‘శివాజీ కౌన్ హాతా’ పుస్తక రచయిత, హేతువాద ప్రచారకర్త, కార్మిక నాయకుడు గోవింద్ పన్సారే హత్య కేసు నిందితులకు గతవారం బొంబాయి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ సందర్భంగా సింగిల్ బెంచి న్యాయమూర్తి చేసిన వ్యాఖ్య గమనించదగింది. ‘ఈ కేసులో ఇప్పటికీ ప్రాసిక్యూషన్ తగిన సాక్ష్యాలను కోర్టుముందు ఉంచలేదు. కేసు ఇప్పట్లో ముగిసే సూచనలు లేవు. కనుక నేను బెయిల్ ఇసున్నాను’ అని చెప్పారు. ఆ హత్యకేసులో పన్నెండుమందిపై కేసు బుక్కయింది. కాని పదేండ్లకాలంలో పదిమందినే అరెస్టు చేశారు. మరో ఇద్దరు ఇంకా పరారీలోనే ఉన్నారు. నరేంద్ర దబోల్కర్, కల్బుర్గి, గౌరి లంకేశ్ కేసుల్లో కూడా వీరే నిందితులు. 2015 ఫిబ్రవరి 16న మహారాష్ట్రలోని కొల్హాపూర్ నగరంలో 82ఏండ్ల పన్సారేతో పాటు ఆయన భార్య ఉమ పన్సారేపై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి పారిపోయారు. బుల్లెట్ గాయాలతో నాలుగు రోజుల అనంతరం పన్సారే అస్పత్రిలో మరణించారు. పన్సారే న్యాయవాది, సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి. వ్యవసాయ కూలీ కుటుంబం నుండి వచ్చినవాడు. చదువు కోసం కొంతకాలం ఒక కళాశాలలో ప్యూన్‌గా పనిచేస్తూ ఉన్నత చదువులు చదువుకుని అదే కళాశాలలో కొద్దిరోజులు అధ్యాపకుడిగా పనిచేసిన మేధావి. కాగా కేసులోని నిందితులకు బెయిల్ ఇవ్వరాదని పన్సారే కోడలు పెట్టుకున్న ఫిటిషన్‌ను న్యాయమూర్తి తోసి పుచ్చారు.
అండర్ ట్రయల్స్ ఉన్న పదిమందిలో ఆరుగురికి న్యాయమూర్తి బెయిల్ ఇచ్చారు. మరో ఆరునెలల్లో దర్యాప్తు పూర్తవుతుందని, బెయిలివ్వొద్దని ప్రాసిక్యూషన్ చేసిన వాదనను న్యాయమూర్తి పట్టించుకోలేదు. ప్రధాన నిందితుడు వీరేంద్ర సిన్హ్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను విచారణ కోసం న్యాయమూర్తి వాయిదా వేశారు. ఈ కేసు పరిష్కారం కావడం లేదు గనుక దర్యాప్తును 2022 ఆగస్టులో యాంటీ టెర్రిస్టు స్క్వాడ్‌కు అప్పగించారు అయినా కొలిక్కి రాలేదు. నిందితులకు శిక్షపడలేదు. నిందితుల్లో ఇద్దరిని ఉమ పన్సారే గుర్తుపట్టారు కూడా. బెయిల్ పొందిన ఆరుగురినీ కూడా 2018-19ల మధ్య మాత్రమే పోలీసులు అరెస్టు చేశారంటే వారు సాధారణ హంతకులు కాదని చాలా పెద్ద నెట్‌వర్క్‌గల వారని తెలిసిపోతోంది.
చత్రపతి శివాజీపై పన్సారే పరిశోధనలు చేసి ఒక పుస్తకం ప్రచురించాడు. దానికితోడు అనేక పట్టణాల్లో తిరుగుతూ, శివాజీపై ఉన్న మూఢనమ్మకాలను తొలగిస్తూ ప్రసంగాలు చేశాడు. దీన్ని జీర్ణించుకోలేని మతోన్మాదులు పన్సారేను పొట్టన పెట్టుకున్నారు. ముస్లింలపై విద్వేషం రగల్చాడని శివాజీని మత రాజకీయవాదులు ఉపయోగించు కున్నారు. ఇప్పటికీ అదే పనిచేస్తున్నారు. వారు అనుసరించిన ఎత్తుగడను పన్సారే పుస్తకం ఎండగట్టింది. ఆయ న్ను మట్టుబెట్టడం ద్వారా తమ ఎత్తుగడకు ఢోకా లేకుండా చేసుకోవచ్చని మతవాదులు భావించారు. కానీ వారు ఊహించిన దానికి భిన్నంగా జరిగింది. ఆయన మరణించాక ఆ పుస్తకం ఇంగ్లీషుతో సహా ఎనిమిది భాషల్లో వెలువడి కొన్ని మాసాల్లోనే లక్ష కాపీల వరకు అమ్ముడు పోయింది. శివాజీ 17వ శతాబ్దపు రాజే అయినా ఆయన చుట్టూ అల్లిన కథలు, నాటకాలు, మరాఠీ జానపద సాహిత్యం ఆయన్ని సజీవంగా ఉంచాయి. వాటిలో కల్పితాలే ఎక్కువ. మహారాష్ట్రతో పాటు ఆయన ప్రభావం తెలంగాణలోనూ, హిందీ రాష్ట్రాల్లోనూ కన్పిస్తుంది. తెలంగాణలోని చాలా పట్టణాల్లో హిందూ వాహిని పేర పెద్దపెద్ద విగ్రహాలు నెలకొల్పారు. ఏం చెప్పినా మహారాష్ట్రలో నేటికీ చెల్లుబాటు అవుతుంది. కనుక మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసే శివసేనకు,బీజేపీకి శివాజీ మహదవకాశంగా కన్పించాడు. ప్రస్తుతం డిస్ని హాట్ స్టార్ చానెల్‌లో శివాజీ ఖజానా చుట్టూ అల్లిన కట్టుకథతో ‘షిలేదార్’ అనే సీరియల్ స్ట్రీమ్ అవుతోంది. శివాజీని దాన్ని అడ్డుపెట్టుకొని మత భావనలు చెదరకుండా చూసే ప్రయత్నం ఆ సీరియల్‌లో కన్పిస్తుంది.
ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు, మూఢ నమ్మకాల వ్యాప్తికి సంబంధం ఉంది. కనుకే మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసే బాధ్యతను కూడా కార్మిక నాయకుడైన పన్సారే చేపట్టారు. 1869లో శివాజీ పై జోతిరావు ఫూలే దీర్ఘకవిత (పోవడా) రాశారు. అందులో పురోహిత వర్గం కుయుక్తులకు, మహారాష్ట్ర ద్రోహులకు వ్యతిరేకంగా పోరాడిన యోధునిగా శివాజీని అభివర్ణించారు. రైతులకు శివాజీ చేసిన మేలేమిటో ఫూలే తన దీర్ఘకవితలో ప్రస్తావించారు. ఫూలే రచనలు కూడా శివాజీ పై పరిశోధనకు పన్సారే ప్రేరేపించాయి. శివాజీపై హిందూ మతవాదులు చేసే అన్వయం వాస్తవం కాదని పన్సారే ఎలుగెత్తి చాటారు. అందుకు ఆధారంగా శివాజీ తన సైనిక దళాలకు, శిస్తు వసూల్ అధికారులకు రాసిన లేఖలను ఉదహరించారు. ఔరంగజేబుపై శివాజీ చేసిన పోరాటం మతదృష్టితో చేసింది కాదు. మహారాష్ట్రను తన అధీనంలోకి తెచ్చుకోవాలని చక్రవర్తి ఔరంగజేబు ప్రయత్నించిన మాట నిజం. రాజ్య విస్తరణకు పూనుకోవడం రాజులందరూ చేసిన పనే. హైదరాబాదు (గోల్కొండ)ను ముస్లిం రాజే పాలిస్తున్నప్పటికీ దాన్ని కూడా ఔరంగజేబు తన అధీనంలోకి తెచ్చు కోవాలనుకొన్నాడు. హైదరాబాదుపై జరిపిన సుదీర్ఘ దండయాత్రలో రెండవసారి సఫలమయ్యాడు. కాని శివాజీపై ఔరంగజేబుకు పూర్తి విజయం లభించలేదు.
శివాజీ సైన్యంలోనూ, యంత్రాంగంలోనూ, కీలక పదవుల్లో ముస్లింలున్నారు. 1659లో ఔరంగజేబు దూతగా వచ్చిన కపటి అఫ్జల్‌ఖాన్‌ను శివాజీ చంపేశాడు. ఆ తర్వాత అఫ్జల్‌ఖాన్ శవాన్ని పూర్తి సైనిక లాంఛనాలతో ఖననం చేయించి సమాధి సంరక్షణ కోసం నిధులు మంజూరు చేశారు. ముస్లిం మత వ్యతిరేకే అయి ఉంటే ఆ పని చేసేవాడా? ఆ మతం శివాజీ పై దండయాత్ర కోసం హిందువైన రాజా జై సింగ్‌ను ఔరంగజేబు పంపారు. శివాజీ ఓటమి కోసం మహారాష్ట్ర బ్రాహ్మణులు జైసింగ్ చేత యజ్ఞం చేయించారు. నాజీల తరహాలో ఇతర మతస్థులపై శివాజీ నరమేధం సాగించలేదు. శివాజీని ఆదర్శంగా చెప్పుకునే మత పార్టీలు అందుకు భిన్నంగా వేలాది మందిని బలిగొన్న ఘటనలను మనం చూశాం.
యూరోప్‌లో మాదిరిగా మత యుద్ధాలు భారతదేశంలో జరగలేదు. హిందు రాజుల దగ్గర కీలక స్థానాల్లో ముస్లింలు, ముస్లిం రాజుల దగ్గర కీలక స్థానాల్లో హిందువులు పనిచేశారు. మొఘల్, కుతుబ్ షాహిల, అసఫ్ జాహిల, బీజపూర్, శివాజీ ఎవరి చరిత్రను చూసినా ఈ విషయం కనపడుతుంది. మొగలు చక్రవర్తి నవరత్నాల్లో బీర్బల్, తాన్‌సేన్‌లు ఉన్నారు. ఆయన ఆర్థిక మంత్రి రాజా తోడర్ మల్, సైన్యాధ్యక్షుడూ పనిచేసినవాడు రాజామాన్ సింగ్, అతను అక్బర్ బావమరిది కూడా గోల్కొండ కుతుబ్‌షాహిల దగ్గర అక్కన, మాదనలు కీలక స్థానాల్లో ఉన్నారు. హైదరాబాదు అసఫ్ జాహీల దగ్గర రాజా కిషన్ ప్రసాద్ లాంటి వారు మంత్రిత్వం నెరిపారు. బీజాపూర్ సుల్తాన్ దగ్గర తమకు నెలవారి వేతనాలు సరిగ్గా అందడం లేదంటూ తన దగ్గరకు వచ్చిన వేయిమంది ముస్లిం పఠాన్లను శివాజీ తన సైన్యంలో చేర్చుకున్నారు. శివాజీ అనంతరం పేష్వాల పాలనలో కూడా వారి అంతపురం శనివార్‌వాడకు అఫ్ఘాన్‌గార్డులు కాపలా కాసేవారు. 1857లో ఝాన్సీరాణి కోటను చుట్టుముట్టిన కంపెనీ సైన్యానికి అఫ్ఘాన్ రక్షకదళం గట్టి ప్రతిఘటనను ఇచ్చింది. హిందూ, ముస్లిం రాజులు భారతీయ బ్రిటిష్ సైనికులు కలిసి తిరుగుబాటు చేశారు. ఆ మొదటి స్వాతంత్య్ర పోరాటానికి నామమాత్రంగానైనా సరే నాయకత్వం వహించినవాడు, చివరి మొగల్ చక్రవర్తి బహద్దూద్ షా జఫర్. ఆ తిరుగుబాటును అణిచేసిన ఇంగ్లీషు ప్రభుత్వం ఆయన్ని రంగూన్ జైల్లో బందీ చేసింది. ఆయన అక్కడే చనిపోయాడు. ఛత్రపతి శివాజీకి భవానిమాత ప్రత్యక్షమై ముస్లింలపై పోరాడేందుకు ఒక ఖడ్గం బహుకరించిందంటూ ఒక కట్టుకథ విస్తృత ప్రచారంలో ఉంది. నిజమేమిటంటే అది శివాజీకి పోర్చుగీసు వారు బహుకరించిన ఖడ్గమని, మ్యూజియంలో ఉన్న ఆ ఖడ్గంపై పోర్చుగీసు అక్షరాలున్నాయని పన్సారే ఎత్తిచూపారు. శివాజీ సైన్యంలో కనీసం పదమూడు మంది ముస్లిం సైనిక కమాండర్లు ఉండేవారు.
ఏ పరిస్థితుల్లో చేసినా శివాజీ తనరాజ్యంలో రైతులకు మేలుచేసే పలు చర్యలు చేపట్టారు. శిస్తు వసూల్ అధికారాలను ఫూడల్ యంత్రాంగం నుండి తొలగించి అందుకు అధికారులను నియమించారు. పాటిల్, దేశ్‌ముఖ్, వతందార్, ఇనాందార్ల అధికారాలను కత్తిరించారు. కనుకనే కులీనులు శివాజీని రాజుగా గుర్తించలేదు.శూద్రకులాలు శివాజీ వెంట నిలబడ్డాయి. వారి మద్దతుతో ఆయన తన రాజ్యాన్ని విస్తరించారు. శివాజీ నెలకొల్పిన విధానాలను పేష్వాలు తమ పాలనలో కూల్చేశారు. గ్రామ పెత్తందార్లు తమ పెత్తనాన్ని పునరుద్ధరించుకున్నారు. శివాజీకి ఆనాడు మద్దతుగా నిల్చిన వారిని రాచిరంపాన పెట్టారు. ఓటమిపాలైన శత్రురాజ్యాల్లోని మహిళల పట్ల శివాజీ చూపిన గౌరవమర్యాదల్ని పన్సారే ఉదాహరణతో చెప్పారు.
రైతుల నుండి శిస్తు వసూల్ చేస్తున్నప్పుడు నడుచుకోవాల్సిన పద్ధతి గురించి 1671 సెప్టెంబర్ 6వ తేదిన శివాజీ తన సుబేదార్ ఒకరికి రాసిన ఒక లేఖ పూర్తి పాఠాన్ని పన్సారే తన పుస్తకంలో ప్రచురించారు. ”అధికారులు ప్రతి గ్రామం వెళ్లాలి. గ్రామంలో కౌల్దార్లందరినీ ఒక చోటుకి రమ్మనాలి. కౌల్దారు ఎంత మానవశ్రమ సమకూర్చుకోగలడో, అతని సామర్థ్యం ఎంతో నిర్ధారించుకోవాలి. దాన్నిబట్టి భూమిని ఆ రైతుకు ఇవ్వాలి. రైతు దగ్గర ఎడ్లు లేకపోతే ఒక జత ఎడ్లు ఇప్పించాలి. ఆహారం కోసం తిండిగింజలు కొలవాలి. ఆ రూపంలో ప్రభుత్వం ఇచ్చిన వడ్డీలేని అప్పును రైతులు చెల్లించగల స్థితిలో ఉన్నప్పుడు తీసుకోవాలి. రైతు పంట నష్టపోతే ఆ యేడు శిస్తు రద్దుచేయాలి. అందుబాటులో ఉన్న భూమినంతా సేద్యం కిందికి తేవాలి.
సైనికాధికార్లకు శివాజీ 1673 మే 19న ఒక లేఖ రాశారు. రైతుల నుండి తిండిగింజలు, గుర్రాలకు గడ్డి బలవంతంగా లాక్కోరాదు. సైన్యానికి అవసరమైన తిండిగింజలు, గడ్డి, వంటచెరుకు, కూరగాయలు డబ్బులిచ్చి కొనాలి. వాటికి మేము మీకు కేటాయించిన ధనం సరిపోతుంది. పంటపొలాల గుండా గుర్రాలతో పంటల్ని నష్టపరచరాదు. నావికా దళానికి కావాల్సిన పనసకర్ర కోసం రైతు అంగీకారంతో డబ్బు చెల్లించాకే చెట్టుపై చేయివేయాలి. మనుస్మృతికి భిన్నంగా ఉన్నత కులాలవారు చేసిన నేరాలకు కూడా శివాజీ కఠిన శిక్షలు వేశారు.
ఎస్. వినయ కుమార్
9989718311