– ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ గంగూలీ
న్యూఢిల్లీ : కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ప్రాణాపాయం నుంచి బయటపడిన యువ క్రికెటర్ రిషబ్ పంత్ 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడతాడని ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంఛైజీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ సౌరవ్ గంగూలీ అన్నారు. బెంగళూర్‌లోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో సాధన చేస్తున్న రిషబ్ పంత్ మ్యాచ్ ఫిట్‌నెస్ స్థాయికి అతి చేరువలో ఉన్నాడని సమాచారం. ‘రిషబ్ పంత్ ఇప్పుడు బాగున్నాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌లో పంత్ ఆడతాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు నాయకత్వం వహిస్తాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ శిక్షణ శిబిరంలో పంత్ ప్రాక్టీస్ చేయటం లేదు. అందుకు చాలా సమయం ఉంది. ఇక్కడ జట్టు గురించి చర్చిస్తున్నాం. పంత్ జట్టుకు నాయకుడు. వచ్చే ఆటగాళ్ల వేలంపై పంత్ తన ఆలోచనలను పంచుకున్నాడు’ అని సౌరవ్ గంగూలీ తెలిపారు. ఢిల్లీ క్యాపిటల్స్ శిక్షణ శిబిరం గురువారం కోల్‌కతలోని జాదవ్‌పుర్ యూనివర్శిటి గ్రౌండ్‌లో ఆరంభమైంది. ఈ సందర్భంగా ట్రైనింగ్ క్యాంప్‌కు రిషబ్ పంత్ హాజరయ్యాడు.