పాన్‌ ఇండియా సినిమా ఫణి

Pan India movie Faniడైరెక్టర్‌ వీఎన్‌ ఆదిత్య రూపొందిస్తున్న పాన్‌ ఇండియా సినిమాకు ‘ఫణి’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ థ్రిల్లర్‌ సినిమాను ఓ.ఎం.జీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై ఏయు అండ్‌ ఐ స్టూడియో సమర్పణలో డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కేథరీన్‌ ట్రెస్సా లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌, ఓ.ఎమ్‌.జీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ లోగో ఆవిష్కరణ కార్యక్రమం అమెరికాలోని డల్లాస్‌లో జరిగింది. ఈ సినిమా టైటిల్‌ను డాక్టర్‌ తోటకూర ప్రసాద్‌ లాంచ్‌ చేయగా, నిర్మాత అనిల్‌ సుంకర బ్యానర్‌ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ ఆళ్ల శ్రీనివాస రెడ్డి, డాక్టర్‌ ఇస్మాయిల్‌ సుహైల్‌ పెనుగొండ అతిథులుగా పాల్గొని ఈ సినిమా టీమ్‌కు బెస్ట్‌ విషెస్‌ అందించారు. ఈ సందర్భంగా మ్యూజిక్‌ డైరెక్టర్‌, నిర్మాత డా.మీనాక్షి అనిపిండి మాట్లాడుతూ, ‘నేను ఇప్పటిదాకా మీకు బాగా మ్యూజిక్‌ చేస్తానని, పాటలు పాడతానని తెలుసు. ఈ సినిమాతో మా ఓ.ఎం.జీ ప్రొడక్షన్‌ బ్యానర్‌ పై తొలి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే 50 శాతం షూటింగ్‌ కంప్లీట్‌ చేశాం. మిగతా షూటింగ్‌ పూర్తి చేసి, త్వరలోనే పాన్‌ ఇండియా రిలీజ్‌కు తీసుకొస్తాం’ అని అన్నారు. హీరోయిన్‌ కేథరీన్‌ ట్రెస్సా మాట్లాడుతూ, ‘ఈ కథ విన్న వెంటనే ఈ మూవీ చేస్తానని చెప్పాను. కథ నన్ను అంతగా ఇంప్రెస్‌ చేసింది. నా కెరీర్‌లో చేస్తున్న ఛాలెంజింగ్‌ క్యారెక్టర్‌ ఇదేనని చెప్పగలను. దర్శకుడు డాక్టర్‌ వీఎన్‌ ఆదిత్యతో వర్క్‌ చేయడం వండర్‌ఫుల్‌ ఎక్స్‌పీరియన్స్‌. త్వరలోనే మీ ముందుకు ఓ మంచి థ్రిల్లర్‌ మూవీతో రాబోతున్నాం’ అని తెలిపారు.
‘మీనాక్షి మ్యూజిక్‌ డైరెక్టర్‌గా నాకు బాగా తెలుసు. తను సినిమా ప్రొడ్యూస్‌ చేస్తానని అన్నప్పుడు ముందు ఒక షార్ట్‌ ఫిలిం చేయి, ప్రొడ్యూసర్‌ ఇబ్బందులు తెలుస్తాయి అన్నాను. కథ చెప్పండి అంది. అలా కథ చెప్పిన సాయంత్రమే షూటింగ్‌కి వెంటనే ఏర్పాట్లు చేసింది. అప్పుడు అనుకున్నా తను ప్రొడ్యూసర్‌గా రాణిస్తుందని. ఈ సినిమా కథ చెప్పగానే కేథరీన్‌కి బాగా నచ్చింది. కేథరీన్‌ లేకుంటే ఈ మూవీ లేదు’ అని డైరెక్టర్‌ వీఎన్‌ ఆదిత్య చెప్పారు. నిర్మాత డాక్టర్‌ మీనాక్షి అనిపిండి త్వరలోనే వాకో సిటీలో తను నిర్మించబోయే ‘ఫిష్‌ ఐ’ స్టూడియో బ్రోచర్‌ని మాస్టర్‌ ధన్విన్‌ పాకా, మాస్టర్‌ శ్రీకర్‌ కల్లూరి ఆవిష్కరించారు.