పలుకే బంగారమాయెరా..

Saying Bangaramayera..– లోక్‌సభలో పెదవి విప్పని 9 మంది ఎంపీలు
– వారిలో ఆరుగురు బీజేపీ వారే
– జాబితాలో సన్నీ డియోల్‌, శతృఘ్న సిన్హా
న్యూఢిల్లీ : 17వ లోక్‌సభలో అసలే పెదవే విప్పని ఎంపీలు ఉన్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది కదూ! అవును మరి. వారి పలుకే బంగారం అయిపోయింది. రాజకీయవేత్తలుగా మారిన సినీ నటులు సన్నీ డియోల్‌, శతృఘ్న సిన్హా కూడా లోక్‌సభలో ఒక్క మాట కూడా మాట్లాడలేదట. ఇలా లోక్‌సభలో తమ గొంతుక వినిపించని ఎంపీలు మొత్తం తొమ్మిది మంది. గురుదాస్‌పూర్‌ నుండి తొలిసారి బీజేపీ తరఫున ఎంపీగా ఎన్నికైన సన్నీ డియోల్‌ కొన్ని లిఖితపూర్వక అభ్యర్థనలు మాత్రం చేశారట. తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన శతృఘ్న సిన్హా అయితే అది కూడా లేదు. ఆయన ఒక్క మాట మాట్లాడలేదు సరికదా లిఖితపూర్వక అభ్యర్థనలు కూడా అందజేయలేదు.
2019 మేలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత 17వ లోక్‌సభ జూన్‌ 17న తొలిసారిగా సమావేశమైంది. సభలో 543 మంది ఎంపీలు ఉండగా వారిలో తొమ్మిది మంది గత ఐదు సంవత్సరాల కాలంలో ఏ చర్చలోనూ, ఏ సంప్రదింపులలోనూ పాల్గొనలేదు. ఈ జాబితాలో బీజేపీకి చెందిన వారు ఆరుగురు ఉండగా తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన వారు ఇద్దరు, బీఎస్సీకి చెందిన వారు ఒకరు ఉన్నారు. రమేష్‌ చందప్ప జిగాజినగీ (బీజపూర్‌-కర్నాటక), ప్రస్తుతం జైలులో ఉన్న అతుల్‌ కుమార్‌ సింగ్‌ (ఘోసీ-యూపీ), దివ్యేందు అధికారి (తమ్లుక్‌-పశ్చిమ బెంగాల్‌), బీఎస్‌ బాచెగౌడ (చిక్కబళ్లాపూర్‌-కర్నాటక), ప్రధాన్‌ బారువా (లఖింపూర్‌-అసోం), సన్నీ డియోల్‌ (గురుదాస్‌పూర్‌-పంజాబ్‌), అనంత్‌ కుమార్‌ హెగ్డే (ఉత్తర కన్నడ-కర్నాటక), వి.శ్రీనివాస ప్రసాద్‌ (చామరాజనగర్‌-కర్నాటక), శతృఘ్న సిన్హా (అసన్‌సోల్‌-పశ్చిమ బెంగాల్‌) లోక్‌సభ చర్చల్లో భాగస్వాములు కాలేదని దిగువసభ రికార్డులు చెబుతున్నాయి. వీరిలో ఆరుగురు లిఖితపూర్వక అభ్యర్థనలు అందజేయగా శతృఘ్న సిన్హా, అతుల్‌ కుమార్‌ సింగ్‌, చందప్ప మాత్రం ఆ పని కూడా చేయలేదు.
తొలిసారి సభకు ఎన్నికైన సభ్యులతో మాట్లాడించేందుకు స్పీకర్‌ ఓం బిర్లా ప్రయత్నించినా వారి నుండి ఎలాంటి స్పందన రాలేదు. 17వ లోక్‌సభ సమావేశాలు ఈ నెల 9న వాయిదా పడిన విషయం తెలిసిందే.