పాన్‌ ఇండియా స్థాయిలో…

Pan India level...ఓ తెలుగు అమ్మాయికి సినిమాల్లో అవకాశాలు రావడం అంటే.. ఓ పెద్ద అద్భుతం జరిగినట్టే. అందం, అభినయం ఉన్నప్పటికీ తెలుగు అమ్మాయిలను మేకర్స్‌ పట్టించుకోకపోవడం బాధాకరం. అయితే అవకాశం ఇస్తే పరభాషా హీరోయిన్లకి దీటుగా సత్తా చాటుతామని నిరూపించిన తెలుగు హీరోయిన్లలో వైష్ణవి చైతన్య ఒకరు.షార్ట్‌ ఫిల్మ్స్‌ ద్వారా కెరీర్‌  మొదలుపెట్టిన వైష్ణవి చైతన్యకు యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉంది. ‘లవ్‌ ఇన్‌ 143 అవర్స్‌, ది సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌, అరెరె మానస, మిస్సమ్మ’ వంటి తదితర షార్ట్‌ ఫిల్మ్స్‌ వైష్ణవి  చైతన్యకు పాపులారిటీ తెచ్చిపెట్టాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ గుర్తింపుని మరింత రెట్టింపు చేసేలా  సాయిరాజేష్‌ దర్శకత్వంలో వచ్చిన ‘బేబీ’ చిత్రం వైష్ణవి కెరీర్‌ను మలుపు తిప్పింది. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్స్‌ఆఫీస్‌ వద్ద దాదాపు రూ.100 కోట్ల  వసూళ్లను సాధించి చిత్ర పరిశ్రమను సర్‌ప్రైజ్‌ చేసింది. ‘బేబీ’ విజయంలో వైష్ణవిదే కీలకపాత్ర. అందుకే ఆమెకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు దక్కింది. దీంతో వైష్ణవికి  అవకాశాలు క్యూకట్టాయి. ప్రస్తుతం ఆమె ‘జాక్‌’ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో ఆమె ముస్లిం అమ్మాయిగా కనిపించనుందని అని మేకర్స్‌  పోస్టర్‌ ద్వారా కన్ఫర్మ్‌ చేశారు. ఈ సినిమాలోనూ ఆమె పాత్ర చాలా కీలకంగా ఉండబోతుంది. ‘బేబి’తో వైష్ణవి, ‘టిల్లు స్క్వేర్‌’ తో సిద్ధు జొన్నలగడ్డ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి,  సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. దీంతో ‘జాక్‌’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక తెలుగుతో పాటు తమిళం, కన్నడ ఇండిస్టీల నుంచి కూడా వైష్ణవికి అవకాశాలు వస్తున్నాయి. ఈ  నేపథ్యంలోనే రెండు తమిళ, కన్నడ సినిమాలకు ఆమె సైన్‌ చేశారు. అలాగే ఇతర భాషల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ అందాల తార పాన్‌ ఇండియా కథానాయికగా ఈ ఏడాదిలో మరిన్ని విజయాలను దక్కించుకుంటాననే నమ్మకంతో ఉంది.