పంత్‌ వస్తున్నాడు

పంత్‌ వస్తున్నాడు– మహ్మద్‌ షమి, ప్రసిద్‌ కృష్ణ అవుట్‌
– ఫిట్‌నెస్‌పై బీసీసీఐ ప్రకటన
ఏడాదిన్నరకు పైగా విరామానికి తెర పడనుంది. రోడ్డు ప్రమాదంలో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిన భారత స్టార్‌ క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. 14 నెలల కఠోర రిహాబిలిటేషన్‌ అనంతరం రిషబ్‌ పంత్‌ మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించినట్టు బీసీసీఐ వెల్లడించింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2024లో వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌గా ఆడేందుకు ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌ ఇచ్చింది. మార్చి 23న ఢిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ మ్యాచ్‌తో రిషబ్‌ పంత్‌ పునరాగమనం చేయనున్నాడు.
నవతెలంగాణ-బెంగళూర్‌ :
భారత క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రిషబ్‌ పంత్‌ రీ ఎంట్రీకి ముహూర్తం కుదిరింది. 2022, డిసెంబర్‌ 30న రూర్కీ సమీపంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్‌ పంత్‌.. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిన సంగతి తెలిసిందే. ప్రమాదంలో రిషబ్‌ పంత్‌ తీవ్రంగా గాయాల పాలవగా.. అతడికి అంతర్జాతీయ వైద్య నిపుణులు పలు శస్త్రచికిత్సలు చేశారు. అనంతరం బెంగళూర్‌లోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో 14 నెలలు కఠోర రిహాబిలిటేషన్‌ పూర్తి చేసుకున్నాడు. రీ ఎంట్రీపై కన్నేసిన రిషబ్‌ పంత్‌ బెంగళూర్‌ శివారులోని ఆలూరు గ్రౌండ్స్‌లో ఎన్‌సీఏ ఫిజియోల సమక్షంలో మ్యాచ్‌ ప్రాక్టీస్‌ చేసిన సంగతి తెలిసిందే. రిషబ్‌ పంత్‌ ఫిట్‌నెస్‌ పురోగతి, మ్యాచ్‌ ప్రాక్టీస్‌ అనంతరం రానున్న ఐపీఎల్‌ 2024లో అతడు ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని ఎన్‌సీఏ నివేదిక ఇచ్చింది. దీంతో రిషబ్‌ పంత్‌ 2024 ఐపీఎల్‌కు అందుబాటులో ఉన్నాడని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం మెడికల్‌ అప్‌డేట్‌ ఇచ్చింది.
ఫిట్‌నెస్‌ సాధించాడు :
‘2022 డిసెంబర్‌ 30న జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి రిషబ్‌ పంత్‌ కోలుకున్నాడు. ఐపీఎల్‌ 2024లో ఆడేందుకు పంత్‌ మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించాడు. వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌గా రిషబ్‌ పంత్‌ రానున్న ఐపీఎల్‌లో ఆడవచ్చు’ అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. బీసీసీఐ ప్రకటనకు ముందే, బోర్డు కార్యదర్శి జై షా కీలక వ్యాఖ్యలు చేశారు. రిషబ్‌ పంత్‌ 2024 టీ20 ప్రపంచకప్‌లో ఆడితే భారత్‌కు బోనస్‌గా ఉంటుందని తెలిపాడు. ‘రిషబ్‌ పంత్‌ ప్రాక్టీస్‌లో వికెట్‌ కీపింగ్‌తో పాటు బ్యాటింగ్‌ బాగా చేస్తున్నాడు. రానున్న టీ20 ప్రపంచకప్‌లో రిషబ్‌ పంత్‌ ఆడితే అది భారత్‌కు పెద్ద అనుకూలత అవుతుంది. భారత క్రికెట్‌కు రిషబ్‌ పంత్‌ విలువైన ఆటగాడు. వికెట్‌ కీపింగ్‌ చేయగలిగితే ప్రపంచకప్‌లో ఆడేందుకు మార్గం సుగమం అవుతుంది. ఐపీఎల్‌లో పంత్‌ ఏం చేస్తాడో చూద్దాం’ అని జై షా అన్నాడు. ఇక రిషబ్‌ పంత్‌ బెంగళూర్‌లో కఠోర సాధన చేస్తున్నాడు. ఆళూరు గ్రౌండ్స్‌లో రిషబ్‌ పంత్‌ ఫిబ్రవరి నుంచి సుమారు 20 మ్యాచ్‌ అనుకరణ కసరత్తులు చేశాడు. ఎన్‌సీఏ నిపుణుల ఆధ్వర్యంలో 20 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేశాడు. ఈ సమయంలో పంత్‌ ఎటువంటి అసౌకర్యానికి గురి కాలేదని ఎన్‌సీఏ ఫిజియోలు నివేదికలో పేర్కొన్నారు. అయితే, రిషబ్‌ పంత్‌ వికెట్‌ కీపింగ్‌ సాధన మార్చిలోనే మొదలైంది. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు రిషబ్‌ పంత్‌ సారథ్యం వహిస్తాడని ఆ ప్రాంఛైజీ యజమాని పార్థ్‌ జిందాల్‌ ప్రకటించాడు. అయితే, ఐపీఎల్‌ ప్రథమార్థం మ్యాచుల్లో పంత్‌ స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గా ఆడనున్నాడు. మ్యాచ్‌ సందర్భంగా రిషబ్‌ పంత్‌ ఫిట్‌నెస్‌పై ఓ అంచనాకు వచ్చిన తర్వాతే వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలు తీసుకుంటాడని ప్రాంఛైజీ స్పష్టం చేసింది.
ఆ ఇద్దరు అవుట్‌ :
భారత సీనియర్‌ పేసర్‌, 2023 ఐసీసీ ప్రపంచకప్‌ హీరో మహ్మద్‌ షమి, యువ పేసర్‌ ప్రసిద్‌ కృష్ణలు 2024 ఐపీఎల్‌కు దూరమయ్యారు. ఐపీఎల్‌ 2023లో మహ్మద్‌ షమి గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున 23 వికెట్లు పడగొట్టాడు. టైటాన్స్‌ రన్నరప్‌గా నిలువగా షమి పర్పుల్‌ క్యాప్‌ అందుకున్నాడు. హార్దిక్‌ పాండ్య సేవలు ముంబయికి కోల్పోయిన టైటాన్స్‌కు మహ్మద్‌ షమి లేకపోవటం పెద్ద లోటు. రంజీ ట్రోఫీలో కర్ణాటక తరఫున ఆడుతూ గాయపడిన ప్రసిద్‌ కృష్ణ వరుసగా రెండో సీజన్‌కు రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆడటం లేదు. ఈ ఇద్దరూ ఎప్పుడు అందుబాటులోకి వస్తారు, మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధిస్తారనే అంశాలపై బోర్డు స్పష్టత ఇవ్వలేదు.