పర్మినెంట్‌కు నోచని పంచాయతీ కార్మికులు జీవో 60 ప్రకారం జీతాలివ్వాలనే డిమాండ్‌

– 11 నెలలుగా జీతాలు పెండింగ్‌
– మల్లీపర్పస్‌ వర్కర్స్‌ విధానం మాకొద్దు
– 8 గంటల పనివిధానం.. పది లక్షల బీమా కావాలి
– 17 డిమాండ్లతో జేఎసీ ఆధ్వర్యంలో సమ్మె నోటీస్‌
– 6 నుంచి సమ్మెలోకి వెళ్లేందుకు సిద్దం
– అవార్డుల వెనుక కార్మికుల శ్రమ.. పేరు ప్రభుత్వానికి..
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
దుమ్ము ధూళి, మురికిలో మగ్గుతూ వారు నిత్యం ఊర్లను పరిశుభ్రం చేస్తారు.. పరిసరాల పరిశుభత్ర, పచ్చదనం పెంచుతారు.. పని వేళలంటూ లేక పొద్దస్తం ప్రజల సేవలోనే ఉంటారు. కడుక్కునేందుకు సబ్బు లేదు. తలకు నూనెలేదు. ఒంటికి బట్టలేదు. నెలంతా పనిచేసినా జీతం రాదు. ఏండ్ల తరబడిగా పనిచేస్తున్నా పర్మినెంట్‌ లేదు. ఉద్యోగోన్నతి రాదు. కనీస వేతనం కాదు కదా సదుపాయాలకు కూడా నోచుకోని దుర్భర జీవితాలు గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్లవి. గ్రామాలకు అవార్డులు.. ప్రభుత్వానికి పేరు ప్రఖ్యాతులు రావడానికి శ్రమిస్తున్న వీరి కష్టానికి ఫలితం మాత్రం దక్కడం లేదు. 17 రకాల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ జేఎసీ ఆధ్వర్యంలో సమ్మె నోటీస్‌ ఇచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా 12769 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిల్లో 50 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 647 గ్రామ పంచాయతీలు, సిద్దిపేట జిల్లాలో 499 పంచాయతీలు, మెదక్‌ జిల్లాలో 469 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిల్లో 5300 మంది కార్మికులు పని చేస్తున్నారు. స్వీపర్లు, పంపు ఆపరేటర్లు, కారోబార్లు, బిల్‌ కలెక్టర్లు, డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్ల పేర్లతో పనిచేస్తున్నారు. వీరంతా పేద, బలహీన వర్గాలకు చెందిన వారే. మేజర్‌ గ్రామ పంచాయతీల్లో 10 మంది, చిన్న పంచాయతీల్లో ఇద్దరు ముగ్గురితోనే పని చేయిస్తున్నారు. రోడ్లు ఊడ్చడం, చెత్త ఎత్తడం, మోరీల్ని శుభ్రం చేయడం, మానవుల, జంతువుల మలం, కుళ్లిపోయిన వ్యర్థాలను ఎత్తివేయడం, గ్రామానికి నీళ్లు అందించడం, వీధి లైట్లు వేయడం, ఇంటి, ఆస్తి, నల్లా పన్నులు వసూలు చేయడం, గ్రామ పంచాయతీ రికార్డులు రాయడం, ఉపాధి హామీ పనుల్ని చేయించడం, హరితహారం కింద నర్సరీలు నిర్వహించడం, మొక్కల్ని రక్షించడం, ట్రాక్టర్లు నడపడం, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడం వంటి పనులే కాకుండా గ్రామంలో ఏ ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినా పనులన్నీ చేయాలి.
ముఖ్యంగా కరోనా సమయంలో వీరి సేవలు విలువ కట్టలేనివి. గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్‌, వర్కర్ల శ్రమ ఫలితంగానే తెలంగాణలోని పదుల సంఖ్యలో గ్రామ పంచాయతీలు జాతీయ స్థాయిలో స్వచ్ఛ ఆవార్డుల్ని దక్కించుకున్నాయి. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలోనూ ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపికవుతున్నాయి. పేరు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వానికి వస్తుంది తప్ప శ్రమపడుతున్న సిబ్బందికి మాత్రం కనీస వేతనాలు దక్కట్లేదు. కరోనా కష్ట కాలంలో ఇంటింటికీ నిత్యావసరాలు అందించడం, కరోనా పేషెంట్లకు మందులిచ్చి సేవలు చేశారు. చనిపోతే అంత్యక్రియలు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
పెరగని జీతాలు..పెరిగిన పనిభారం
పంచాయతీ సిబ్బందికి వేతనాలు పెరగలేదు. కానీ..! పని భారం పెరిగింది. ఎన్నో పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.8500 జీతమిస్తుంది. ఆ తర్వాత పైసా పెంచలేదు. జీవో 51 తీసుకొచ్చి మల్టీపర్పస్‌ వర్కర్స్‌ విధానాన్ని తెచ్చి రకరకాల పనుల్ని ఒకే వ్యక్తితో చేయిస్తున్నారు. ఊరి పనులే కాదు ప్రభుత్వ పాఠశాలల్లోనూ పనులు చేయిస్తున్నారు. ట్రాక్టర్లు కొని వారితోనే పనిచేయిస్తున్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాల్సిన ప్రభుత్వ..ం కనీసం జీవో 60 ప్రకారం మున్సిపాలిటీల్లో ఇస్తున్న విధంగానైనా రూ.15600, రూ.19000, రూ.20000 చొప్పున పంచాయతీ ఎంప్లాయిస్‌, వర్కర్లకు ఇవ్వాలని జేఎసీ డిమాండ్‌ చేస్తుంది. ఇస్తున్న కొద్దిపాటి జీతాలు కూడా 11 నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ 12 సంవత్సరాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త కార్మికుల్ని నియమించారు. కొత్త వారికి అందరితో పాటు వేతనాలివ్వడంలేదు. పాత వారి వేతనాల నుంచే కొత్తవారికి పంచడంతో చాలా పంచాయతీల్లో రూ.4500 కూడా చేతికందని పరిస్థితి ఉంది.
6 నుంచి సమ్మె బాట
గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాలు రాష్ట్ర స్థాయిలో జేఎసీగా ఏర్పడ్డాయి. గ్రామ పంచాయతీ సిబ్బంది న్యాయమైన సమస్యల్ని పరిష్కరించకపోతే ఈ నెల 6 నుంచి సమ్మెలోకి వెళ్తామని స్పష్టం చేశాయి. ఇప్పటికే సమ్మె నోటీస్‌ను నేతలు రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌కు ఇచ్చారు. ప్రభుత్వం ఈ నెల 5 వరకు సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. సానుకూలంగా స్పందించకపోతే సమ్మె అనివార్యమని హెచ్చరించారు.
సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె
గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన సమస్యల్ని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. జేఎసీ ఇచ్చిన సమ్మె నోటీ స్‌కు స్పందించి సమస్యల్ని పరిష్కరించ కపోతే ఈ నెల 6 నుంచి కార్మికులు పనులు బంద్‌ చేసి సమ్మెలోకి వెళ్తారు. సమ్మె పోరాటంలో గ్రామ పంచా యతీ కార్మికులు, సిబ్బంది ఐక్యంగా పాల్గొనాలి. ప్రభు త్వంపై ఒత్తిడి తెచ్చి సమస్యల్ని పరిష్కరించుకోవాలి. ప్రభుత్వం స్పందించకపోతే గ్రామాల్లో పనులు బంద్‌ చేసి ఎంపీడీఓ కార్యాలయాల ముందు టెంట్లు వేసుకుని సమ్మె చేస్తాం.
– జి.సాయిలు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి
వెట్టి చేయిస్తున్న ప్రభుత్వం
మల్టీ పర్పస్‌ వర్కర్స్‌ విధానం తెచ్చి మాతో వెట్టి చేయిస్తున్నారు. అన్ని రకాల పనుల్ని చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. స్కూల్స్‌, ఊర్లో ఏ పనైనా మేమే చేయాలి. పొద్దస్తమానం పనిచేస్తున్నా జీతాలివ్వడం లేదు. ఎప్పుడో పెంచిన వేతనాలు.. పెరిగిన ధరలతో కుటుంబాలు గడవడమే కష్టంగా మారింది. మురికిలో పనిచేస్తున్న వర్కర్లకు కనీసం నూనెలు, సబ్బులు కూడా ఇవ్వట్లేదు. ప్రమాదాలు జరిగి ప్రాణం కోల్పోతున్నారు. వికలాంగులవుతున్నా పట్టించుకోవడంలేదు.
– దశరథ, గ్రామ పంచాయతీ,ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు.