– అప్పులు చేసి నెట్టుకొస్తున్న కార్యదర్శులు..
– డిజిటల్ ‘కీ’ రాక విడుదల కాని నిధులు..
– అభివృద్ధికి జాయింట్ చెక్ పవర్ ఆటంకం..
నవతెలంగాణ-సూర్యాపేట కలెక్టరేట్ : గ్రామపంచాయతీల్లో రోజువారీ నిర్వహించే పనులకు నిధుల సమస్య తలెత్తింది.గ్రామంలో మంచినీరు, విద్యుత్ దీపాలు, ట్రాక్టర్ ద్వారా చెత్తాచెదారాన్ని సేకరించి డంపింగ్ యార్డ్ లో వేయడం,నీటి సమస్య ఏర్పడితే పరిష్కరించడం వంటి గ్రామ సమస్యలు పరిష్కరించేందుకు నిధులు లేక నిలిచిపోతున్నాయి. పనులు చేపట్టేందకు జీపీ కార్యదర్శుల వద్ద డబ్బులు లేక సతమతమవుతున్నారు.గతంలో సర్పంచులు ఉన్న సమయంలో ఇలాంటి పనులకు డబ్బులు వెచ్చించి నిధులు రాగానే తీసుకునేవారు.ఆ పరిస్థితి ఇప్పుడు లేకుండా పోయింది.ప్రత్యేకాధికారులు నామమాత్రం కావడంతో జీపీ కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్నారు.కొన్ని చోట్ల అప్పులు తెచ్చి పనులు చేపడుతున్నట్టు కార్యదర్శులు వాపోతున్నారు.
జిల్లా వ్యాప్తంగా 475 గ్రామపంచాయతీలు..
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 475 గ్రామపంచాయ తీలున్నాయి.సర్పంచ్ పదవీకాలం పూర్తయి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పల్లెల్లో ప్రత్యేకాధికారుల పాలన వచ్చింది. జిపి సెక్రెటరీలు, ప్రత్యేకాధికారులకు చెక్ పవర్ ఇచ్చారు. గ్రామపంచాయతీకి 15 ఫైనాన్స్, స్టేట్ ఫైనాన్స్, జనరల్ ఫండ్ ఈ మూడు నిధుల ద్వారా నిధులు వస్తాయి. 15 స్టేట్ ఫైనాన్స్ జనాభా ప్రాతిపదికన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామపంచాయతీ అకౌంట్లో నిధులు జమ చేస్తాయి. గ్రామంలో వసూలైన పన్నులు, ఇతర నిధుల ద్వారా వచ్చే ఆదాయాలు జనరల్ ఫండ్ లో జమ చేసి పంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లిస్తారు. గ్రామ పాలనకు 15 ఫైనాన్స్, స్టేట్ ఫైనాన్స్ నుండి వచ్చే నిధుల ద్వారా గ్రామ సమస్యలు పరిష్కరించాల్సి ఉంటుంది. 15 ఫైనాన్స్ నిధులు సర్పంచుల పదవీకాలం ముగిసె సమయంలో సర్పంచులు చేసిన పనులకు బిల్లులు తీసుకోగా, గత సంవత్సర కాలం నుండి రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ లో నిధులు జమ చేయలేదు. ప్రస్తుతం పంచాయతీలో స్టేట్ ఫైనాన్స్, 15 ఫైనాన్స్ లలో నిధులు లేక, ఇటు ఇంటి పన్నులు, ఇతర ఆదాయం నుండి వచ్చే ఆదాయాలు జనరల్ ఫండ్ లో సమకూరక పంచాయతీ నిర్వహణ స్పెషల్ ఆఫీసర్లు, కార్యదర్శులకు భారంగా మారింది.
స్పెషల్ ఆఫీసర్లు నియమించిన వారు వారి విధులు
నిర్వహించుకోవడంతోనే సరిపోతుంది. ఉన్న పంచాయతీ కార్యదర్శులు గ్రామపంచాయతీలో నిధులు లేక తమ సొంత జీతాలతో ఖర్చు చేస్తూ సమస్యలు పరిష్కరిస్తున్నారు. గ్రామంలోని నీటి సమస్య మొక్కలకు నీళు – పోసే వాటర్ మెన్ జీతాలు, విద్యుత్ సమస్య, ట్రాక్టర్ ఇలా చాలావరకు పంచాయతీ కార్యదర్శులు చెల్లించి పంచాయతీ పాలన నిర్వహిస్తున్నారు. దీంతో కార్యదర్శుల కుటుంబ ఖర్చులు భారమై అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఓ పంచాయతీ కార్యదర్శి పంచాయతీలో ఖర్చు చేసిన నిధులు రాకపోవడంతో సొంత జీతాలతో పంచాయతీ సమస్యలు పరిష్కరించి కుటుంబ ఖర్చులకోసం బంగారం తాకట్టు పెట్టుకున్నట్టు సమాచారం.
సర్పంచుల పదవీకాలం ముగియకముందే డిజిటల్ కీల సమస్య పరిష్కరించాల్సిన అధికారులు కాలయాపన కారణంగా నిధులు రాక కార్యదర్శులకు తలనొప్పిగా మారింది. ఏది ఏమైనప్పటికీ నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలోనైనా స్టేట్ ఫైనాన్స్ నిధులు విడుదల చేసి పంచాయతీ సమస్యలు పరిష్కరించడంలో నిధుల కొరత లేకుండా చేసి అప్పులు చేసి మరీ గ్రామ సమస్యలు పరిష్కరిస్తున్న కార్యదర్శులకు నిధుల కొరత లేకుండా చూడాలని కార్యదర్శులు కోరుచున్నారు.
పెండింగ్ లో డిజిటల్ ‘కీ’…
సర్పంచుల పదవీకాలం ముగిసిన తర్వాత బిల్లుల మంజూరు కొరకు స్పెషల్ ఆఫీసర్,పంచాయతీ కార్యదర్శుల డిజిటల్ కి ద్వారా నిధులు విడుదల చేసుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం డిజిటల్ కీలు పెండింగ్లో ఉన్న కారణంగా నిధులు రాక పంచాయతీ పాలన ఏ విధంగా కొనసాగించాలో తెలియక కార్యదర్శులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ సమస్యలు పరిష్కరించకుంటే అధికారులకు ఒత్తిడి, డబ్బులు లేని కారణంగా ఏ విధంగా పనులు చేయాలో తెలియక అప్పులు చేసి మరి సమస్యలు పరిష్కరిస్తున్నారు.
గ్రామాల అభివృద్ధికి ఆటంకం జాయింట్ చెకపవర్ ఇస్తేనే మేలు..
పంచాయతీల్లో అభివృద్ధి ఇతర కార్యక్ర మాలను చేపట్టేందుకు ప్రతినెలా కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు అందించే 15 ఫైనాన్స్ కింద ఎస్ఎఫ్ సి, జన రల్ ఫండ్ నిధులను కేటాయిస్తున్నాయి. వీటిని గతం లో సర్పంచులు, ఉపసర్పంచులు వారి చెక్ పవర్ ద్వారా అవసరని బట్టి వినియోగించుకునేవారు. ప్రస్తుతం ఆ చెక్ పవర్ ను ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులకు ఇవ్వాల్సి ఉంది. అయితే గ్రామపంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియ మించి నెల పదిహేను రోజులు గడిచినా చెక్ పవర్ ఇవ్వకపోవ డంతో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగడం లేదు.పీఎఫ్ఎంఎస్ నిధులకు సంబంధించి డిజిటల్ కి కూడా నేటికీ ఇవ్వలేదు.ఒక్కో పంచాయతీల్లో రూ.50వేలకు పైగా ఖర్చు జిల్లాలో 475 గ్రామ పంచాయతీలున్నాయి. ఆయా గ్రామాల్లో ప్రతిరోజూ ట్రాక్టర్ లో డీజిల్ పోయించాల్సి ఉంటుంది. అలాగే పారిశుధ్యం కోసం బ్లీచింగ్ పౌడర్,విద్యుత్ మోటార్ల మరమ్మతు,వీధిలైట్ల ఏర్పాట్లు పనులకు సొంతంగా ఖర్చు చేయాల్సి వస్తోందని పలువురు కార్యదర్శులు వాపోతున్నారు. ఒక్కో గ్రామపంచాయతీలో ఇప్పటికే రూ.50 వేలకు పైగా ఖర్చు చేసినట్లు అధికారులు అంటున్నారు. గత నెలలో 10 రోజులపాటు ప్రత్యేక పారిశుధ్య వారోత్సవాలను ప్రత్యేక అధికారులు, కార్యదర్యులు విజయవంతంగా పూర్తిచేశారు.జిల్లా లోని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, ఔబ్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులకు గత నెలకు సంబంధించి వేతనాలు మంజూరు కాలేదు అని సమాచారం. అభివృది పనులకు అప్పు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని పలువురు చెబుతున్నారు. ప్రతినెలా విద్యుత్ బిల్లు, ట్రాక్టర్ కు నెలవారీ రుణాలు, మల్టీపర్పస్ వర్కర్లకు తప్పనిసరి కావడంతో, ప్రస్తుతం ఇవీ త్వరగా చెల్లిం చకుంటే పరిస్థితులు దారుణంగా ఉంటాయని మాజీ సర్పంచులు, పంచాయతీ అధికారులు అంటున్నారు.ప్రభుత్వం, ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ చూపి ప్రత్యేకాధికారులు, కార్యదర్యులకు జాయింట్ చెక్ పవర్ ను త్వరగా ఇవ్వాలని నాయకులు, ప్రజలు కోరుతున్నారు.
ఎస్ టి ఒ లకు ఉత్తర్వులు అందజేస్తాం.. జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి. సురేష్ కుమార్.
గ్రామ పంచాయతీ ప్రత్యే కాధికారులకు,పంచాయతీ కార్యదర్శులకు జాయింట్ చెక్ పవర్నీ జిల్లాలో కొంతమేరకు అందజేశాము.మిగతా గ్రామ పంచాయతీలకు కూడా తగిన చర్యలు తీసుకున్నాం. త్వరలోనే జాయింట్ చెక్ పవర్ నీ కల్పిస్తూ ఎస్టీవోలకు ఉత్తర్వులు జారీ చేస్తాం.గ్రామాల్లో అభివృద్ధి పనులు యధావిధిగా నిర్వహించేలా చూస్తాం.