పంచాయతీ కార్మికుల

– సమ్మె విరమణకు చర్యలు తీసుకోండి
– సీఎం కేసీఆర్‌కు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గ్రామపంచాయతీ కార్మికులు కొనసాగిస్తున్న సమ్మె విరమణకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ను ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామపంచాయతీల్లో సుమారు 50 వేల మంది కార్మికులు ఏండ్లుగా పనిచేస్తున్నారని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామాల్లో కారోబార్లు, డ్రైవర్లు, వాచ్‌మెన్స్‌, స్వీపర్లు, బిల్‌ కలెక్టర్లు, ఎలక్ట్రిషీయన్లుగా విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. 14 డిమాండ్ల పరిష్కారం కోసం ఈనెల ఆరు నుంచి సమ్మె ప్రారంభిం చారని గుర్తు చేశారు. 24 రోజులు గడుస్తున్నా సీఎం, సంబంధిత మంత్రిగానీ జేఏసీ నాయకత్వంతో చర్చించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయకపోవడం దారుణమని విమర్శించారు. ఇప్పటికైనా సీఎం వెంటనే జేఏసీతో చర్చలు జరిపి సమ్మెను విరమింపజేయాలని డిమాండ్‌ చేశారు. పంచాయతీ కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలనీ, పీఆర్సీ ప్రకారం కనీస వేతనం రూ.19 వేలు చెల్లించాలని కోరారు. వర్షాకాలం కావడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. సమ్మె వల్ల గ్రామాల్లో పరిశుభ్రత తీవ్రంగా లోపించిందని వివరించారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.