‘సామ్రాజ్యవాదమంటే యుద్ధం’- అని లెనిన్ అన్నట్టు ప్రస్తుత ఇజ్రాయిల్-పాలస్తీనా యుద్ధం దానికి అద్దం పడుతోంది. అమెరికా సామ్రాజ్యవాద సహకారంతో పాలస్తీనాలో చొరబడ్డ యూదులు క్రమక్రమంగా అక్కడి ప్రాంతాలను ఆక్రమిస్తూ స్థానికులను శరణార్థులుగా చేసే స్థితికి చేరారు. అసలు యూదులకు పాలస్తీనాతో సంబంధమే లేదు. అక్కడ నివసించటం తమ పవిత్ర హక్కుగా వారే ప్రకటించుకున్నారు. 19వ శతాబ్దం చివర పలు ప్రాంతాల నుండి పాలస్తీనాకు వలసొచ్చారు. క్రమంగా పాలస్తీనాలో చొరబడి స్థానిక అరబ్బుల సంఖ్యను మించిపోయారు. అంతర్జాతీయ న్యాయ సూత్రా లను ఉల్లంఘించి బలప్రయోగంతో, అమెరికన్ సామ్రాజ్యవాద సహకారంతో 1948లో ఇజ్రాయిల్ అనే నూతనదేశాన్ని ప్రకటిం చుకున్నారు. వాస్తవానికి అంతకుముందు ప్రపంచ రాజకీయ పటంలో ఇజ్రాయిల్ అనే దేశమే లేదు. అప్పటి నుండి పాలస్తీనా నిత్యం మండే రావణ కాష్టం, ఓ నెత్తుటి ప్రవాహం. యూదుల దాడికి తట్టుకోలేక పాలస్తీనాలోని అరబ్బులు పక్క దేశాలైన జోర్డాన్, లెబలాన్, సిరియా, ఈజిప్ట్ తదితర దేశాలలో శరణార్థులుగా శిబి రాల్లో తలదాచుకుంటున్నారు. చివరకు తమ సొంతదేశంలో సైతం శరణార్థులుగా మిగిలిపోయారు. 75 ఏండ్లుగా నానా బాధలు పడుతూ జీవచ్ఛవాలుగా జీవిస్తున్నారు. తమ మాతృభూమిపై మమ కారం, తిరిగి దాన్ని దక్కించుకోవాలనే పట్టుదలతో ఎన్ని దెబ్బలు తిన్నా, త్యాగాలు చేస్తూ పోరాడుతూనే ఉన్నారు. శత్రువుది సామ్రాజ్య వాద బలం, దొంగదెబ్బ అయితే, వారిది ఆత్మస్థైర్యం. పక్క దేశాలలో తలదాచుకొని పోరాటం చేయడం అనేది చరిత్రలోకి పాలస్తీనా ప్రజల తోనే వచ్చింది. కాళ్ల కింద నేల ఉంటే నిలదొక్కుకొని, నిలబడి పోరాటం చేయవచ్చునని, విజయం సాధించవచ్చని చైనా, వియత్నాం ప్రజలు నిరూపించారు. కాని సొంత భూమిలో నిలువ నీడ లేక, కాళ్ల కింద నేల కోసం పోరాటం చేయాల్సి రావడం చరిత్రలో అత్యంత విషాదం.
1933 తర్వాత యూరప్‌లో నాజీయిజం, ఫాసిజం బలపడి యూదు వ్యతిరేకత తీవ్రమై సుమారు 57.5 లక్షల యూదులను నాజీలు హతమార్చారు. దీంతో యూదులు పాలస్తీనాకు పెద్దఎత్తున వలసొచ్చి తలదాచుకున్నారు. పాలస్తీనా అరబ్బు ప్రజలు వీరిని సాద రంగా దయతో ఆశ్రయమిచ్చారు. అయితే ఏండ్లు గడిచేకొద్ది పాలస్తీ నాలో యూదుల జనాభా పెరిగిపోయింది. దీంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరగడం మొదలైంది. 1948 మే 18న యూదులు ఇజ్రాయిల్ దేశాన్ని సొంత దేశంగా, పాలస్తీనాలో తాము అక్రమించుకున్న భూభాగంలో ప్రకటించుకున్నారు. దీంతో ఇక్కడ అప్పటి నుంచి యుద్ధ వాతావరణం ఏర్పడింది. అలాగే అమెరికా, ఇతర బడా దేశాల ఆయుధాలు, అండదండలతో ఇజ్రాయిల్ దూకుడు గా పాలస్తీనా భూభాగాలను ఆక్రమించుకుంటూ రోజురోజుకూ ముందుకు పోయింది. దీనిని సహజంగా స్థానికులైన పాలస్తీనీయులు ప్రతిఘటిస్తున్నారు. అది నేడు ఈ దశకు చేరుకుంది. ఐక్యరాజ్యసమితి పశ్చిమాసియాలో సార్వభౌమాధికారం గల స్వతంత్ర దేశమైన పాలస్తీనాను 2012 దాక గుర్తించలేదు. సభ్యత్వం కూడా ఇవ్వలేదు.
ఈ నేపథ్యంలో పాలస్తీనా విమోచనకు యాసర్ అరాఫత్ నాయ కత్వంలో పీఎల్‌ఓ (పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్) ఏర్పడింది. ఇది కొంతకాలం పాటు సాయుధ పోరాటం కొనసాగించి, క్రమేణ సంప్ర దింపులు, సంధి చేసుకోవడం వంటి మెతక వైఖరి అవలంభిం చటంతో 1987లో ‘హమాస్’ సాయుధ పోరాటంతో పాలస్తీనా విమోచనమే లక్ష్యంగా ఏర్పడింది. దీంతో సంక్షోభం మరింత ముదిరింది. నేటి ఈ పరిస్థితులకు పూర్తి బాధ్యత ఇజ్రాయిల్‌దే. పాలస్తీనా తన అస్థిత్వం కోసం ఆరాటపడుతూ ఉంది. వీరిది ధర్మా గ్రహం, పోరాటం. ఏండ్ల తరబడి అణిచివేతకు ప్రతీ కారమే నేటి ఈ తాజా దాడి. వాస్తవం ఇది కాగా ఇజ్రాయిల్, అమెరికా బడా పెట్టుబడిదారులకు పుట్టిన విష మీడియా హమాస్‌ను తీవ్రవాద, ఉగ్రవాద సంస్థ అంటూ ప్రచారం చేస్తున్నాయి. వాస్తవానికి ప్రపం చంలో భయంకరమైన ఉగ్రవాద దేశం అమెరికాయే. ప్రతి చిన్నదానికి ఇతర దేశాల ఆంతరంగిక సమస్యలలో వేలుపెట్టి, కలహాలు పెట్టి యుద్ధాలు సృష్టించి ఆయుధాలు అమ్ముకుంటూ ఆయా దేశాలలో రక్తం పారించిన చరిత్ర అమెరికాది. నేడు ప్రపంచమంతటా న్యాయమైన తమ సహజ హక్కులు, గౌరవంగా జీవించటం కోసం విధిలేని పరిస్థితుల్లో ప్రజలు పోరాటాలకు దిగితే వారిని తీవ్రవాదులు, ఉగ్రవాదులుగా ముద్ర వేయడం మాములై పోయింది.
రోజురోజుకూ పాలస్తీనీయన్ల న్యాయపోరాటానికి ప్రపంచ దేశాల నుండి మద్దతు పెరుగుతూ ఉంది. గతంలో అలీన విధానంతో బడు గుదేశాలకు అండగా నిలబడిన భారతదేశం నెహ్రు హయాం నుండి పాలస్తీనాకు అండదండలు అందించింది. కాని నేడు దేశ ప్రధాని మోడీ మాత్రం ఇజ్రాయిల్‌కు భారత్ అండగా ఉంటుందని ప్రకటిం చారు. దీనిని బట్టి బీజేపీ విదేశాంగ విధానం అర్ధం చేసుకోవచ్చు. పశ్చిమాసియా ఒక వనరుల గని. అపారమైన చమురు సంపదకు నిలయం. ఈ వనరుల మీద కన్నేసిన అమెరికా, ఇతర సామ్రాజ్యవాద దేశాలు ఈ సంపదను దోచుకోవడానికి మంటలు రాజేసి చలి కాచు కుంటున్నాయి. ముఖ్యంగా అమెరికా అన్నదమ్ములైన ఇరాన్- ఇరాక్ మధ్య చిచ్చుపెట్టి యుద్ధం సృష్టించింది. ఇరాక్‌ను దురాక్రమించి వల్ల కాడుగా మార్చివేసింది. ఆఫ్ఘనిస్తాన్‌ను శ్మశానంగా మార్చి వేసింది. ఇక సిరియా సంక్షోభం అంతాఇంతా కాదు. మొత్తం పశ్చిమాసియాను శరణార్ధి శిబిరంగా మార్చివేసింది. ఇదంతా సామ్రాజ్యవాదం సృష్టిం చిన మానవ సంక్షోభం. అందుకే లెనిన్ మహాశయుడు సామ్రాజ్య వాదమంటే దురాక్రమణ, దోపిడి, యుద్ధం అంటారు. ఈ విష విలయం నుండి మానవాళి విముక్తి చెందాలంటే సోషలిస్టు వ్యవస్థ లను ఏర్పాటు చేసుకోవాలి. పాలస్తీనా ప్రజలు వారి మనుగడ కోసం సొంత భూమిలో నిలవనీడ కోసం పోరాటం చేస్తున్నారు. వారికి యావత్ భారతదేశం అండగా నిలబడాలి. వారి పోరాటం న్యాయ మైనది. న్యాయమైన ఈ పోరాటంలో పాలస్తీనా ప్రజల గెలుపు తధ్యం. పాలస్తీనా విమోచనం తోనే సమస్య పరిష్కారం అవుతోంది.
– షేక్ కరిముల్లా
సెల్ : 9705450705