రేపు పాలస్తీనా సంఘీభావ ప్రదర్శన

Palestine solidarity demonstration tomorrow–  సీఐటీయూ, ఏఐకేఎస్‌, ఏఐఏడబ్ల్యూయూ, ఐద్వా, డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ
–  పోస్టర్‌ ఆవిష్కరించిన నేతలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సామ్రాజ్యవాద శక్తుల అండతో గాజాపై ఇజ్రాయిల్‌ సాగిస్తున్న క్రూరమైన దాడులను సీఐటీయూ, ఏఐకేఎస్‌, ఏఐఏడబ్ల్యూయూ, ఐద్వా, డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ తీవ్రంగా ఖండించాయి. పాలస్తీనాకు సంఘీభావంగా వచ్చేనెల ఒకటో తేదీన ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు ప్రకటించాయి. అందుకు సంబంధించిన పోస్టర్‌ను సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, కార్యదర్శి జె వెంకటేశ్‌, తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్‌, సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి, ఉపాధ్యక్షులు కెఎన్‌ ఆశాలత, పి ప్రభావతి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ వెంకట్రాములు, ఉపాధ్యక్షులు బొప్పని పద్మ, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు, సహాయ కార్యదర్శి కె అశోక్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాగర్‌, మల్లు లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ అఖిల భారత కమిటీలు ఇచ్చిన పిలుపులో భాగంగా వచ్చేనెల ఒకటిన అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో పాలస్తీనా ప్రజలకు సంఘీభావ ప్రదర్శనలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అమెరికా సామ్రాజ్యవాదం అండతో ఇజ్రాయిల్‌ దురంహకారంగా వ్యవహరి స్తున్నదని విమర్శించారు. గాజాలోని పాఠశాలలు, ఆస్పత్రులపై అమానుష దాడులకు పాల్పడుతున్నదనీ, పిల్లలు, మహిళలు అనేక మంది ప్రాణాలు కోల్పోతు న్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎనిమిది వేల మంది మరణిం చారనీ, 14 లక్షల మంది నిరాశ్రయులయ్యారని చెప్పారు. మానవత్వంతో ఆలోచించి ఈ దాడులను ఇజ్రాయిల్‌ ఆపాలని డిమాండ్‌ చేశారు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాలస్తీనా ప్రజలకు ప్రపంచ వ్యాప్తంగా సహకారం అందించలేని పరిస్థితి ఉందన్నారు. ఐక్యరాజ్యసమితి తీర్మానంలో భారత్‌ ఓటింగ్‌లో పాల్గొనకపోవడం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేనెల ఒకటిన నిర్వహించే ప్రదర్శనలో సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే మేధావులు, విద్యావంతులు, విద్యార్థులు భాగస్వాములు కావాలని కోరారు.