గుర్రాల చెరువు కనుమరుగైన పంచాయితీ…

The panchayat where the horse pond disappeared...– నాడు నేడు వార్డుగా…
నవతెలంగాణ – అశ్వారావుపేట
సామాజిక అభివృద్దిలో ప్రాంతాలు విస్తరిస్తాయి కనుమరుగు అవుతుంటాయి. అయినా చరిత్రలో వాటికంటూ ఒక పేజీని అట్టి పెట్టుకుంటాయి. దీనికి మంచి ఉదాహారణ గుర్రాల చెరువు పంచాయితీ. 2019 కంటే మునుపు అశ్వారావుపేట పంచాయితీ 16వ, వార్డుగా ఉన్న గుర్రాల చెరువు ఆవాసం నూతన పంచాయితీల విస్తీర్ణంలో భాగంగా గుర్రాల చెరువు ఏర్పాటు అయింది. తెలంగాణ ప్రభుత్వం 2019 లో మండలంలో 16 పంచాయితీలు ను 30 పంచాయితీలు గా విస్తరించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 1248 జనాభాతో,726 ఓటర్లు తో నూతన పంచాయితీగా ఏర్పాటు అయిన గుర్రాల చెరువు పంచాయితీ ఒకటి. ఈ పంచాయితీలో గుర్రాల చెరువు, మారుతి నగర్ ఆవాసాలు ఉన్నాయి. ఈ పంచాయితీ ఎస్.సీ జనరల్ కు రిజర్వు కావడంతో అదే గ్రామంలో ఎన్నో దఫాలు వార్డ్ మెంబర్ గా ఎన్నికైన కలపాల దుర్గయ్య అనే దళిత సామాజిక వర్గం వ్యక్తి సర్పంచ్ గా ఎన్నికయ్యారు. అశ్వారావుపేట పంచాయితీలో వార్డుగా ఉన్న సమయంలో నాడు అశ్వారావుపేట సర్పంచ్ కొక్కెరపాటి పుల్లయ్య, కలపాల దుర్గయ్య లు సహా విద్యార్ధులు కావడం గమనార్హం. అంతేగాక ప్రస్తుతం కాంగ్రెస్ మండల అద్యక్షుడుగా.. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రధాన అనుచరుడైన తుమ్మ రాంబాబు గుర్రాల చెరువుకు చెందిన వ్యక్తే కావడం మరో విశేషం. ఒకప్పుడు అశ్వారావుపేట 3 కి.మీ దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండేది. కాలక్రమేణ బీటీ రోడ్డు ఏర్పాటు కావడంతో పట్టణానికి దగ్గర అయింది. ఇటీవల మేజర్ పంచాయితీ అయిన అశ్వారావుపేటలో గుర్రాల చెరువు, పేరాయిగూడెంలను విలీనం చేయడంతో తిరిగి గుర్రాల చెరువు మున్సిపాల్టీలో వార్డ్ గా రూపాంతరం చెందింది. అయిదు ఏండ్లు పాలనా కాలం మాత్రమే పంచాయితీగా ఉండి కనుమరుగైన పంచాయితీగా “గుర్రాల చెరువు” తనకూ చరిత్రలో ఒక పుటను లిఖించుకుంది. అయితే ఇటీవలే ఆ పంచాయితీ పరిపాలన కోసం రూ.20 లక్షల వ్యయంతో పంచాయితీ భవనాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే ప్రారంభించి నెల గడవక ముందే ఈ పంచాయితీ అశ్వారావుపేటలో విలీనం గావడం కొసమెరుపు.