– సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ బేబి
అమరావతి : పాలస్తీనా ప్రజలది దేశం కోసం జరిగే స్వతంత్ర పోరాటమని, దాన్ని ఉగ్రవాద చర్యతో పోల్చడం సరికాదని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ బేబి, బివి రాఘవులు తెలిపారు. గురువారం ఉదయం విజయవాడ బాలోత్సవ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావుతో కలిసి వారు మాట్లాడారు. పాలస్తీనాపై ఇజ్రాయిల్ ఏకపక్ష దాడులు జరుపుతోందని, దాన్ని అమెరికాతోపాటు మరికొన్ని దేశాలు సమర్థించడం, రెచ్చగొట్టడం సరైంది కాదని అన్నారు. భారతదేశం తొలి నుండీ పాలస్తీనాకు సంఘీభావంగా నిలిచిందని, ఇప్పుడు ప్రధాని ఇజ్రాయిల్ దాడి చేయడం సరికాదంటున్నారు తప్ప ఆపాలని కోరడం లేదని విమర్శించారు. గతంలో జర్మనీలో హిట్లర్ ఎలాంటి ఊచకోతకు పాల్పడ్డారో అలాంటి చర్య ఇప్పుడు గాజాలో ఇజ్రాయిల్ చేస్తోందని తెలిపారు. చరిత్రలో అక్కడ పాలస్తీనా మాత్రమే ఉందని, అనంతరం ఇజ్రాయిల్‌ను ఏర్పాటు చేశారని, ఇప్పుడు పాలస్తీనానే లేకుండా చేయాలని చూస్త్తున్నారని అన్నారు. ఈ ఏడాది జనవరి నుండి అక్టోబరు నెల వరకూ ఇజ్రాయిల్ సాయుధులు 248 మంది పాలస్తీనా ప్రజలను కాల్చి చంపారని, అందులో 40 మంది పిల్లలు కూడా ఉన్నారని, దీన్నెవరూ ప్రశ్నించడం లేదని అన్నారు.