– ముత్తిరెడ్డికి, రాజేశ్వరరెడ్డికి సయోధ్య కుదిర్చిన కేటీఆర్
– నాయకులంతా కలిసికట్టుగా పని చేయాలంటూ విజ్ఞప్తి
– జిల్లాలోని మూడు సీట్లనూ కైవసం చేసుకోవాలని పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మొదటి నుంచి బీఆర్‌ఎస్‌కు తలనొప్పిగా మారిన జనగామ అసెంబ్లీ నియోజకవర్గపు పంచాయితీ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఆ టిక్కెట్‌ను ఆశిస్తున్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డికి మధ్య ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మంగళవారం సయోధ్య కుదిర్చారు. దీంతో పల్లాకు జనగామ టిక్కెట్ ఖాయమని తేలిపోయింది. హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో గల క్లబ్ హౌజ్ ఈ సయోధ్యకు వేదికైంది. అక్కడ నిర్వహించిన జనగామ బీఆర్‌ఎస్ సమన్వయ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. నాయకులంతా కలిసికట్టుగా పని చేయాలనీ, జిల్లాలోని మూడు సీట్లనూ కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈనెల 16న జనగామలో నిర్వహించే ఎన్నికల మొదటి సభను విజయవంతం చేయాలని నాయకులకి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రైతు బంధు సమితి చైర్మెన్, ఎమ్మెల్యే డాక్టర్ టి రాజయ్య, మాజీ ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, నారదాసు లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం జరగాల్సి ఉండగా సోమవారమే ఎన్నికల కోడ్ వచ్చింది. దాంతో అధికారిక కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి. ఐదు సంవత్సరాలు పట్టించుకోని పాలకులు.. తీరా ఎన్నికల ముందు శంకుస్థాపనలు చేయడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఓట్లతో లబ్ది పొందడం తప్ప హామీల అమలు పట్ల చిత్తశుద్ధి లేదని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి.