ఉపాధి కూలీలకు నీళ్లందించే బాధ్యత పంచాయతీలదే

– నిర్ణయం తీసుకున్న రాష్ట్ర సర్కారు
– పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో ఉన్న ఎంజీఎన్‌ఆర్‌జీఎస్‌ మార్గదర్శకాల్లో భాగంగా పనిప్రదేశాల్లో నీటిని అందజేసే బాధ్యత పంచాయతీలే చూసుకోవాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ధనసరి అనసూయ (సీతక్క) బాధ్యతలను గురువారం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కుటుంబ సభ్యులతో పాటు ఎమ్మెల్యేలు నాగరాజు, నాయిని రాజేందర్‌ రెడ్డిలతోపాటు పలువురు ఎమ్మెల్యేలు పంచాయితీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, కమిషనర్‌ హనుమంత రావు, కార్యదర్శి స్మితా సబర్వాల్‌ వివిధ శాఖల ఉన్నతాధికారులు మంత్రిని కలసి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణ పేదిరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) ఆధ్వర్యంలో 200 వ్యవసాయ యంత్రాల అద్దె కేంద్రాలను మండల సమాఖ్యల ఆధ్వర్యంలో ప్రతి మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటుకు ఆమె ఆమోదం తెలిపారు. ఆ ఫైలుపై సంతకం చేశారు. రాష్ట్రంలో 3989 మినీ అంగన్‌ వాడీ కేంద్రాలుగా ఉన్నాయి. వాటిని మెయిన్‌ కేంద్రాలుగా మార్చుతూ ఆమోదం తెలిపారు. 3989 మంది అంగన్‌వాడీ సహాయకులను అదనంగా నియమించుకోవడానికి ఆమోదం తెలుపుతూ సంతకం చేశారు. 35,700 అంగన్‌వాడీ కేంద్రాలలో పిల్లల నాలుగు రకాల బరువు, ఎత్తు కొలుచేందుకు పోషణ్‌ అభియాన్‌ 2.0 పథకం క్రింద 28.56 కోట్ల రూపాయల (కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు) మంజూరుకు సంబంధించిన ఫైలుపై మంత్రి సంతకం చేశారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున శిశు సంరక్షణ(క్రెచ్‌) కేంద్రాలను అంగన్‌వాడీ కేంద్రాలతో అనుసంధానించడానికి నిర్ణయం జరిగింది. ఈ కేంద్రాలు ఆరు నెలల నుంచి ఆరేండ్ల పిల్లల కోసం నడుపుతారు. ఈ కేంద్రాల్లో అంగన్‌వాడీ సిబ్బందితో పాటు అదనంగా ఇద్దరు శిశు సంరక్షకులను నియమిస్తారు. ఇందుకోసం రూ.1,27,24,800 నిధులను కేటాయించారు. ఉపాధి కూలీలకు నీటిని సరఫరా చేసే బాధ్యత పంచాయతీలదే. ప్రతి కూలీకి రూ.2.5 చొప్పున కనీసం రెండు లీటర్ల నీటిని అందించాలి. దానికి సంబంధించిన బిల్లులను ఎంపీడీఓలకు, పీఓలకు గ్రామ కార్యదర్శులు అందజేయాల్సి ఉంటుంది.