పంత్‌@27కోట్లు

పంత్‌@27కోట్లు– ఐపీఎల్‌ వేలంలో రిషబ్‌ పంత్‌కు రికార్డు ధర
– శ్రేయస్‌కు రూ.26.75 కోట్లు, అయ్యర్‌కు రూ.23.75 కోట్లు
నవతెలంగాణ-జెడ్డా
ఐపీఎల్‌ 2008 ఆటగాళ్ల వేలంలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఎం.ఎస్‌ ధోని రికార్డు ధరతో చరిత్ర సృష్టించిన సన్నివేశం 2024 ఆటగాళ్ల మెగా వేలంలో పునరావృతం అయ్యింది. యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌ ఐపీఎల్‌ వేలం చరిత్రలోనే అత్యధిక ధర సొంతం చేసుకున్నాడు. రూ.27 కోట్ల భారీ ధరతో లక్నో సూపర్‌జెయింట్స్‌ పంత్‌ను దక్కించుకుంది. శ్రేయస్‌ అయ్యర్‌ సైతం కండ్లుచెదిరే ధర సాధించాడు. పంజాబ్‌ కింగ్స్‌ రూ.26.75 కోట్లకు గత సీజన్‌ టైటిల్‌ నెగ్గిన కెప్టెన్‌ను సొంతం చేసుకుంది. యువ ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ ఊహించన రీతిలో రూ.23.75 కోట్లు దక్కించుకున్నాడు. విదేశీ ఆటగాళ్లలో జోశ్‌ బట్లర్‌ రూ.15.75 కోట్లు (గుజరాత్‌ టైటాన్స్‌), మిచెల్‌ స్టార్క్‌ 11.75 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్‌), కగిసో రబాడ రూ.10.75 కోట్లు (గుజరాత్‌ టైటాన్స్‌) ఆకర్షణీయ ధర దక్కించుకున్నారు. సౌదీ అరేబియా రాజధాని జెడ్డా వేదికగా ఐపీఎల్‌ 2025 ఆటగాళ్ల మెగా వేలం ఆదివారం మొదలైంది. డెవిడ్‌ వార్నర్‌, జానీ బెయిర్‌స్టో, దేవదత్‌ పడిక్కల్‌, ఉమేశ్‌ యాదవ్‌లను ఎవరూ తీసుకోలేదు.
సరికొత్త చరిత్ర : ఐపీఎల్‌ వేలంలో రిషబ్‌ పంత్‌ చరిత్ర సృష్టించాడు. పంత్‌ కోసం లక్నో సూపర్‌జెయింట్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ పోటీపడ్డాయి. ధర రూ.10 కోట్లు దాటిన తర్వాత సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎంట్రీ ఇచ్చింది. లక్నోతో రూ. 20.50 కోట్ల వరకు పోటీపడింది. రూ.20.75 కోట్లతో వేలంలో లక్నో దక్కించుకోగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆర్‌టీఎం కార్డ్‌ ప్రయోగించింది. దీంతో రూ.27 కోట్ల ఫైనల్‌ బిడ్‌తో లక్నో సూపర్‌జెయింట్స్‌ స్టార్‌ ఆటగాడిని దక్కించుకుంది. శ్రేయస్‌ అయ్యర్‌ సైతం రికార్డు ధర అందుకున్నాడు. కోల్‌కత నైట్‌రైడర్స్‌, పంజాబ్‌ కింగ్స్‌తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌ శ్రేయస్‌పై ఆసక్తి చూపించాయి. కోల్‌కత ఆర్‌టీఎం వాడుకోలేదు. దీంతో రూ.26.75 కోట్లకు శ్రేయస్‌ అయ్యర్‌ పంజాబ్‌ గూటికి చేరుకున్నాడు. రూ.26.50 కోట్ల వరకు ఢిల్లీ క్యాపిటల్స్‌ శ్రేయస్‌ కోసం ప్రయత్నించింది. పేసర్‌ అర్షదీప్‌ సింగ్‌ను పంజాబ్‌ కింగ్స్‌ తిరిగి తీసుకుంది. ఆర్‌టీఎంతో రూ.18 కోట్లకు కొనుగోలు చేసింది. జోశ్‌ బట్లర్‌, కగిసో రబాడలు గుజరాత్‌ టైటాన్స్‌ గూటికి చేరారు. మిచెల్‌ స్టార్క్‌ను ఢిల్లీ తీసుకుంది. ఆరుగురు దిగ్గజ ప్లేయర్ల మొదలైన వేలం.. రికార్డు ధరతో ప్రకంపనలు సృష్టించింది.
వెంకటేశ్‌ వావ్‌ : యువ ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ కోసం ప్రాంఛైజీలు పోటీపడ్డాయి. మంచి పేస్‌, ధనాధన్‌ బ్యాటింగ్‌తో అయ్యర్‌ విలువైన ఆల్‌రౌండర్‌గా పేరు గడించాడు. కోల్‌కత మొదటి నుంచి అయ్యర్‌ కోసం పోటీపడింది. లక్నో, బెంగళూర్‌ సైతం రేసులో నిలిచినా రూ.23.75 కోట్లతో అయ్యర్‌ను కోల్‌కత దక్కించుకుంది. వెంకటేశ్‌ అయ్యర్‌ కోసం రూ.23.75 కోట్ల వరకు వెళ్లిన కోల్‌కత.. శ్రేయస్‌ అయ్యర్‌ను రూ.10 కోట్ల తర్వాత పట్టించుకోలేదు. కెఎల్‌ రాహుల్‌ రూ.14 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లాడు. హ్యారీ బ్రూక్‌ రూ.6..25 కోట్లు, జేక్‌ ఫ్రేసర్‌ మెక్‌గుర్క్‌ రూ.9 కోట్లకు, నటరాజన్‌ రూ.10.75 కోట్లకు క్యాపిటల్స్‌కు దక్కారు. ఆఫ్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ మళ్లీ సూపర్‌కింగ్‌ అయ్యాడు. రూ.9.75 కోట్లకు చెన్నై అతడిని తీసుకుంది. డెవాన్‌ కాన్వే రూ.6.25 కోట్లు, రాహుల్‌ త్రిపాఠి రూ.3.40 కోట్లు, రచిన్‌ రవీంద్ర రూ.4 కోట్లు, అఫ్గాన్‌ స్పిన్నర్‌ నూర్‌ అహ్మద్‌ రూ.10 కోట్లకు సూపర్‌కింగ్స్‌కు శిబిరంలో చేరారు.
సన్‌రైజర్స్‌ సూపర్‌ : సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వేలంలో మంచి వ్యూహం అమలు చేసింది. మహ్మద్‌ షమి రూ.10 కోట్లు, హర్షల్‌ పటేల్‌ రూ.8 కోట్లు, రాహుల్‌ చాహర్‌ రూ.3.20 కోట్లు, ఆడం జంపా రూ.2.40 కోట్లు, ఇషాన్‌ కిషన్‌ రూ.11.25 కోట్లతో కొనుగోలు చేసింది. హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ రూ.12.25 కోట్లకు గుజరాత్‌ టైటాన్స్‌కు దక్కాడు. ప్రసిద్‌ కృష్ణ రూ.9.50 కోట్లకు టైటాన్స్‌తో చేరాడు. క్వింటన్‌ డికాక్‌ (రూ.3.60 కోట్లు), రెహ్మనుల్లా గుర్బాజ్‌ (రూ.2 కోట్లు), రఘువంశీ (రూ. 3 కోట్లు), నోకియా (రూ.6.50 కోట్లు)ను కోల్‌కత కొనుగోలు చేసింది. నమన్‌ ధిర్‌ (రూ.5.25 కోట్లు), రాబిన్‌ (రూ.0.65 కోట్లు), ట్రెంట్‌ బౌల్ట్‌ (రూ.12.50 కోట్లు)ను ముంబయి ఇండియన్స్‌ తీసుకుంది.