వెస్ట్‌బ్యాంక్: గాజాలో ఇజ్రాయిల్ మారణకాండ, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో హింస పెరిగిన నేపథ్యంలో పాలస్తీనా ప్రధాని మహ్మద్ షతారు తన పదవికి రాజీనామా చేశారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని ప్రాంతం పాలస్తీనా అథారిటీ పాలన కింద ఉన్నది. హతారు తన రాజీనామా లేఖను పాలస్తీనా అథారిటీ (పిఎ) అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్‌కు సోమవారం అందచేశారు. పాలస్తీనీయుల మధ్య ఐక్యతను విస్తరించడం గాజాలో పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కొత్త ప్రభుత్వం, రాజకీయ పొందికలు ఏర్పడాల్సిన అవసరం వుందని షతారు పేర్కొన్నారు. పాలస్తీనా అథారిటీ (పిఎ)ని పునర్వవ్యస్థీకరించాలని, యుద్ధం అనంతరం పాలస్తీనాను పాలించగల రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేయడంపై కసరత్తు చేయాలంటూ అమెరికా అబ్బాస్‌పై ఒత్తిడిని పెంచుతున్న నేపథ్యంలో షతారు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఇదిలా వుండగా అబ్బాస్ నేతృత్వంలోని పాలస్తీనా అథారిటీ పాలస్తీనా భూభాగంపై పట్టు పెంచుకోవాలని, గాజాను పాలించాలని వస్తున్న విజ్ఞప్తులు, డిమాండ్లకు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అనుమతి ఎందుకని పాలస్తీనా విదేశాంగ శాఖ ప్రశ్నించింది.
పాలస్తీనా ప్రాంతాలను ఇజ్రాయిల్ ఆక్రమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై అంతర్జాతీయ న్యాయస్థానంలో ఆరు రోజుల పాటు సాగిన వాదనలు ముగిశాయి. తీర్పు ఇంకా వెలువడాల్సి ఉంది.
కరువు కోరల్లో గాజా
గాజా ఉత్తర ప్రాంతానికి ఆహార సరఫరాలు ఆగిపోవడంతో గాజా కరువు కోరల్లో చిక్కుకుందని ఐక్యరాజ్య సమితి పాలస్తీనా శరణార్ధుల సంస్ధ (యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ) హెచ్చరించింది. నెల రోజులకు పైగా ఉత్తర గాజాకు మానవతా సాయం చేరడం లేదని సంస్థ ప్రతినిధి తెలిపారు.
జనవరి 23న చివరిసారిగా సాయం అందించామని ఫిలిప్ లాజారిని సోషల్ మీడియాలో ఆదివారం తెలిపారు. ఇజ్రాయిలే ఇందుకు కారణమని సహాయ సంస్థలు విమర్శిస్తున్నాయి.