నేడు పంచాయతీ సిబ్బంది సమ్మె నోటీసు

– గ్రామపంచాయతీ కార్మికులు, ఉద్యోగుల జేఏసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మల్టీపర్పస్‌ రద్దు, కారోబార్‌, బిల్‌కలెక్టర్లకు స్పెషల్‌ స్టేటస్‌, జీవో నెంబర్‌ 60 అమలు, తదితదిర అంశాలపై పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌కు సోమవారం సమ్మె నోటీసు ఇవ్వనున్నట్టు గ్రామపంచాయతీ కార్మికులు, ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు జేఏసీ చైర్మెన్‌ పాలడుగు భాస్కర్‌, ప్రధాన కార్యదర్శి ఎన్‌.యజ్ఞనారాయణ తెలిపారు. ప్రధానంగా 19 డిమాండ్లతో సమ్మె నోటీసు ఇవ్వనున్నామని చెప్పారు. దానికి సంబంధించిన వివరాలను వారు మీడియాకు వెల్లడించారు. గ్రామపంచాయతీ సిబ్బందిని పర్మినెంట్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పీఆర్సీలో కనీస వేతనంగా నిర్ణయించిన రూ.19 వేలను వేతనంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కారోబార్‌, బిల్‌కలెక్టర్లకు స్పెషల్‌ స్టేషన్‌ కల్పించాలనీ, అర్హులందరికీ ప్రమోషన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎస్‌కే.డే ఇన్సూరెన్స్‌ పథకాన్ని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. మల్టీపర్పస్‌ విధానాన్ని రద్దు చేయాలనీ, అవసరమున్న చోట కొత్త సిబ్బందిని నియమించాలనీ కోరారు. పంచాయతీ కార్మికులు, ఉద్యోగులకు ఈఎస్‌ఐ, పీఎఫ్‌, ప్రమాదబీమా, యూనిఫామ్స్‌, అలవెన్స్‌లు, తదితర సౌకర్యాలను వర్తింపజేయాలని విన్నవించారు. ప్రమాదాల్లో మరణించిన కుటుంబాలను ఆదుకోవాలనీ, దహనసంస్కారాలకు ప్రత్యేకంగా డబ్బులు ఇవ్వాలని కోరారు. జేఏసీ సమావేశంలో కన్వీనర్లు పి.అరుణ్‌కుమార్‌, పి.శివబాబు, చాగంటి వెంకటయ్య, జయచంద్ర, కోకన్వీనర్లు వెంకటరాజ్యం, ఆర్‌.మధుసూదన్‌రెడ్డి, పాలడుగు సుధాకర్‌, ఆర్‌కే.నాయుడు, కోశాధికారి సీహెచ్‌ సదానందం, జేఏసీ సభ్యులు సామల శ్రీకాంత్‌, వెంకట్రాములు, డి.యాదయ్య, రాందాసు, తదితరులు పాల్గొన్నారు.