– ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న మద్దతు
– అనేక దేశాల్లో మద్దతుగా ర్యాలీలు, ప్రచారాలు
న్యూఢిల్లీ : పాలస్తీనాపై ఇజ్రాయెల్ బాంబుదాడికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్ తీరును తప్పుబడుతూ.. పాలస్తీనాకు మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ర్యాలీలు, ప్రచారాలు జరుగుతున్నాయి. పాలస్తీనాపై ఇజ్రాయెల్ జరిపిన బాంబుదాడిలో 30 రోజులలో పది వేల మంది పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తున్నది. పాలస్తీనా ప్రజలను అమానవీయంగా హతమార్చటం, బెదిరించటం వంటివి ఇజ్రాయెల్ చేసిందని మానవ హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈనెల 4న ప్రపంచవ్యాప్తంగా 300 నగరాల్లో పాలస్తీనాకు మద్దతుగా ర్యాలీలు జరిగాయి. గాజాలో తక్షణ కాల్పుల విరమణ, దిగ్బంధనానికి ముగింపు పలకాలనీ, పాలస్తీనాకు మద్దతుగా నిలబడాలని డిమాండ్‌లు ఈ ర్యాలీలో వినిపించారు. పాలస్తీనా ప్రజలు విముక్తి కోసం పోరాటం చేస్తున్నారని సామాజికవేత్తలు, మేధావులు, నిపుణులు తెలిపారు.యూఎస్ చరిత్రలోనే అతిపెద్ద పాలస్తీన సంఘీభావ ప్రదర్శనకు ఆ దేశ రాజధాని వాషింగ్టన్ డీసీ కేంద్రమైంది. దాదాపు 3 లక్షల మందికి పైగా ప్రజలు ఇందులో పాల్గొన్నారు. అలాగే, కెనడాలోని కింగ్‌స్టన్, ఒట్టావా, టొరంటో, విన్నిపెగ్‌లతో సహా 30కి పైగా నగరాల్లో పాలస్తీనాకు మద్దతుగా నిరసనలు జరిగాయి. ఈజిప్టులోని తైజ్ గవర్నరేట్‌లో కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు పాలస్తీనా సమస్యలకు మద్దతు ఇవ్వటానికి భారీ ప్రదర్శనను నిర్వహించాయి. ట్యునీషియా, మొరాకో, ఘనా, లెబనాన్, సిరియా, ఇరాక్, ఫిలిప్పీన్స్‌తో సహా దక్షిణ, ఆగేయాసియాలోని కొన్ని ప్రాంతాలలో కూడా పాలస్తీనాకు మద్దతుగా ర్యాలీలు, కార్యక్రమాలు జరిగాయి.