పంచాయతీ కార్మికులు రోడ్డుపై బైఠాయింపు  

నవతెలంగాణ – ఆళ్ళపల్లి 
రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్మికుల నిరవధిక సమ్మెలో భాగంగా సోమవారం 33వ రోజు మండలంలోని పంచాయతీ కార్మికులు ఆళ్ళపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించి, రాస్తారోకో కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీపీఐ, ఎన్డీ పార్టీల నాయకులు పాల్గొని, మద్దతు తెలిపారు. దాంతో ఒక గంట పాటు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఉద్రిక్త వాతావరణం నెలకొనక ముందే స్థానిక ఎస్సై రతీష్ ఆదేశాల మేరకు ఎఎస్ఐ సీహెచ్.వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ వి.రాజేశ్వర్రావు, కానిస్టేబుల్ వై.శ్రీనివాస్ ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రేసు ఎల్లయ్య, మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ రహీం, ఎన్డీ నాయకులు బత్తిని సత్యం , వార్డు మెంబర్లు సుశీల, సురేందర్, జీపీ కార్మికులు పరమ ప్రభుదాస్, మల్కపురి శేఖర్, ముసలయ్య, చంద్రబాబు, చలపతి, ఏలియా, కుమారి, ప్రమీల, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.