు పెంటల్లో 7వేల మంది చెంచులు జీవిస్తున్నారు. వీరంతా తాగునీటి కోసం తండ్లాడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాలకు తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు కోరుతున్నాయి. పాలకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.