అడివి అంటుకుంది కార్చిచ్చు చెట్ల మీద అగ్నిపూలు పూయిస్తున్నది. మంటలు నాలుకలు చాచి నింగిని అంటుకోవాలని ప్రయత్నిస్తున్నవి. కొమ్మలమీది కోతులు కిచకిచలాడ్డం మానేసి దారీ డొంకా చూసుకోకుండా పరుగెత్తసాగాయి. కుందేళ్లు గంతులేయడం మాని లేళ్లలా లేళ్ల వెనుక పరుతెత్తసాగినయి. పక్షులు ఆకాశంలో గిరికీలు కొడ్తున్నవి. చిన్నాచితకా జీవులన్నీ ప్రాణాలు తోకల్లో పట్టుకు పారిపోసాగినవి. కొండ గుహల్లో పులులూ, సింహాలూ సేఫ్‌గా కూచుని జరుగుతున్న విధ్వంసాన్ని చూస్తున్నవి. రేపటి నుంచి తిండి ఎలాగా అని బెంగపడుతున్నవి.
పెద్ద మర్రి చెట్టు ఊడలు నేలకు ఆనుతున్న మర్రిచెట్టు. దానికి అయిదు పెద్ద కొమ్మలు. అయిదు కొమ్మల్లో వేలాడుతున్నవి ఐదు భూతాలు. మంటలు మనదాకా వచ్చేట్టున్నాయి అంటూ కీచుమని అరిచింది ఒకటో భూతం. మనమూ కాలి బూడిదై పోతామా? అంది రెండో భూతం. కాలి బూడిద అవడానికి మనం మనుషులం కాదు, భూతాలం కదా అంది మూడో భూతం. కాలం. కాలకపోయినా వేడి తగుల్తున్నది. చిరాగ్గా వుంది అంది నాలుగో భూతం. అయితే ఇప్పుడేం చేద్దాం అంది అయిదవది.
ఆలోచిద్దాం అంది ఒకటో భూతం తలమీది కొమ్ము కొమ్మకి రాసుకుంటూ. అందరమూ కలిశా, ఎవరికి వారమేనా? అంది రెండో భూతం. ఇన్నాళ్లూ కల్సి వున్నాం కదా అంది మూడో భూతం. కలిసే ఆలోచిద్దాం అంది నాలుగవది. ఏదో ఒకటి చేద్దాం అంది అయిదవ భూతం. నాకు ఒకటి తోస్తున్నది అన్నది మొదటి భూతం. ఒకటి తోస్తే చాలు రెండూ మూడూ ఎందుకు అన్నవి రెండు, మూడు భూతాలు. నాలుగూ అయిదూ అక్కర్లేదు అన్నవి.
ఒకటి చేద్దాం అన్న ఒకటవ భూతం ఆ ఒకటేమిటో చెప్పింది. అడివంతా రావణాసురుడి కాష్టంలా కాలుతున్నది. ఈ మర్రి చెట్టు మీదే భూతాల్లా వేలాడ్డం కరెక్టు కాదు, మనం ఈ చోటు ‘వెకేట్’ చేద్దాం.
చేద్దాం, చేద్దాం కానీ ఎక్కడికి వెళ్తాం అన్నవి నాలుగు భూతాలూ ఏకగ్రీవంగా. మనం ముందు ఈ చెట్టు వదిలేద్దాం. పక్కనే వున్న ఊరువైపు ఎగిరిపోదాం అన్నది ఒకటవ భూతం. ఊళ్లోకి మనని రానివ్వరు, అది మనుషులు వుండే ఊరు అంది రెండోది. ఓటరు కార్డు, ఆధార్ కార్టు లేనివాళ్లని ఊళ్లోకి రానివ్వడం లేదు. నిన్న అలా వాకింగ్‌కు వెళ్లినప్పుడు గమనించా అన్నది మూడవది. అవును, ఎన్నికలట గదా అంది నాలుగవది. ఓటర్లు కాని వ్లాను లోపలికి రానివ్వడం లేదు, ఓటర్లు అయినవాళ్లను ఊరు వదిలి పోనివ్వడం లేదు అన్నది అయిదవది.
అలాగైతే ఓ పని చేద్దాం అంది మొదటి భూతం. చెప్పు చెప్పు అన్నవి తత్తిమా భూతాలు. ఊళ్లోకి వెళ్తున్న వాళ్ల బుర్రల్లోకి దూరిపోదాం, ఊళ్లో కొన్నాళ్లుండి వద్దాం అన్నది మొదటి భూతం. అయిదు భూతాలం కదా ఐదుగురు మనుషులు దొరకాలి కదా అన్నది రెండో భూతం. ఐదు బుర్రలు దొరకడం కష్టం అన్నది మూడో భూతం. అవును.. ఇన్నాళ్లూ మర్రి బుర్రను కలిసికట్టుగా వాడుకున్నాం. అలాగే ఒక్క మనిషి బుర్రలోకి అయిదుగురమూ దూరేద్దాం అన్నది నాలుగో భూతం. ఊళ్లోకి వెళ్లాక మార్చి మార్చి అందరు మనుషుల బుర్రల్లోకి దూరి సరదాగా గడిపేద్దాం. మన తడాఖా చూపిద్దాం అన్నది మొదటి భూతం. మాట్లాడకుండా వుంది అయిదవ భూతం.
‘హమ్మ్’ అంటూ అయిదు భూతాలూ గాల్లోకి ‘డైవ్’ చేశాయి.
అయిదు భూతాలూ ఊళ్లోకి వెళ్తున్న ఓ మనిషి బుర్ర తలుపు తెరిచి లోపలికి దూరాయి. ఊళ్లోకి వెళ్తున్న మనిసిని ఎదురుపడ్డ మరో మనిషి అడిగాడు. నీకు ఓటు హక్కుందా అని.
హక్కేమిటి, మా ఇంట్లో డజను ఓట్లున్నయి అన్నాడు ఒకటో మనిషి. డజనంటే బాగానే గిట్టుబాటవుతుంది. ఎవరికేస్తారేమిటి ఓటు? అనడిగాడు రెండవ మనిషి.
మొదటి మనిషి బుర్రలో వున్న మొదటి భూతం లోపల్నుండే ఓ మొట్టికాయ వేసింది. అది ‘మత భూతం’ చెప్పాడు మొదటి మనిషి. పార్టీతో సంబంధం లేదు. మనిషి ఎవరో అక్కర్లేదు, మా మతం వాడయి వుండాలి అంతే అన్నాడు మొదటి మనిషి.
దారంట వెళ్తున్న మొదటి మనిషికి మరొకడు ఎదురొచ్చేడు. ఇంకో నాల్గు రోజుల్లో ఓట్ల పండగ కదా. నీ ఇంట్లో డజన్ ఉన్నవి కదా. మీ ఓట్లు ఎవరికి? అన్నాడు మూడవ మనిషి.
మొదటి మనిషీ, ఓటరూ అయిన వాడి బుర్రలో వున్న రెండవభూతం లోపలుండే మొట్టికాయ వేసింది. అది ‘కుల భూతం’ చెప్పాడు ఓటరు. పార్టీతో సంబంధం లేదు, మనిషి ఎవరో అక్కర్లేదు. మా కులం వాడయి వుండాలి అంతే అన్నాడు.
అయిదు భూతాలనీ మోస్తూ దారంట వెళ్తునన ఒంటరి ఓటర్ని అడిగాడు ఎదురైనవాడు. నేటికి నాలుగవ రోజున ఎన్నికలట గదా! ఎవర్ని ఎన్నుకుంటారు నువ్వూ, నీ ఫ్యామిలీ.
ఓటరు బుర్రలో వున్న మూడవ భూతం లోపల వుండే మొట్టికాయ వేసింది. అది ‘మందు భూతం’ చెప్పాడు ఓటరు. పార్టీతో సంబంధం లేదు, మనిషి ఎవరో అక్కర్లేదు. మందు ఫుల్లు బాటిల్లూ, బిర్యానీ పొట్లాలూ అందించే వాడయి వుండాలి అంతే అన్నాడు.
మరో ఎదురైన మనిషికి అడగకుండానే చెప్పాడు ఓటరు, బుర్రలో వున్న భూతం మొట్టికాయకు జడిసి. అది ‘మనీ భూతం’. పార్టీతో సంబంధం లేదు, మనిషి ఎవరో అక్కర్లేదు. మా డజను ఓట్లూ మంచి ధర ఇచ్చి ఎవరు కొంటే వారికి వేస్తాం అంతే!
బుర్రలో వున్న అయిదవ భూతం మౌనంగా వుండడంతో ఇది ఎప్పుడూ ఇంతే… ఉలుకూ పలుకూ వుండదు. ఒక ఓటరు బుర్ర చెడ్డది కదా, మరో బుల్రో దూరుదాం. ఊరి నిండా బుర్రలే అంటూ నాలుగు భూతాలూ జనం బుర్రల్లోకి జొరబడ్డయి.
ఓటరు బుర్రలో మౌనంగా వున్నది ‘ఆత్మభూతం’. మతమూ, కులమూ, మందూ, మనీ వంటి ప్రలోభాలకు లొంగకుండా ‘ఆత్మసాక్షి’గా ప్రజాక్షేమం కోరే మంచి మనిషిని ఎన్నుకోండి అని చెప్పాలని దాని ఆరాటం. ఓటు వేయడానికి ఒక్క క్షణం ముందు దాని మాట వింటారా? ప్రజాస్వామ్యాన్ని బతికిస్తారా ఓటర్లూ!!
– చింతపట్ల సుదర్శన్
9299809212